Amit Shah: ఆ విధ్వంసం మర్చిపోండి మూడింతల అభివృద్ధి సాధిస్తాం
ABN, Publish Date - Jan 20 , 2025 | 04:34 AM
‘రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం గురించి చింతించొద్దు. ఏపీ అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొండంత అండగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు.
చంద్రబాబుకు మోదీ కొండంత అండ
6 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్లు
ఎన్డీఆర్‌ఎఫ్ వేడుకల్లో అమిత్ షా
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం గురించి చింతించొద్దు. ఏపీ అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొండంత అండగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఇద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మూడింతల ప్రగతి సాధిస్తుంది’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆదివారం విజయవాడ సమీపంలోని కొండపావులూరు వద్ద జరిగిన ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్థాపక వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ ప్రాంగణంలో నిర్మించిన ఎన్‌ఐడీఎం దక్షిణ సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ వస్తుందని, మానవ విధ్వంసం నుంచి కాపాడేందుకు ఎన్డీయే ముందుంటుందని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల రూపాయల సహకారం అందించామన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులిచ్చామని, 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు నీళ్లు రాష్ట్రంలోని పొలాల్లో పారిస్తామన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రైల్వే జోన్ ఏర్పాటైందని, తాజాగా విశాఖ ఉక్కుకు ఊతమిచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచామని అమిత్ షా పేర్కొన్నారు.
ఏపీకి కేంద్రం తోడ్పాటు
‘అభివృద్ధి, సుపరిపాలనతో పాటు ఆర్థిక నిర్వహణలో మంచి అనుభవం ఉన్న చంద్రబాబు కష్టానికి కేంద్రం తోడ్పాటు ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన రాజధాని అమరావతికి గడిచిన ఆరు నెలల్లోనే 27 వేల కోట్ల రూపాయల భరోసాతో ఏపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచాం. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా ఎయిమ్స్ ప్రారంభమైంది. రాష్ట్రంలో రూ.1.20 లక్షల కోట్లతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు’ అని అమిత్ షా వెల్లడించారు.
ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు భేష్
‘గతంలో ఒడిశాలో తుఫాన్లు వస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల రెండు తుఫాన్లు వచ్చినా ఎన్డీఆర్‌ఎఫ్ ముందస్తు ప్రణాళికతో ఎదుర్కోవడం వల్ల ఒక్క ప్రాణం కూడా పోలేదు. మోదీ పాలనలో జీరో క్యాజువాలిటీ లక్ష్యం నిర్దేశించుకుని పని చేస్తున్నాం. విపత్తుల్లో చిక్కుకున్న ప్రజలు ఎన్డీఆర్‌ఎఫ్ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తుల్ని చూడగానే ధైర్యం వచ్చిందని నాకు చాలా చోట్ల చెప్పారు. జపాన్, నేపాల్, మయన్మార్, టర్కీ తదితర దేశాల అధ్యక్షులు సైతం ఎన్డీఆర్‌ఎఫ్ సేవల్ని కొనియాడారు’ అని అమిత్ షా వివరించారు.
పోలీస్ అకాడమీలో ఇండోర్ షూటింగ్ రేంజ్
వర్చువల్‌గా ప్రారంభించిన అమిత్ షా
హైదరాబాద్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): సర్దార్ వల్లబాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆదివారం ఈ షూటింగ్ రేంజ్‌ను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. స్వయంగా హాజరు కావాల్సి ఉన్నా.. సమయాభావం వల్ల ఆయన రాలేకపోయారు. ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌లో ఒకేసారి పది మంది శిక్షణ పొందవచ్చు. 50మీటర్ల పొడవు, పది వరుసల్లో ఈ షూటింగ్ రేంజ్ ఉంటుంది. ఆధునిక తుపాకుల వినియోగంపై ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ అమిత్ గర్గ్ పాల్గొన్నారు.
Updated Date - Jan 20 , 2025 | 04:34 AM