ఇందిరా మహిళా శక్తి సంబరాలను విజయవంతం చేయాలి
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:27 AM
జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల నిర్వహణపై అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, వివిధ మండలాల సమాఖ్య సభ్యులు, సెర్ప్ ఏపీఎంలు, డీపీఎంలతో సమీక్షా సోమవారం సమావేశం నిర్వహించారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జూలై 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల నిర్వహణపై అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, వివిధ మండలాల సమాఖ్య సభ్యులు, సెర్ప్ ఏపీఎంలు, డీపీఎంలతో సమీక్షా సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ వరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, మహిళా సంఘాల సభ్యుల సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. 8వ తేదీన ప్రతి మండలంలో మండల సమాఖ్య సభ్యులతో, 9న గ్రామ సమాఖ్య సభ్యులతో సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సంఘంలో ఉన్న సభ్యురాలు ప్రమాదవశాత్తు చనిపోతే ప్రమాద బీమా, రుణ బీమా వర్తింపజేస్తోందన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు, పెట్రోల్ పంపులు నిర్వాహణ, చేపల పెంపకం, పెరిటి కోళ్ల పెంపకం, పాల డైరీ ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఐదు కోట్ల రూపాయలతో మహిళా శక్తి భవనాల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 22 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా రూ.20 లక్షల కమీషన్ వచ్చిందని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 446 అమ్మ ఆదర్శ పాఠశాలలో రూ.7.82 కోట్ల పనులను చేయడం ద్వారా మహిళా సంఘాల బలోపేతానికి చేయూత అందించామని వివరించారు. జిల్లా సంఘాల్లో నమోదు కాని మహిళలను గుర్తించి చేర్పించాలని, జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, కార్యదర్శి నవిత, కోశాధికారి కుసుమ, గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి, మండల సమాఖ్య సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులను పడకడ్బందీగా చేపట్టాలి
జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, మిషన్ భగీరథ ఈఈలతో పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. మురుగు కాలువలను ప్రతీరోజు శుభ్రం చేయాలని, అంతర్గత రహదారులలో గుంతలను పూడ్చి నీటినిల్వలను నివారించాలని, నీటి వనరులలో బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలని, దోమల వృద్ధిని అరికట్టేందుకు ఆయిల్ బాల్స్, బయోటెక్స్ స్ర్పే పిచుకారి చేయాలని తెలిపారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రై డే నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి నిల్వ ఉన్న నీటిని పడవేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో సీతారాం, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, ఈఈ సిద్దిఖి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 12:27 AM