వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:04 PM
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
రెబ్బెన, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. సోమవారం జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి సీతారాంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వార్డులు, ల్యాబ్, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యసేవల కోసం వచ్చే ప్రజలకు సకాంలో మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న నమునా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా ప్రారంభించాలన్నారు. అలాగే పలు పాఠశాలలను కూడా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సూర్యప్రకాష్, మండల వ్యవసాయాధికారి, ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
రెబ్బెన మండలం పర్శనంఆలకు చెందిన మాదవ్ తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్ మండలం వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన శోభ తాను సాగు చేస్తున్న భూమిని ఇతరులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తనకు న్యాయం చేయాలని దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ పట్టణంలోని సందీప్‌నగర్‌కు చెందిన శంకర్ తనకు మండలంలోని సామెల శివారులో గల భూమికి నూతన పట్టా పాసు పుస్తకం జారీ చేయాలని అర్జీ సమర్పించాడు. ఆసిఫాబాద్ పట్టణంలోని బజార్‌వాడికి చెందిన నీలాబాయి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాగజ్‌నగర్ మండలం ఈసుగాం గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన కుమారుడికి గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించాలని అర్జీ సమర్పించారు. కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన శంకరక్క తన పేరిట ఉన్న పట్టా భూమికి తెలంగాణ పాసు పుస్తకం జారీ చేయాలని అర్జీ సమర్పించారు. జైనూరు మండలం కొండిగూడ గ్రామానికి చెందిన సునీత తాను బీఎస్సీ, బీఈడీ చదివానని జిల్లాలో తన అర్హతకు తగ్గ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కెరమెరి మండలం గౌరి గ్రామానికి చెందిన రవిత తన భర్తకు ఆరోగ్యం బాగలేదని ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేదని, తనకు ఏదైనా వసతి గృహంలో ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 11:04 PM