రైతులకు భారమే...
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:49 PM
పెరిగిన ఎరువుల ధరలతో రైతన్న కుదేలవుతున్నారు. ఇప్పటికే సాగుభారం అధికంకాగా దానికి తోడు వివిధ రకాల ఎరువుల ధరలు కూడ పెరిగాయి.
- పెరిగిన ఎరువుల ధరలతో ఇబ్బందులు
- రూ. వంద నుంచి రూ.300 వరకు పెంపు
- వానాకాలం సీజన్‌లో భారమైన సాగు
మంచిర్యాల, జూలై 25(ఆంధ్రజ్యోతి): పెరిగిన ఎరువుల ధరలతో రైతన్న కుదేలవుతున్నారు. ఇప్పటికే సాగుభారం అధికంకాగా దానికి తోడు వివిధ రకాల ఎరువుల ధరలు కూడ పెరిగాయి. ఎరువుల రకాన్ని బట్టి 100 రూపాయల నుంచి గరిష్ఠంగా 300 రూపాయల వరకు ధరలు పెంచారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల కారణంగా వానాకాలం సీజన్‌లో పంటను సాగు చేసేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం ఎరువుల ధరలు పెరగడం వారికి భారంగా మారింది. డీఏపీ, యూరియా మినహా మిగితా అన్ని ఎరువుల ధరలు దాదాపుగా పెరిగాయి.
భారంగా వానాకాలం సాగు...
మంచిర్యాల జిల్లాలో వానాకాలం సాగుకింద మూడు లక్షల18వేల786 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వాటిలో జీలుగ పంట 37,845 ఎకరాలు, వరి పంట లక్షా58వేల161ఎకరాలు, పత్తిపంట లక్షా58వేల753 ఎకరాలు, కందులు 1,054ఎకరాలు, మొక్కజొన్న పంట 531 ఎకరాలు, పెసలు 116 ఎకరాలు, మినుములు 69 ఎకరాలు, ఇతర పంటలు 250ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటికి సంబంధించి ఎరువులు అవసరం ఉండగా వాటి రేట్లు పెరగడంతో రైతులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
78,073 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం...
వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో సాగైన వివిధ పంటలకు ఎరువులు వేసేందుకు మొత్తం 78,073 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వానాకాలం సాగుకు సంబంధించి వివిధ పంటలకు దశలవారీగా ఎరువులు వినియోగించనుండగా ఆ మేరకు ఎప్పటికప్పుడు స్టాక్ అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలోని 20 వ్యవసాయ ప్రాథమిక సంఘాలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు ఎరువులు అందుతున్నాయి. జిల్లాలోని ప్రస్తుతం వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు యూరియా, డీఏపీ ఎరువులు వినియోగిస్తున్నారు. వానాకాలం సాగుకు సంబంధించి మొత్తం 78,073 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటి వరకు 49,239.571 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరింది. ఇంకా సీజన్ ముగిసే సరికి 28,833.429 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరం ఉన్నవాటిలో యూరియా 28,506 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ప్రస్తుతం 37,79మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. అలాగే డీఏపీ 9082 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 646.08 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఎస్‌ఎస్‌పీ 1740 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 613.06 మెట్రి క్ టన్నులు అందుబాటులో ఉంది. ఎంఓపీ 2245 మెట్రిక్ టన్నులకు గాను 1079.55 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా కాంప్లెక్స్ 36,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 7964.63మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. మిగితా మొత్తం విడతలవారీగా జిల్లాకు రానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
Updated Date - Jul 25 , 2025 | 11:50 PM