ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోడు పట్టాలు ఇచ్చేది ఎప్పుడో?

ABN, Publish Date - Jun 25 , 2025 | 10:35 PM

పోడు రైతులకు పట్టాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో కొంతమందికి పోడు పట్టాలిచ్చినప్పటికీ అది సంపూర్ణం కాకపోవడంతో అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దశాబ్దాల తరబడి హక్కు పత్రాల కోసం ఆదివాసీలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

- జిల్లాలో 11వేల పై చిలుకు దరఖాస్తులు

- గత ప్రభుత్వ హయాంలో కొందరకే పట్టాలు జారీ

- తమకూ ఇవ్వాలని దరఖాస్తుదారుల డిమాండ్‌

- గిరిజనేతరులకూ అవకాశం లభించేనా?

మంచిర్యాల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): పోడు రైతులకు పట్టాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో కొంతమందికి పోడు పట్టాలిచ్చినప్పటికీ అది సంపూర్ణం కాకపోవడంతో అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దశాబ్దాల తరబడి హక్కు పత్రాల కోసం ఆదివాసీలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అటవీ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి హక్కు పత్రాలు అందజేయడం ద్వారా శాశ్వత పరిష్కారం లభించనుందని ఆశపడ్డ రైతులకు ఆశనిపాతమే మిగిలింది. అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలు జారీ చేసేందుకు పంచాయతీ, రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారుల సమన్వయంతో పోడు భూముల పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకాలను గత ప్రభుత్వ హయాంలో రూపొందించారు. ఈ విషయమై గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు. గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అనతరం అర్హులను గుర్తించి హక్కులు కల్పించనున్నట్లు రెండు సంవత్సరాల క్రితం అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పటి వరకు పోడు పట్టాల అంశం మళ్లీ ప్రస్తావనకు రాలేదు.

- ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం ప్రాతిపదికన...

అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్‌) ప్రాతిపదికన అర్హులైన వారికి పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. 29 డిసెంబరు 2006 నుంచి ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం అమల్లోకి రాగా 1930 నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరులు, 2005కు ముందు నుంచి సాగులో ఉన్న గిరిజనులకు మాత్రమే హక్కు పత్రాలు పొందే వెసులుబాటు ఉంది. పోడు సమస్యను పరిష్కరించి 2005 నాటికి సాగులో ఉన్నవారిని గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతిలో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని 14 మండలాల్లోని 93 గ్రామాల్లో మొత్తం 33,418.19 ఎకరాల పోడు భూములు ఉన్నాయి. వీటిలో గిరిజనులకు చెందినవి 13,587.37 ఎకరాలు కాగా మిగతా 19,830.22 ఎకరాల్లో గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నారు. పోడు పట్టాల కోసం 2022 నవంబరు 8న ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అదే నెల 20న ముగిసింది. గడువు ముగిసే సమయానికి జిల్లావ్యాప్తంగా మొత్తం 11,877 దరఖాస్తులు రాగా, దరఖాస్తు దారుల్లో 4,460 మంది గిరిజనులు, 7,427 మంది గిరిజనేతరులు ఉన్నారు.

- తొలిదఫా 1,847 మంది ఎంపిక...

పోడు పట్టాలు జారీ చేసేందుకు తొలి దఫాలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,847 మందిని అర్హులుగా గుర్తించారు. మొత్తం 11,877 మంది పోడు పట్టాలకు దరఖాస్తు చేసుకోగా, అర్హులైన ఆదివాసీ రైతులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. తొలి దఫాలో ఆయా మండలాలకు చెందిన.. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు మొత్తం 3,821.64 ఎకరాల భూమిని కూడా గుర్తించగా 2023 జూన్‌ 30న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పోడు పట్టాలు ఇచ్చేందుకు దరఖాస్తుదారుల్లో అతి తక్కువ మందిని ఎంపిక చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. తొలి దఫాలో చెన్నూరు నియోజక వర్గంలో 602, బెల్లంపల్లి నియోజకవర్గంలో 904 పైచిలుకు మంది, మంచిర్యాల నియోజకవర్గంలో ఐదుగురు, ఖానాపూర్‌ నియోజక వర్గంలోని జన్నారం మండలంలో 311 మంది, సిర్పూర్‌ నియోజకవర్గంలో (జిల్లాలోని కన్నెపెల్లి, భీమిని మండలాల పరిధిలో కొన్ని గ్రామపంచాయతీలు) 25 మందిని అర్హులుగా గుర్తించి హక్కు పత్రాలు జారీ చేశారు. మిగతా అర్హులకు రెండో దఫాలో అందజేస్తామని ప్రకటించినా...అది కార్యరూపం దాల్చలేదు.

- గిరిజనేతరులకు మోక్షం లభించేనా...?

అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనేతర కుటుంబాలకు గరిష్టంగా పదెకరాలకు పట్టాలు ఇవ్వనున్నట్లు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందుకోసం విదివిధానాలు కూడా రూపొందించింది. గిరిజనేతరులు మూడు తరాలు (కనీసం 75 ఏళ్లు) సాగులో ఉంటేనే అటవీ హక్కు పత్రాలు జారీ చేస్తామని ప్రకటించింది. సదరు కుటుంబాలు 2005కు ముందు ఎన్ని ఎకరాలు సాగులో ఉన్నా...వారు ఇక మీదట పది ఎకరాలు మాత్రమే వినియోగించుకోవాలనే నిబంధన విధించింది. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వారి వద్ద మిగిలిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా నిర్ణయించింది. అయితే అధికారులు ప్రకటించిన అర్హుల జాబితాలో గిరిజనేతరులు లేకపోవడంతో అసలు తమకు పట్టాలు వస్తాయో...లేదోనన్న సందేహంలో ఉండిపోయారు. పోడు పట్టాలకు జిల్లావ్యాప్తంగా 7,427 మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు. పట్టాలు ఇచ్చేందుకు సర్వేలు కూడా జరిపిన ప్రభుత్వం ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద తమను పరిగణలోకి తీసుకోకపోవడంతో వారంతా నిరాశా నిస్పృహల్లో మునిగిపోయారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయమై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సైతం పలుమార్లు ప్రకటన చేశారు. అయితే ఏడాదిన్నర గడిచినా పోడు రైతులకు పట్టాల జారీకి మోక్షం కలగడం లేదు.

Updated Date - Jun 25 , 2025 | 10:35 PM