ఏజెన్సీ భూముల కబ్జా వాస్తవమే...!
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:18 PM
దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో గిరిజన (ఏజెన్సీ) భూములు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని తేలింది. ఈ మేరకు గురువారం గ్రామంలో సర్వే జరిపిన రెవెన్యూ అధికారులు భూములు కబ్జాకు గురైనట్లు నిర్ధా రించారు. ఏజెన్సీ భూములను స్వాధీనం చేసుకున్న కబ్జా దారులు అందులో రైస్‌మిల్లు కూడా ఏర్పాటు చేశారు.
మంచిర్యాల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో గిరిజన (ఏజెన్సీ) భూములు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని తేలింది. ఈ మేరకు గురువారం గ్రామంలో సర్వే జరిపిన రెవెన్యూ అధికారులు భూములు కబ్జాకు గురైనట్లు నిర్ధా రించారు. ఏజెన్సీ భూములను స్వాధీనం చేసుకున్న కబ్జా దారులు అందులో రైస్‌మిల్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయమై ‘ఏజెన్సీ భూమి కబ్జా’ శీర్షికన నవంబరు 12న ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా అనుబంధంలో కథనం ప్రచురిత మైంది. కథనంపై స్పందించిన కలెక్టర్ కుమార్ దీపక్‌తో పాటు, ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా దండేపల్లి తహసీల్దార్‌కు సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు.
అన్యాక్రాంతం ఇలా....
ముత్యంపేట గ్రామం ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ గిరిజన చట్టాలైన 1/70, పేసా చట్టాలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ గిరిజనేతరులైన ఇద్దరు బడా వ్యక్తులు భూములను కబ్జా చేశారు. కబ్జా చేసిన భూమిలో ఓ వ్యాపారి ఏకంగా రైస్‌మిల్లు నిర్మిం చాడు. సదరు భూముల బహిరంగ మార్కెట్ విలువ రూ.కోటిపైనే ఉంది. ముత్యంపేట గ్రామంలో ఏజెన్సీ భూములను గిరిజనేతరులు ఆక్రమించి ఎలాంటి అనుమ తులు లేకుండా, కనీసం గ్రామ పంచాయతీ ట్రేడ్ లైసెన్స్ కూడా పొందకుండా మినీ రైస్‌మిల్లు ఏర్పాటు చేశాడు. అయితే అదే భూమిని ఉట్నూరులోని ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఇళ్లు లేని పలువురు గిరిజనులకు ఇంటి స్థలాల కోసం కేటాయిస్తూ గతంలో ఆదేశాలు జారీ చేశారు. పీవో ఆదేశాల మేరకు భూమిని ఇళ్లు లేని పేదలకు పంచాల్సి ఉండగా, స్థానిక రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి అన్యాక్రాంతమయ్యాయి. ఈ విషయమై గ్రామస్థులు కొందరు అక్టోబరు 28న కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ’ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్ సూచనల మేరకు అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ నవంబరు 26న అక్రమంగా రైస్‌మిల్లు ఏర్పాటు చేసిన స్థలంపై పూర్తిస్థాయిలో విచారణ జరపా లని తహసీల్దార్‌ను ఆదేశించారు. లేఖ ఇచ్చిన నాటి నుంచి గరిష్టంగా 7 రోజులలోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన గడువు ముగియడం, సర్వే చేపట్టకపోవడంతో గ్రామస్థులు ఉ ట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాకు ఫిర్యాదు చేశారు.
ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం....
కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో మండల రెవెన్యూ యంత్రాంగం కదిలింది. గురువారం ఉదయం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భూమన్న, సర్వేయర్ వినోద్, తదితరులు సదరు భూముల్లో సర్వే జరిపారు. విచారణలో సర్వే నెంబరు 17లో మొత్తం 1.12 ఎకరాల ఏజెన్సీ భూములు కబ్జాకు గురైనట్లు అధికారులు నిర్ధారించారు. అందులో గతంలో గిరిజనులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన 34 గుంటల భూమి కూడా ఉన్నట్లు తేల్చి బౌండరీలు ఏర్పాటు చేశారు. కబ్జాకు గురైన 34 గుంటల్లో 10 గుంటలతోపాటు దాని పక్కనే ఉన్న సర్వే నెంబరు 18లోనూ మరో 35 గుంటలు కబ్జా చేసిన వ్యాపారి ఆ స్థలంలో రైస్‌మిల్లును నిర్మించాడు. భూముల సర్వే పూర్తయినందున సంబంధిత నివేదికను తహసీల్దార్ ఐటీడీఏ పీవోకు అందజేయనున్నారు. అధికా రుల సర్వేలో భూములు కబ్జా గురయ్యాయని నిర్ధారణ కావడంతో ’ఆంధ్రజ్యోతి’ కథనం అక్షర సత్యమైంది.
ప్రభుత్వ వశమయ్యేనా....?
ముత్యంపేటలో కబ్జాకు గురైన ఏజెన్సీ భూములు తిరి గి ప్రభుత్వం స్వాధీన చేసుకుంటుందా అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్వే జరిపిన రెవెన్యూ అధికారులు సదరు భూముల్లో హద్దులు ఏర్పాటు చేశారు. అనంతరం భూముల్లో ఉన్న చెట్లను తొలగించేందుకు ఎక్స్‌కావేటర్ తెప్పించారు. పనులు ముగించుకొని అధికారులు వెళ్లిపోగానే ఎక్స్‌కావేటర్ డ్రైవర్‌ను కొందరు బెదిరించడంతో పనులు నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయమై కలెక్టర్, ఐటీడీఏ పీవో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. భూమిని సర్వే చేసిన ఆర్‌ఐ నివేదికను తహసీల్దార్‌కు, అక్కడి నుంచి ఐటీడీఏ పీవోకు వీలైనంత త్వరగా అందజేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Updated Date - Jan 02 , 2025 | 11:18 PM