సందిగ్ధంలో ‘స్థానికం’
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:27 PM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై సందిగ్ద పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుండగా, ఈ విషయమై ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
- స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
- నెలాఖరులోగా నోటిఫికేషనంటూ మంత్రి పొంగులేటి ప్రకటన
- టీపీసీసీ చీఫ్ కౌంటర్‌తో అయోమయం
- ఎన్నికలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
-బీసీ రిజర్వేషన్లు తేల్చాకే వెళ్లాలంటూ నిరసనలు
మంచిర్యాల, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై సందిగ్ద పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుండగా, ఈ విషయమై ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నెలాఖరులోగా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో ఉత్సాహం నిండింది. అయితే కోర్టులో ఉన్న అంశాన్ని తనకు సంబంధం లేని శాఖపై ప్రకటన ఎలా చేస్తారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మంత్రితి పొంగులేటి ప్రకటనపై కౌంటర్ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణ సందిగ్దంలో పడింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం ప్రకటిస్తూ చట్టబద్దత కోసం కేంద్రానికి పంపింది. దీంతో బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దీంతో అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగగా, 2024 ఫిబ్రవరి 1వ తేదీన సర్పంచ్‌ల పదవీకాలం ముగియగా, ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం జూలై 3న ముగిసింది. అలాగే జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీకాలం అదే సంవత్సరం జూలై 4న ముగిసింది. ఆగస్టులో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి ప్రభుత్వం స్థానికసంస్థల్లో ప్రత్యేకాధికారులను నియమించింది. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసి సంవత్సరం కావస్తున్నందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రభుత్వానికి అనివార్యంగా మారింది.
పూర్తయిన ఏర్పాట్లు...
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధతో ఉంది. ఆ దిశగా అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా ఓటరు జాబితాను కూడా సిద్ధం చేశారు. జిల్లాలో 16 మండలాలు ఉండగా, 306 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 16 జడ్పీటీసీ, 16 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్‌లో మూడు స్థానాలు విలీనం అయ్యాయి. దీంతో ఎంపీటీసీల సంఖ్య 127కు తగ్గింది. అయితే భీమారం, భీమిని మండలాల్లో ఒక్కొక్క స్థానం కొత్తగా పెరగడంతో ప్రస్తుతం ఎంపీటీసీల సంఖ్య 129కి చేరింది. అలాగే జిల్లాలోని గ్రామాల్లో మొత్తం 3,76,852 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 2,680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారుల నియామకం కూడా పూర్తయింది. ఎన్నికల కోసం 4,620 మంది పోలింగ్ సిబ్బందిని నియమించగా, వారందరికీ అవసరమైన శిక్షణ కార్యక్రమం కూడా ముగిసింది.
- రిజర్వేషన్ల టెన్షన్..
ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మునిసిపల్ చైర్మన్ పదవులపై ఆశతో ఉన్న నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో తీసుకొచ్చిన 2019 ప్రత్యేక చట్టం ప్రకారం అప్పటి నుంచి పదేళ్ల వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదు. అయితే రాష్ట్రంలో 2023లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత చట్టానికి సవరణలు చేసింది. ప్రతీ ఐదేళ్లకోసారి రిజర్వేషన్లలో మార్పులు ఉంటాయని ప్రకటించింది. దీంతో 2019లో ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌తోపాటు గ్రామాలు, మున్సిపాలిటీల్లో వార్డు సభ్యుల రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయనే భావనలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనతో వారంతా అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలు ఉండటంతో ఆశావహుల్లో అందోళన నెలకొంది. మరోవైపు రేవంత్ సర్కారు బీసీలకు ప్రకటించిన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయమై బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - Jun 19 , 2025 | 11:27 PM