యువ వికాసం మరింత జాప్యం
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:48 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- జూన్ 2నమంజూరు పత్రాలు ఇస్తామని వాయిదా
- ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
- ఆఫ్‌లైన్‌లో విచారణ.. అర్హుల ఎంపిక పూర్తి
- అమలులో ఆలస్యం
బెజ్జూరు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈనెల 2న తొలి విడత కింద రూ.లక్షలోపు యూనిట్లను మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ఆఫ్‌లైన్‌లో విచారణ పూర్తి చేశారు. అర్హులను ఎంపిక చేశారు కానీ అమలులో ఆలస్యం జరుగుతోంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో అర్హులకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తులను పునఃపరిశీలన చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో రాజీవ్ యువ వికాసం పథకం అమలులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ పథకానికి సంబంధించి రుణ లక్ష్యం తక్కువగా ఉండటం, దరఖాస్తులు ఎక్కువగా ఉండటంతో ఇప్పట్లో ఈ పథకం పట్టాలపైకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయితీపై రూ.50వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు రుణాలు అందించాలనే ఉద్దేశంతో యువత నుంచి నెల కిందట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరించాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 28,116దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్సీలు 6,836, ఎస్టీలు 7,233, బీసీలు 12,096, మైనార్టీలు 1,918, క్రిస్టియన్లు 33మంది దరఖాస్తులు చేసుకున్నారు.
- సిబిల్ స్కోర్ ఉంటేనే రూ.లక్షపై రుణం..
రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికారులే చేస్తారని నిబంధనల్లో రూపొందించారు. తీరా తుది జాబితా ఎంపికలో అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే ప్రాధాన్యత లభించిందన్న ఆరోపణలున్నాయి. ఇది వరకే రుణం తీసుకున్న లబ్ధిదారుల సిబిల్ స్కోరును రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ఆధారంగా తీసుకుంటున్నారు. సిబిల్ స్కోర్ అవసరం లేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయా విభాగాల వారీగా మండల కమిటీలు లబ్ధిదారులను గుర్తించినా అధికారులు అర్హుల జాబితాను బయట పెట్టడం లేదు. దీనివల్ల లబ్ధిదారుల్లో నైరాశ్యం నెలకొంది.
- అయోమయంలో యువత...
రాజీవ్ యువ వికాసం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. అయితే ఊహించని అడ్డంకులు, క్షేత్రస్థాయి సమస్యల కారణంగా పంపిణీ ప్రక్రియ వాయిదా పడింది. దీంతో పథకం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది దరఖాస్తుదారుల్లో అయోమయాన్ని, భవిష్యత్తుపై ఆందోళనను రేకెత్తించింది. జూన్ 2న జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఈ పథకం అమలు తీరుపై విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. ఇది యువత ఆశలను మరింత సన్నగిల్లంపజేస్తోంది. రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో దరఖాస్తుదారులు పథకం అమలుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలుపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మరింత సమయం పట్టే అవకాశాలున్నట్లు స్పష్టమవుతున్నది.
రుణం కోసం ఎదురు చూస్తున్నా....
- రాపెల్లి సమ్మన్న, బెజ్జూరు
రాజీవ్ యువ వికాసం కింద రుణం ఇస్తే కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా. రుణం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇప్పట్లో రుణం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న వారిని గుర్తించి రుణం ఇస్తే ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే అర్హులకు న్యాయం చేయాలి. రాజీవ్ యువ వికాసం పథకంలో రెండు లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా.
Updated Date - Jun 21 , 2025 | 11:48 PM