Bhatti Vikramarka: విద్యపై కేంద్ర గుత్తాధిపత్యం తగదు
ABN, Publish Date - Feb 21 , 2025 | 03:57 AM
ఉన్నత విద్యపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం తగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు, నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పజెప్పి.. వైస్ చాన్స్‌లర్ల నియామకాలు, అడ్మిషన్లు వంటి కీలక బాధ్యతలను కేంద్రం తన వద్దే పెట్టుకోవడం సరికాదన్నారు.
రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి
రాష్ట్రాలు పాలనా విభాగాలు కాదు
దేశ పురోగతికి అవి జీవనాడులు: భట్టి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం తగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు, నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పజెప్పి.. వైస్ చాన్స్‌లర్ల నియామకాలు, అడ్మిషన్లు వంటి కీలక బాధ్యతలను కేంద్రం తన వద్దే పెట్టుకోవడం సరికాదన్నారు. ‘‘మీరు బిల్లు చెల్లించాలి కానీ.. ఫుడ్ ఆర్డర్ చేయలేరు ’’ అన్న తరహాలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కొత్త నిబంధనలున్నాయని విమర్శించారు. కేరళలోని తిరువనంతపురంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన జాతీయ ఉన్నత విద్య సమ్మేళనంలో మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ తరఫున పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలకు నిధులు సమకూర్చడంతో పాటు నిర్వహణ బాధ్యతలను కొనసాగించాలంటూ కేంద్రం చెబుతోందని, కానీ వైస్ చాన్స్‌లర్ల నియామకాలు, అడ్మిషన్లు వంటి నిర్ణయ బాధ్యతల నుంచి రాష్ట్రాలను తొలగిస్తోందని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రాలు భవనాల రిబ్బన్ కటింగ్‌కు మాత్రమే పరిమితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యపై కేంద్రానిది గుత్తాధిపత్యం కాదని, అది ఉమ్మడి జాబితాలోని అంశమని తెలిపారు. రాష్ట్రాలు తమ ప్రజలు, వ్యవస్థలకు అనుకూలమైన విద్యా విధానాలను రూపొందించుకుంటాయని, ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి పోలిక ఉండదని, చాలా వ్యత్యాసాలుంటాయని వివరించారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లేకుండా నాణ్యమైన విద్యను ఎలా అందిస్తాయని ప్రశ్నించారు. ఇంతటి ప్రాధాన్యమున్న అంశాన్ని చర్చలకు పరిమితం చేయకుండా.. రాష్ట్రాలు ఒక ఉమ్మడి లక్ష్యంతో కేంద్రం వద్ద తమ వాదనను వినిపించాలని చెప్పారు. కేంద్రం కూడా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రాలు కేవలం పరిపాలనా విభాగాలు మాత్రమే కాదని, అవి దేశ పురోగతికి జీవనాడులని అన్నారు. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేరని స్పష్టం చేశారు. కేంద్రానికి సహకార సమాఖ్య విధానంపై విశ్వాసముంటే యూజీసీ నిబంధనలపై అన్ని రాష్ట్రాలతో చర్చించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో విద్యపై ప్రజెంటేషన్..
తెలంగాణలో విద్యా రంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, కార్యక్రమాలపై భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తిని కల్పించాలని డిమాండ్ చేశారు. వీసీల నియామక బాధ్యతను, సెర్చ్ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడం, వీసీల అర్హత ప్రమాణాలను మార్చడం ఆందోళనకరమని అన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను తప్పనిసరి చేయడం వల్ల వెనకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రాలకు విద్యపై స్వయం ప్రతిపత్తిని కల్పించడంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Updated Date - Feb 21 , 2025 | 03:57 AM