వేసవిలో జలకళ
ABN, Publish Date - May 02 , 2025 | 12:48 AM
నిండు వేసవిలోనూ గంగన్నపాలెం చెరువు మత్తడి దూకుతోంది. అలుగు నుంచి దూకుతున్న నీటి దృశ్యాలు చూపరులకు కనువిందు చేస్తోంది.
వేసవిలో జలకళ
‘మత్తడి’ దూకుతున్న గంగన్నపాలెం చెరువు
ఉదయసముద్రం వద్ద ఫిల్టర్ అవుతున్న నీరు చెరువులోకి
చెరువు ప్రాంతంలో కనువిందు చేస్తున్న దృశ్యాలు
భూగర్భజలాలు పెరగడానికి దోహదపడుతున్న చెరువు
నల్లగొండ, మే 1(ఆంధ్రజ్యోతి): నిండు వేసవిలోనూ గంగన్నపాలెం చెరువు మత్తడి దూకుతోంది. అలుగు నుంచి దూకుతున్న నీటి దృశ్యాలు చూపరులకు కనువిందు చేస్తోంది. తిప్పర్తి మండల పరిధిలోని గంగన్నపాలెం చెరువు తీవ్ర వేసవికాలంలోనూ మే నెలలో అలుగులు పోయడం విశేషం. ఈ చెరువుకు నల్లగొండ పట్టణంలోని పానగల్లులో ఉన్న ఉదయసముద్రం వద్ద ఫిల్టర్ అవుతున్న మిషన భగీరథ నీరు వృథాగా పోకుండా గంగన్నపాలెం చెరువులోకి చేరడం వల్ల ఎంతో ఉపయోగపడుతుంది. ఈ చెరువులో నీటి వల్ల భూగర్భజలాలు వృద్ధి చెందుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామలింగాలగూడెం, రాజుపేట, కాశీవారిగూడెం గ్రామాల పొలాలకు కూడా గంగన్నపాలెం చెరువు నుంచి నీరు అందుతుంది.
ఫిల్టర్ అయిన నీరు గంగన్నపాలెం చెరువు వైపు...
పానగల్‌లోని ఉదయ సముద్రం వద్ద గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో సుమారు 650 గ్రామాలు సరఫరా అయ్యే మంచినీటి కోసం పానగల్‌లో ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేస్తుంటారు. ఈ శుద్ధిచేసిన నీరులో వృథా నీరు ఉదయ సముద్రం ప్రాంతంలో ఉన్న కాల్వలు, డొంకలు, వాగుల ద్వారా తిప్పర్తి మండలం రాజుపేట శివారులోని గంగన్నపాలెం చెరువులోని నిరంతరం నీరు పారుతూ ఉంటుంది. ఈ చెరువులో సంవత్సరం మొత్తం 365 రోజులు చెరువు నిండా నీరు ఉండటం, నిండిన తర్వాత మత్తడి దూకడం నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా ఈ చెరువులో చేపలు కూడా పెంపకం చేస్తున్నారు. దీంతో కూడా కొంతమందికి ఉపాధి లభిస్తుంది. ఇక వానాకాలం పంటతో పాటు యాసంగి సీజనలలో ఈ చెరువు నుండి నీటిని తమ పంట పొలాలకు రైతులు ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నారు. గంగన్నపాలెం చెరువు మండుటెండల్లో కూడా కృష్ణా జలాల మాదిరిగా పారుతూ ఉండటం విశేషం. పానగల్లు చెరువు నుండి వచ్చే ప్రతి చుక్కనీరు గంగన్నపాలెం చెరువుకు పారడం విశేషం. నిత్యం చెరువు అలుగు పోయడం కనిపిస్తుంది.
గంగన్నపాలెం చెరువు వద్ద పక్షుల సందడి
చెరువులో నీరు పుష్కలంగా ఉండటంతో ఎండ వేడిమి తట్టుకోలేక గేదెలు, పశువులు ఆ నీటిలో సేదతీరడంతో పాటు తమ దాహాన్ని తీర్చుకుంటున్నాయి. ఈ చెరువు వద్ద పిచ్చుకలు, పక్షులకు దాహం తీర్చుకోవడానికి క్రిమికీటకాలు, చిన్నపాటి చేపలు పక్షులకు ఆహారంగా మారి ఆకలి తీర్చుతున్నాయి. పక్షులకు ఇది ఆవాసంగా మారిందని చెప్పవచ్చు. అనేక వలస పక్షులు ఈ చెరువు వద్దకు రావడం విశేషం. చెరువుల వద్ద పిచ్చుకలతో పాటు బాతులు కనిపిస్తున్నాయి. చెరువులో పుష్కలంగా నీరు ఉండటంతో పక్షులు, పిచ్చుకలు, పశువులకు గంగన్నపాలెం చెరువు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చెరువు వద్దకు వలస పక్షులు వస్తుండటంతో ఆ ప్రాంతమంతా కోకిల రాగాలు, పిచ్చుకల సందడి, పక్షుల రాకతో ఆ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. దీంతో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా గంగన్నపాలెం చెరువు చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
Updated Date - May 02 , 2025 | 12:48 AM