CM Revanth Reddy: వర్సిటీలపై కేంద్రం పెత్తనం సహించం
ABN, Publish Date - Jan 27 , 2025 | 03:52 AM
దీనికి సంబంధించిన ముసాయిదాను రాష్ట్రాలకు పంపిందని, తాము దీనిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివే నని, రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తోందని ఆరోపించారు.
యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాలపై దండయాత్ర
వీసీలను కేంద్రం నియమిస్తానంటే ఊరుకోం
తెలంగాణ సమాజంపై అవగాహన కలిగిన
ప్రొఫెసర్లను వీసీలుగా నియమించాం
రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రె్‌సదే అధికారం
పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష
ప్రధానికి లేఖ రాస్తా: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో 15 అడుగుల
అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ
వర్సిటీలో నాలుగు భవనాలకు శంకుస్థాపన
హైదరాబాద్ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాల్లోని యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం చేస్తానంటే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాల పరిధిలో జరిగే వైస్‌చాన్స్‌లర్ల నియామకాన్ని యూజీసీ ద్వారా కేంద్రం చేపట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. దీనికి సంబంధించిన ముసాయిదాను రాష్ట్రాలకు పంపిందని, తాము దీనిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివే నని, రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలను అడ్డుకునేందుకు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు అవసరమైతే నిరసన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 15 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
విశ్వవిద్యాలయ ఆవరణలో నాలుగు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చే శారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. యూనివర్సిటీలపై రాష్ట్రానికి ఉండే హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. ఈ కుట్రలను ఎలాగైనా అడ్డుకుంటామని ప్రకటించారు. యూజీసీ నిబంధనలపై తమిళనాడు, కేరళ, ఏపీ సీఎంలతో మాట్లాడుతానన్నారు. కేంద్రం చేస్తున్న మార్పులను మేధావులు, విద్యావేత్తలు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి విదివిధానాలు రూపొందిస్తునట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సీనియర్ ప్రొఫెసర్ల సేవలను ఉపయోగించుకునేలా వారి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే ప్ర తిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీలకు పీసీలుగా తెలంగాణ సమాజంపై అవగాహన ఉన్నవారిని, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని నియమించామన్నారు.
అంబేడ్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తామని ప్రకటించారు. లక్ష మంది దళిత, పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమం అమలు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదని, అంబేడ్కర్ చెప్పిన విధంగా సామాజిక స్ఫూర్తితో ప్రభుత్వ పథకాలు, సేవలను చిట్టచివరి వ్యక్తికి అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రె స్ ప్రభుత్వమే ఉంటుందని, ప్రజలు తమకు అవకాశమిస్తారన్నారు. అన్ని వర్సిటీల వీసీలు పదేళ్ల ప్రణాళికలతో ముందుకు రావాల్సిందిగా కోరినట్లు తెలిపారు. 20ఏళ్లుగా ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొన్నారు.
పద్మ అవార్డుల్లో వివక్ష..
పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని సీఎం రేవంత్ ఆరోపించారు. పక్క రాష్ట్రం ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చినప్పుడు.. తెలంగాణకు నాలుగైనా ఇస్తే బాగుండేదన్నారు. ఈ వివక్షపై త్వరలో ప్రధానమంత్రికి లేఖ రాస్తామన్నారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నత విద్య వ్యాప్తికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అంబేడ్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సీఎస్ శాంతికుమారి, ఉన్నత విద్య కార్యదర్శి యోగితా రాణా, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల
Updated Date - Jan 27 , 2025 | 03:59 AM