Congress: రాహుల్ మాటిచ్చాడు కాబట్టే కులగణన
ABN, Publish Date - Feb 25 , 2025 | 04:08 AM
‘‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాటిచ్చాడు కాబట్టే రాష్ట్రంలో కులగణన సాధ్యమైంది. లేకుంటే.. సాధ్యమయ్యేది కాదు. గతంలో రెడ్లే రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించారు.
నాడు రేవంత్‌ను రెడ్లే వ్యతిరేకించారు
ఇప్పుడు ఆయన చుట్టూ చేరి.. భజన చేస్తున్నారు
నేను కేంద్ర మంత్రి కాకుండా అడ్డు పడ్డారు
బీసీ మంత్రులకు మంచి శాఖలూ ఇవ్వరా?
మీరెంత మంది? మీకెన్ని పదవులు??
రెడ్డి నేతల తీరుపై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్
బీసీలను బీజేపీ ఎదగనివ్వదని వ్యాఖ్య
హైదరాబాద్ సిటీ, రాంనగర్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాటిచ్చాడు కాబట్టే రాష్ట్రంలో కులగణన సాధ్యమైంది. లేకుంటే.. సాధ్యమయ్యేది కాదు. గతంలో రెడ్లే రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించారు. ఇప్పుడు వాళ్లే ఆయన చుట్టూ చేరి, భజన చేస్తున్నారు. రేవంత్ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం(యాదవులు) అండగా నిలిచాం. అందుకే.. యాదవుల సదర్‌ను రాష్ట్ర పండుగగా ప్రకటించారు’’ అని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. యాదవ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆదర్శ్‌నగర్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రెడ్డి సామాజికవర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా ఎదుగుదలకు రెడ్డి సామాజిక వర్గం అడ్డుపడింది. కేంద్ర మంత్రి కావాల్సిన నన్ను.. కొందరు రెడ్డి నాయకులు కాళ్లు పట్టి గుంజారు’’ అని వ్యాఖ్యానించారు. జనాభాలో సగం ఉన్న బీసీలకు రెండు రాజ్యసభ స్థానాలు చాలా? అని ప్రశ్నించారు. ‘‘వాళ్లు(రెడ్లు) ఎంత మంది ఉన్నరు..? ఎందరు మంత్రులయ్యిండ్రు..? మనకు మంత్రి పదవులిస్తే.. గొర్లు, బర్ల శాఖలిస్తరు. రెవెన్యూ, ఫైనాన్స్ వంటి పవర్‌ఫుల్ మినిస్ట్రీలు ఒక్కటీ ఇవ్వలేదు. నేను సికింద్రాబాద్ ఎంపీ సీటు అడిగితే.. ఒడిపోయిన వాళ్లకు ఇవ్వొద్దని పార్టీ నిర్ణయం తీసుకుందన్నరు. జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు..? చేవేళ్ల, నల్లగొండ, సికింద్రాబాద్ టికెట్లు రెడ్లకు ఇయ్యలేదా..? బయట పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్ ఇంటికి వెళ్లి టికెట్ ఇచ్చారు. నాకు అవకాశమిస్తే రెండు లక్షల మెజార్టీతో గెలిచేవాడిని’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు కులగణనను విజయవంతం చేయడానికి కారణమైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ పటాలకు పాలాభిషేకం చేశారు.
ఎవరినీ ఎదగనివ్వలేదు
తాను ఎవరి మెప్పుకోసమో మాట్లాడడం లేదని, ఒక నాయకుడు అనిల్‌యాదవ్‌కు రాజ్యసభ ఇచ్చామని చెబుతున్నాడని, ఉమ్మడి రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా అనిల్ ఎన్నికయ్యాడని గుర్తుచేశారు. ‘‘ఈ నాయకులు(రెడ్లు) ఎవరినైనా ఎదగనిచ్చారా? ఆలుమగలు, తండ్రీకొడుకులు 20 ఏళ్లుగా పదవులను అనుభవిస్తున్నారు(రెడ్లనుద్దేశించి). బీసీలను మాత్రం అణగదొక్కుతున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని, ఆ పదవి రాకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, ఇతర భజనపరులైన రెడ్లు అడ్డుకున్నారని ఆరోపించారు. లాలూప్రసాద్ యాదవ్ సోనియాగాంధీకి విషయం చెప్పి, తనకు ఈ పదవినిప్పించారన్నారు.
రాముడిని మీకు రాసిచ్చారా..?
బీసీ నాయకులను బీజేపీ కూడా ఎదగనివ్వదని, బిహార్‌లో తేజస్వియాదవ్, యూపీలో అఖిలేశ్‌యాదవ్‌ను సీఎం కాకుండా చేశారని అంజన్ ఆరోపించారు. ‘‘హైదరాబాద్ విషయం రాగానే హిందూ-ముస్లిం కొట్లాటలు పెడ్తరు. భారత్‌మాత అంటరు. మేం పాకిస్తాన్ మాత అంటున్నమా? భారత్‌మాత, రాముడిని మీకు పట్టా రాసిచ్చినరా?’’ అని బీజేపీపై మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 25 , 2025 | 04:08 AM