kumaram bheem asifabad- సమస్యలపై దరఖాస్తులు అందజేయాలి
ABN, Publish Date - Jul 08 , 2025 | 10:48 PM
జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో సోమవారం నిర్వహించే ప్రజవాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజల సౌకర్యార్థం ప్రతీ రోజు నిర్వహించనున్నామని, ప్రజలు సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవనం గ్రౌండ్ ప్లోర్‌లో గల జి-3లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కంట్రోల్ రూంను అదనపు కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఆసిఫాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో సోమవారం నిర్వహించే ప్రజవాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజల సౌకర్యార్థం ప్రతీ రోజు నిర్వహించనున్నామని, ప్రజలు సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవనం గ్రౌండ్ ప్లోర్‌లో గల జి-3లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కంట్రోల్ రూంను అదనపు కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించడం కాకుండా నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌లో ప్రతి రోజు వివిధ సమస్యలపై ప్రజలు దరఖాస్తు అందజేయవచ్చని చెప్పారు. సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తులు సమర్పించిన వారికి రశీదులు అందజేస్తామని చెప్పారు.. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలి పారు. అనంతరం గ్రీవెన్స్ సెల్‌లో రెండు దరఖాస్తులు రాగా వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత మండలాలకు పరిష్కారం కోసం పంపించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంల భద్రతకు చర్యలు
ఆసిఫాబాద్, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఈవీఎంల భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్ర పరిచిన స్ట్రాంగ్ రూంను మంగళవారం సాధారణ నెల వారి తనిఖీలో భాగంగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరంగా పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. 24 గంటలు సీసీ కెమెరాలు పని చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం గోదాంలోని అన్ని రిజిస్టర్లను, భద్రత ప్రమాణాలను సమీక్షించారు. కార్యక్రమంలో ఎన్నికల ఉప తహసీల్దార్ శ్యాంలాల్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 10:48 PM