kumaram bheem asifabad- ఫీజుల మోత
ABN, Publish Date - Jun 13 , 2025 | 11:18 PM
జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారంగా అడ్డగోలుగా వసూలు చేసే ఫీజులు భయ పెడుతున్నాయి. వేలకు వేలు డొనేషన్లు, పుస్తకాలు, పెన్నులు, నోట్ బుక్‌లు, టైలు అంటూ ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. జిల్లాలో ప్రైవేటు స్కూళ్లలో స్థాయిని బట్టి విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేస్తున్నారు.
- తల్లిదండ్రులపై చదువుల భారం
- విద్యాహక్కు చట్టానికి తూట్లు
- ఆందోళనలో మధ్య తరగతి ప్రజలు
ఆసిఫాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారంగా అడ్డగోలుగా వసూలు చేసే ఫీజులు భయ పెడుతున్నాయి. వేలకు వేలు డొనేషన్లు, పుస్తకాలు, పెన్నులు, నోట్ బుక్‌లు, టైలు అంటూ ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. జిల్లాలో ప్రైవేటు స్కూళ్లలో స్థాయిని బట్టి విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేస్తున్నారు. నర్సరీ, ఎల్‌కేజీకి రూ.8 వేల నుంచి రూ10 వేలు, యూకేజీకి రూ.10వేల నుంచి రూ12 వేలు, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ15వేల నుంచి రూ18వేలు,6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు:18వేల నుంచి రూ20వేలు,9, 10 తరగ తులకు రూ.22,000 నుంచి రూ.25,000 ఫీజులను వసూలు చేస్తున్నారు. దీంతో పాటు స్కూల్ వ్యాన్ ఫీజు అదనంగా వసూలు చేస్తున్నారు.
- మెరుగైన విద్య కోసం..
తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల కన్నా మెరుగైన విద్యను అందించాలనే తపనతో ఉండే తల్లిదండ్రుల ఆశలను ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇష్టారాజ్యంగా పాఠశాలలు ఏర్పాటు చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాలతో పాటు పోటీ పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు సాధించిన ప్రగతిని చూపిస్తూ ప్రచార కార్యక్రమాలను శ్రీకారం చుట్టి విస్తృత ప్రచారం చేపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పుస్తకాలు, దుస్తులతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూిపుతున్నారు. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు యజమాన్యాలు తగిన వ్యూ హంతో సాగుతున్నాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఫీజులు మరింత పెంచారు.
- నియంత్రణ లేక..
ప్రైవేటు పాఠశాలలపై ఫీజుల నియంత్రణ లేక పోవడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 110కి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల విద్యాప్రమాణాలు, ఇతర వసతులను బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో పాటు యూనిఫాం దుస్తులు, పుస్తకాలు, షూస్, టై, బెల్టులలో పాటు స్కూల్ వ్యాన్ ఫీజు అదనంగా వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడా పని చేసిన దాఖలాలు లేవు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో 91ని జారీ చేసినా జిల్లాలో అమలుకు నోచుకొవడంలేదు.
- పద్నాలుగేళ్ల లోపు విద్యార్థులకు..
పద్నాలుగేళ్ల లోపు విద్యాలందరికీ ఉచిత విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ప్రైవేటు పాఠశాలల్లోనూ పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలని నిర్ధేశించింది. 25 శాతం సీట్లు ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ప్రవేశం కల్పించాలి. ప్రవేశాలన్నీ లాటరీ పద్ధతిని నిర్వహించాలి. ఎనిమిదో తరగతి పూర్తైన విద్యార్థులకు ప్రాథమిక విద్య పూర్తైనట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేయకూడదు. అర్హత కలిగిన ఉపాధ్యాయులనే నియమించాలి. పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలి. కానీ జిల్లాలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఏ పాఠశాలలో కేటాయించడం లేదు. ఎక్కడా లాటరీ పద్ధతిన ప్రవేశాలు లేవు. ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా బహిరంగంగానే రుసుము వసూలు చేస్తున్నా అడిగే వారే లేరు. పాఠశాల అభివృద్ధి, సంక్షేమం, క్రీడలు, పరీక్ష రుసుము, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యజమాన్యాలతో కలిసి పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ సూచన మేరకు ఫీజులు వసూలు చేయాల్సి ఉన్నా అమలు కావడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో అన్ని వసతులతో ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు వసూలు చేయాలన్న నిబంధనలు ఉన్నప్పకీ అమలు కావడం లేదు. దీంతో పాటు జిల్లాలోని అధిక శాతం ప్రైవేటు పాఠశాలల్లో కనీస వసతులు లేవు. బీఎడ్, డీఎస్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలల్లో నియమించాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అధికారులు నియంత్రించాలి..
- చిరంజీవి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను అధికారులు నియంత్రించాలి. ఏటేటా ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు అవస్థలు పడుతు న్నారు. పేద విద్యార్థులకు 25 శాతం ఉచితంగా అందించాల్సిన విద్య ఎక్కడా అ మలు చేయడం లేదు. ప్రభుత్వ ఆమోదం లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. విద్యా హక్కుచట్టం పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
Updated Date - Jun 13 , 2025 | 11:18 PM