వానాకాలం సాగుకు సన్నద్ధం
ABN, Publish Date - May 22 , 2025 | 11:17 PM
జిల్లాలో వానాకాలం సాగు కోసం రైతులు సన్నద్ధం అవుతున్నారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటూనే పంటలు వేసేందుకు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. నల్లమట్టి వేయడంతో పాటు జూన్ ఆరంభంలో వర్షాలు పడగానే విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
- గ్రామాల్లో దుక్కులను సిద్ధం చేస్తున్న రైతులు
- జూన్ ప్రారంభం నుంచే పంటలు వేసేందుకు ఏర్పాట్లు
- పత్తి, వరి, సోయా, కంది, మొక్కజొన్న సాగుకు రైతుల మొగ్గు
- ఏర్పాట్లలో నిమగ్నమైన వ్యవసాయ అధికారులు
చింతలమానేపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం సాగు కోసం రైతులు సన్నద్ధం అవుతున్నారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటూనే పంటలు వేసేందుకు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. నల్లమట్టి వేయడంతో పాటు జూన్ ఆరంభంలో వర్షాలు పడగానే విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో పత్తి, వరి, సోయా, కంది, మొక్కజొన్న పంటలతో పాటు ఆరుతడి పంటలు వేసేందుకు విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. యాసంగి సాగు ముగియడంతో రైతులంతా వానాకాలం పంటల సాగుపైనే దృష్టి పెట్టి భూములను చదును చేస్తున్నారు. పశువుల ఎరువులను, నల్లమట్టిని వేసి పంటలకు అనువుగా తయారు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తుండగా అధికారులు మాత్రం తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. నాసిరకం విత్తనాలు అమ్మకుండా చూడడంతో పాటు, గుర్తింపుపొందిన విత్తనాలు కొనుగోలు చేసేలా రైతులకు రశీదులు ఇవ్వాలని డీలర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలు మండలాల్లోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో విత్తన, ఎరువుల డీలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని ఆదేశించారు.
సాగు అంచనా 4,45,049 ఎకరాలు..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 4,45,049 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో అధిక శాతం మంది పత్తినే సాగుచేయనున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు 6.70 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం కంటే పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. పత్తి 3,35,363 ఎకరాలు, వరి 56,861 ఎకరాలు, కంది 30,430 ఎకరాలు, మొక్కజొన్న 1000 ఎకరాలు, జొన్న, పెసరా, మినుములు, సోయాబీన్, మిరప, వేరుశనగ, ఆముదాలు, నువ్వులు 21,395 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నదని అధికారులు అంచనాలు రూపొందించారు. వీటికి అవసరమైన యూరియా 60,081 మెట్రిక్ టన్నులు, డీఏపీ 40,054 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ(మ్యూరియేట్ ఆఫ్ పొటాషియం) 10,013 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌సీ 20,027 మెట్రిక్ టన్నులు, జిల్లాకు కావాల్సిన ఇతర ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు..
రైతులు పత్తి, వరి, ఇతర వివిధ రకాల పంటల సాగు కోసం అవసరమైన విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నారు. విత్తనాలకు ఎలాంటి ఇబ్బందిలేకండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరికి సంబంధించి రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, ఇతర విత్తనాలు మాత్రం ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే పలు షాపుల్లో విత్తనాలను డీలర్లు అందుబాటులో ఉంచారు. వానా కాలం పంటలకు సమయం దగ్గర పడుతుండడంతో వ్యవసాయశాఖ తరుపున ఆయా మండలాల పరిధిలో విత్తనాల అమ్మకాలపై దృష్టి పెట్టారు. నాసిరకం విత్తనాలు అమ్మకుండా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
రశీదులు తీసుకోవాలంటున్న అధికారులు..
విత్తనాల కొనుగోలుకు సంబంధించిన రశీదులను రైతులు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనాలు వేయడం వల్ల పంటలు దెబ్బతింటే రశీదులను బట్టి పరిహారం పొందే అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు. వీటిపై అధికారులు తనిఖీలు కొనసాగించడంతో పాటు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మరిన్ని తనిఖీలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. జూన్‌లో వర్షాలు కురిసిన వెంటనే రైతులు విత్తనాలు విత్తేందుకు సిద్ధం అవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Updated Date - May 22 , 2025 | 11:17 PM