ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పనులకు ఇసుక టీజీఎండీసీ నుంచే..

ABN, Publish Date - Mar 02 , 2025 | 03:29 AM

ఇసుక సహా ఇతర ఖనిజాల అక్రమ తవ్వకం, రవాణాపై ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని అభిప్రాయపడ్డారు.

  • ప్రైవేటు నిర్మాణ సంస్థలకూ సరఫరా

  • రాజధానికి 3 వైపులా స్టాక్‌ పాయింట్లు

  • ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం

  • ఖనిజ బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు

  • గనుల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/వనపర్తి అర్బన్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఇసుక సహా ఇతర ఖనిజాల అక్రమ తవ్వకం, రవాణాపై ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో గనుల శాఖపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంతోపాటు ఆదాయం పెరిగిందని.. అధికారులు తొలుత సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరా వంటి అంశాలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు తెలంగాణ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీజీఎండీసీ) నుంచే ఇసుక సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే ప్రైవేటు సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీనే సరఫరా చేయాలన్నారు. తక్కువ మొత్తంలో వినియోగించుకునే వారి కోసం హైదరాబాద్‌కు మూడు వైపులా ఇసుక స్టాక్‌ పాయింట్లను పెట్టాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చిన్న ఖనిజ బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలన్నారు. కాగా, ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌(ఏటీసీ) ఉండాల్సిందేనని, రాష్ట్రంలోని ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. కార్మిక శాఖపై తన నివాసంలో సమీక్షించిన ఆయన.. నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యాక్ట్‌పై పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని సూచించారు.


రోల్‌మోడల్‌గా యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌

పోలీస్‌ సిబ్బంది పిల్లల కోసం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ దేశానికే రోల్‌మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దాలని, విద్యావిధానంలో కొత్త ఒరవడి సృష్టించాలని సీఎం రేవంత్‌ ఆకాంక్షించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పోలీసు అధికారులతో కలిసి పోలీస్‌ స్కూల్‌ బ్రోచర్‌, వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఇందులో యూనిఫాం సర్వీ్‌సలో ఉన్న సిబ్బంది పిల్లలకు 50శాతం, సాధారణ ప్రజల పిల్లలకు 50శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. పోలీస్‌ అమరవీరుల కుటుంబాల పిల్లలకు ప్రాధా న్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. 31న స్కూల్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

రేపు ఢిల్లీకి రేవంత్‌

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌లాల్‌ కట్టార్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. రాష్ట్రానికి పలు ప్రాజెక్టులతోపాటు నిధులు ఇవ్వాలని కోరనున్నారు.


నేడు వనపర్తికి సీఎం రేవంత్‌

సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. రూ.751కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల, 500 పడకల ఆస్పత్రి, ఐటీ టవర్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన స్కూల్‌లో రూ.61 కోట్లతో నూతన భవనానికి భూమి పూజ చేస్తారు. తన బ్యాచ్‌ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, వారితో కలిసి భోజనం చేయనున్నారు. పన్నెండేళ్ల పాటు తాను అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లి.. ఆ కుటుంబాన్ని పలకరించనున్నారు. పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రజా పాలన -ప్రగతి బాట సభలో పాల్గొననున్నారు.

Updated Date - Mar 02 , 2025 | 03:29 AM