మూత‘బడి’
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:27 AM
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లడంతో వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
మూత‘బడి’
డిండి మండలంలో 21 పాఠశాలల మూసివేత
అదే బాటలో మరికొన్ని పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలలపై సన్నగిల్లుతున్న నమ్మకం
డిండి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లడంతో వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనపై ఆసక్తితో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతీ ఏడాది గణనీయంగా తగ్గి పాఠశాలలు వెలవెలబోతున్నాయి. జూన మొదటి వారం నుంచి కరపత్రాలు పంచుతూ ఇంటింటికీ తిరిగి ఉపాధ్యాయులు ప్రచారం చేసినా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరచడంలేదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించే స్థోమత లేనివారు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రావడంలేదు. మండలంలో 46 ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇప్పటికే 21 పాఠశాలలు మూతపడ్డాయి. మరికొన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడే దశలో ఉన్నాయి. బొగ్గులదొన ప్రాథమిక పాఠశాల 2024-25 విద్యాసంవత్సరంలో మూతపడింది. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలను తెరిచినా ఆరుగురు విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఒకటి, రెండు రోజులు హాజరైన విద్యార్థులు పాఠశాలకు రాకపోవడంతో ఈ విద్యాసంవత్సరం కూడా మూసివేశారు. కొత్తతండా ప్రాథమిక పాఠశాలలో 12 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణం గా విద్యార్థులు లేకపోవడంతో ఇద్దరు ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. ప్రాథమిక పాఠశాల ల్లో అదనంగా ఉన్న సెకండ్ గ్రేడ్ టీచర్లను డిప్యుటేషనపై ఉన్నత పాఠశాలలకు పంపించడాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలల్లోనే సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విద్యార్థుల సంఖ్య తగ్గిన కొన్ని పాఠశాలలు
మండలంలోని ఆకుతోటపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు, రుద్రాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో 4, కిందిశేషాయికుంట పాఠశాలలో 7గురు, కొత్తతండాలో 12 మంది, టి.గౌరారం కాలనీ ప్రాథమిక పాఠశాలలో 16 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం హా జరవుతున్నట్లు ప్రధానోపాధ్యాయులు ఎంఈవోకు నివేదికను అందజేశారు. మండలంలో 8 ఉన్నత పాఠశాలలు ఉండగా కామేపల్లి ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతుల్లో 38 మంది, టి.గౌరారం హైస్కూల్‌లో 42 మంది, గోనబోయినపల్లి ఉన్నత పాఠశాలలో 43 మంది, రామంతపూర్ హైస్కూల్‌లో 72 మంది, కందుకూరులో 76 మం ది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. హైస్కూల్‌లో ఒక తరగతిలో ఉం డాల్సిన విద్యార్థుల సంఖ్య పాఠశాలలోని ఐదు తరగతు లు కలిపి ఉండటం గమనార్హం. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా ఉన్నత పాఠశాలల్లో కూ డా ఇదే తరహాలో క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం
మండలంలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ నెల 15వ తేదీ తర్వాత ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరే విధంగా కృషి చేస్తున్నాం.
- గోప్యానాయక్, ఎంఈవో
Updated Date - Jul 07 , 2025 | 12:27 AM