Arvind Kumar: నిబంధనలు తెలిసిన మీరు.. ఎలా ఉల్లంఘించారు?
ABN, Publish Date - Jan 10 , 2025 | 04:30 AM
ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి పురపాలకశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హజరయ్యారు.
అర్వింద్ కుమార్‌ను ప్రశ్నించిన ఈడీ.. వాంగ్మూలం నమోదు
నేడు బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించనున్న ఏసీబీ
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి పురపాలకశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ)కు విదేశీ కరెన్సీలో నిధులు పంపించాలని హెచ్‌ఎండీఏను ఎందుకు ఆదేశించారు? విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపినపుడు ఆర్‌బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? తదితర అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
బుధవారం నాటి విచారణలో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఇచ్చిన జవాబుల ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఫెమా, పీఎంఎల్‌ఏ చట్టాల ఉల్లంఘన గురించి ప్రస్తావిస్తూ.. ఒక ఐఏఎస్ అధికారిగా మీకు అన్ని నిబంధనలు తెలిసినా ఎందుకు వాటిని ఉల్లంఘించారని ప్రశ్నించినట్లు సమాచారం. అర్వింద్ కుమార్ వాంగ్మూలాన్ని సైతం ఈడీ అధికారులు నమోదు చేశారు. కాగా, బీఎల్‌ఎన్ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హజరుకానున్నారు. ఆయన వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలకం అవుతుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇదే కేసులో ఈ నెల 16వ తేదీన కేటీఆర్ ఈడీ ముందు హజరు కానున్నారు.
Updated Date - Jan 10 , 2025 | 04:30 AM