Warangal Airport: మామునూరు ఎయిర్‌పోర్టు.. కొచ్చి తరహాలో!
ABN, Publish Date - Mar 02 , 2025 | 03:26 AM
వరంగల్ జిల్లా మూమునూరు విమానాశ్రయాన్ని కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టు మాదిరిగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
భూసేకరణ పూర్తి చేయండి.. డిజైన్‌ను రూపొందించండి
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సీఎంకు ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధుల ధన్యవాదాలు
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లా మూమునూరు విమానాశ్రయాన్ని కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టు మాదిరిగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మామునూరు విమానాశ్రయంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, సత్వరమే ఎయిర్‌పోర్టు డిజైన్‌ను రూపొందించాలని ఆదేశించారు.
ఎయిర్‌పోర్టు వద్ద నిత్యం కార్యకలాపాలు ఉండేలా డిజైన్ చేయాలన్నారు. విమాన రాకపోకలతోపాటు ఇతర కార్యకలాపాలు ఉండేలా, వరంగల్ నగరానికి ఒక ఆస్తిగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రతి నెలా తనకు ప్రోగ్రెస్ రిపోర్టు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు కావ్య, బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకా్‌షరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated Date - Mar 02 , 2025 | 03:26 AM