హమాలీల సమ్మెతో నిలిచిన బియ్యం సరఫరా
ABN, Publish Date - Jan 03 , 2025 | 11:28 PM
హమాలీల సమ్మెతో చౌకధరల దుకాణాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. సంక్రాంతి పిండి వంటలు చేసుకోవ డానికి ఎక్కువ శాతం రేషన్ బియ్యం వినియోగిస్తారు. పండుగ సమీపిస్తున్నా రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ జరగడం లేదు.
మంచిర్యాల, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): హమాలీల సమ్మెతో చౌకధరల దుకాణాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. సంక్రాంతి పిండి వంటలు చేసుకోవ డానికి ఎక్కువ శాతం రేషన్ బియ్యం వినియోగిస్తారు. పండుగ సమీపిస్తున్నా రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ జరగడం లేదు. ప్రతీ నెల ఒకటవ తేదీ నుంచి లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంటుంది. నెల ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా చౌక ధరల దుకాణాలు తెరుచుకోకపోవడంతో పండుగపూట పేదలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బియ్యం ఎప్పుడు పోస్తారో తెలియని పరిస్థితుల్లో నిత్యం షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక డీలర్లు దుకాణాలు మూసి ఉంచుతున్నారు. పండుగల సమయంలోనూ సకాలంలో బియ్యం అందజేయడంలో జాప్యం పట్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెల ఏదో ఒక సాకు చెబుతూ నెలాఖరు దాకా బియ్యం పంపిణీ చేయడం లేదని అసహనానికి గురవుతున్నారు.
సమ్మెబాటలో హమాలీలు...
తమ డిమాండ్ల పరిష్కారానికి మండల లెవల్ స్టాకిస్టు (ఎంఎల్‌ఎస్) పాయింట్లలో పని చేస్తున్న హమాలీలు సమ్మెబాట పట్టారు. నాలుగు రోజులుగా గోదాముల వద్ద హమాలీలు సమ్మె చేస్తుండటంతో ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం సరఫరా కావడం లేదు. స్టేజి-1 నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు లారీల ద్వారా వచ్చే బియ్యాన్ని దింపుకోవడం, చౌక ధరల దుకాణాలకు చేరవేయడానికి లారీల్లోకి ఎక్కించడం, లారీల నుంచి రేషన్ షాపుల్లో స్టాక్‌ను దింపడం హమాలీల విధులు.
జిల్లాలో కోటపల్లి, చెన్నూర్, మంచిర్యాల, లక్షెట్టిపేట, బెల్లంపల్లి, తాండూరులో ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 48 మంది హమా లీలు పని చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభు త్వ హయాంలో రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్ల సవరణ చేపట్టేలా జీవో జారీ చేశారు. అప్పటి నుంచి ఆ పద్ధతి అమలు చేస్తుండగా, 2023 డిసెంబరుతో కాల పరిమితి ముగిసింది. అప్పటి నుంచి పెంచిన రేట్లు అమలు కాకపోగా, కొత్తగా జీవో కూడా విడుదల చేయలేదు. హమాలీలకు క్వింటాలుకు రూ.26 అమలు చేస్తుండగా గత సంవత్సరం రూ. 29కి పెంచారు. అయితే దానికి సంబంధించిన జీవో విడుదల చేయడం లేదు. దీంతో ఆయా డిమాండ్ల కోసం హమాలీలు ఆందో ళనబాట పట్టారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించేదాక వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని హమాలీలు తేల్చి చెబుతున్నారు.
ప్రతీ నెల ఇదే తంతు...
జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెల ఏదో ఒక కారణంతో బియ్యం పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. చాలాసార్లు ఈ - పాస్ యంత్రాల్లో సాంకేతిక లోపం తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఏదో సాకు చూపి బియ్యం ఆలస్యంగా పోస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. వాస్తవానికి చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతీ నెల ఒకటవ తేదీ నుంచి 15వరకు బియ్యం అందజేయాలి. రెండు మూడు నెలలుగా బియ్యం ఎప్పుడు పోస్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. గత నెలలో కూడా స్టేజి-1 కాంట్రాక్టర్ నుంచి సరఫరా కాలేదని అరొకర స్టాకును పంపించారు. ప్రస్తుతం హమాలీల సమ్మెతో ఈ నెలలో కూడా బియ్యం పంపిణీ జరగడం లేదు. బియ్యం సరఫరా ఎప్పుడవుతుందో డీలర్లకు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 423 రేషన్ షాపులు ఉండగా, ఉచిత బియ్యం కోటాలో భాగంగా ప్రతి దుకాణానికి సగటున 120 క్వింటాళ్లు సరఫరా కావలసి ఉంటుంది.
హమాలీ రేట్ల జీవో విడుదల చేయాలి
పానుగంటి సత్యనారాయణ, సివిల్ సప్లయి జిల్లా ప్రధాన కార్యదర్శి
సివిల్ సప్లయి విభాగంలో పని చేస్తున్న హమాలీ లకు రేట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించినందున జీవోను తక్షణమే విడుదల చేయాలి. అలాగే పెరిగిన రేట్లు యేడాది నుంచి అమలు చేయకపోవడం వల్ల హామీలు ఆర్థికంగా నష్టపోవలసి వస్తోంది. బకాయిలు వెంటనే విడుదల చేయడంతోపాటు ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్ల సవరణ చేపట్టాలి.
Updated Date - Jan 03 , 2025 | 11:28 PM