Srisailam: శ్రీశైలం శాసనంలో హేలీ తోకచుక్క ప్రస్తావన
ABN, Publish Date - Jun 21 , 2025 | 04:53 AM
తోకచుక్క అనగానే చాలా మందికి ఠక్కున గుర్తొచ్చే పేరు.. హేలీ తోకచుక్క! తోకచుక్కల గురించి చెప్పడానికి ప్రముఖంగా దీని గురించే చెబుతారు. సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటుందిది.
1456 నాటి రాగి రేకులో ఆ వివరాలు
తోకచుక్క కనపడితే అరిష్టమని భావించి శాంతులు చేయించిన విజయనగర రాజు
పురావస్తు శాఖ పరిశోధనలో వెలుగులోకి
నంద్యాల, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): తోకచుక్క అనగానే చాలా మందికి ఠక్కున గుర్తొచ్చే పేరు.. హేలీ తోకచుక్క! తోకచుక్కల గురించి చెప్పడానికి ప్రముఖంగా దీని గురించే చెబుతారు. సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటుందిది. ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ (ఈయన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన న్యూటన్ స్నేహితుడు).. 1705లో 24 తోకచుక్కల వివరాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దాని పేరు.. సినాప్సిస్ ఆఫ్ ద ఆస్ట్రానమీ ఆఫ్ కోమెట్స్. అందులో.. 1682లో కనిపించిన ఈ తోకచుక్క గురించి కూడా ఉంది. ఈ తోకచుక్క ప్రతి 75-76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుందని, మనకు కనిపిస్తుందని.. 1682కు ముందు శాస్త్రజ్ఞులు 1607లో, 1531లో గుర్తించిన తోకచుక్క ఇదేనని.. ఆయన తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించినందు కు గౌరవసూచకంగా దాన్ని ఆయన పేరుతోనే ‘హేలీ తోకచుక్క’గా వ్యవహరిస్తారు. అయితే.. 1531కన్నా ముందు.. 1456లో కనిపించిన ఈ తోకచుక్క గురించి మన శ్రీశైల క్షేత్రంలో దొరికిన రాగిరేకుల్లో ఉందని తెలుసా? అవును.. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని గంటా మఠంలో నాలుగేళ్ల క్రితం జరిగిన జీర్ణోద్ధరణ పనుల్లో.. దేవనాగరిలో రాసిన సంస్కృతం, కన్నడ, ఒడియా భాషల్లో ఉన్న పలు రాగి రేకు ల శాసనాలు, నాణేలు వెలుగు చూశాయి. ఆ శాసనాలపై పురావస్తుశాఖ అధికారులు పరిశోధనలు చేపట్టారు. అందు లో భాగంగా రెండు రాగి రేకుల్లో ఉన్న సమగ్ర సారాంశాన్ని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ రాగి రేకుల్లో ఒకదాంట్లో తోకచుక్క ప్రస్తావన ఉందని.. అది హేలీ తోకచుక్కేనని ఆయన వివరించారు.
అదేంటంటే..
తోకచుక్కలు కనపడితే అరిష్టమని మనపెద్దల విశ్వాసం. ఈ క్రమంలోనే క్రీ.శ.1456లో తోక చుక్క కనిపించడం, దాని తర్వాత ఉల్కాపాతం రావడంతో.. విజయనగర రాజు అయి న మల్లికార్జున దేవరాయలు ఆ అరిష్టాన్ని నివారించేందుకు (ధూమకేతు మహోత్పాత శాంత్యర్థం- సంస్కృతంలో తోకచుక్కలను ధూమకేతువులంటారు. అలాగే.. ప్రకాశస్య మహోత్పాత శాంత్యర్థం-ఉల్కాపాతం వల్ల కలిగే అరిష్టాల నుంచి కాపాడే) శాంతులు చేయించారు. ‘కడియాలపుర’ గ్రామానికి చెందిన ‘లింగనార్య’ అనే బ్రాహ్ముణుడితో ఆ శాంతులు చేయించినట్టు శాసనంలో పేర్కొన్నారు. శాంతు లు చేసినందుకుగాను ఆయనకు సింగాపురం అగ్రహారాన్ని దక్షిణగా ఇచ్చినట్టు రాశారు. కడియాలపుర అంటే.. ప్రస్తుత కడప జిల్లా గాలివీడు మండలంలోని కడియపులంక అయి ఉంటుందని అంచనా. నిజానికి హేలీ తోకచుక్కకు ఆ పేరు ఎడ్మండ్ హేలీ పేరిట పెట్టినప్పటికీ.. క్రీస్తు పూర్వం నుంచే ఆ తోకచుక్కను ప్రపంచంలో ఏదో ఒక దేశం వారు గుర్తిం చి రికార్డుల్లో నమోదు చేస్తూనే వచ్చారు. తొలిసారి క్రీస్తుపూర్వం 239లో చైనీయులు దాన్ని గమనించారు. అప్పట్నుంచీ.. ప్రతి 75-76 సంవత్సరాలకు ఒకసారి అది.. చరిత్రలో ఎక్కడో ఒకచోట నమోదవుతూనే వచ్చింది. అలా ఎడ్మండ్ హేలీ తన పుస్తకంలో పేర్కొన్న 1531 సంవత్సరానికి 75 ఏళ్ల ముందు.. ఆ తోకచుక్క గురించి ఇక్కడి శాసనాల్లో నమోదు కావడం విశేషం.
Updated Date - Jun 21 , 2025 | 04:53 AM