రేవంత్ మోసగాడు...కేసీఆర్ అసమర్థుడు
ABN, Publish Date - Aug 04 , 2025 | 11:29 PM
వికలాంగులకు ఆరు వేలు, వృద్ధులు, వితంతువులకు నాలుగు వేల పెన్షన్ పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద మోసగాడని, ఈ విషయం పై ప్రశ్నించకుండా మౌనంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసమర్థుడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు.
- పింఛన్ల పెంపులో ప్రభుత్వం విఫలం
- ఆగస్టు 13న తాడోపెడో తేల్చుకుందాం
- ఆసిఫాబాద్ మహాగర్జన సన్నాహక సదస్సులో మంద కృష్ణమాదిగ
ఆసిఫాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వికలాంగులకు ఆరు వేలు, వృద్ధులు, వితంతువులకు నాలుగు వేల పెన్షన్ పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద మోసగాడని, ఈ విషయం పై ప్రశ్నించకుండా మౌనంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసమర్థుడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సులో మంద కృష్ణ పాల్గొని మాట్లాడారు. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు పెంచుతామని ఎన్నికల సమయంలో హమీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మాట నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హమీలను ప్రశ్నించడంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, గడీలకే పరిమితమయ్యాడని విమర్శించారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ పెంపు అమలు చేస్తోందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇవ్వాల్సిన పింఛన్ సొమ్మును భూములు ఉన్న రైతులకు రుణమాఫీ కింద పంచారన్నరు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ పెంచాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని తదితర 20 డిమాండ్లతో ఈనెల 13న హైదరబాద్‌లో మహాగర్జన సదస్సు నిర్వహిస్తామన్నారు. సదస్సుకు జిల్లాలోని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ నాయకులు సత్యనారాయణ, ఇస్లాం, ఖయ్యుం, కేశవ్‌రావ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 11:29 PM