అన్నదాతకు వరం.. పీఎం కిసాన్ మాన్‌ధన్
ABN, Publish Date - Aug 04 , 2025 | 11:33 PM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన రైతులకు వరంగా మారనుంది. రైతులు వ్యద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజనను తీసుకువచ్చింది.
- 60 ఏళ్లు దాటిన అన్నదాతలకు పింఛను ప్రయోజనం
- 18 నుంచి 40 ఏళ్ల రైతులు అర్హులు
- రూ. 55 ప్రీమియంతో ప్రారంభం
వాంకిడి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన రైతులకు వరంగా మారనుంది. రైతులు వ్యద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజనను తీసుకువచ్చింది. వ్యద్ధాప్యంలోకి వచ్చాక చాలామంది రైతులకు ఎలాంటి ఆదాయవనరులు ఉండవు. ఈ నేపథ్యంలో వయస్సు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకం కింద 60 ఏళ్లు నిండాక రైతులకు ప్రతీ నెల మూడు వేల రూపాయల చొప్పున పింఛన్ జీవితకాలం అందుతుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. భూ రికార్డుల్లో తమ పేరు ఉండి రెండు హెక్టార్ల వరకు సాగు చేసేందుకు వీలుగా భూమి ఉన్న వారు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఎప్పుడు నమోదు చేసుకున్నా పెన్షన్ 60 ఏళ్లు దాటాకే వస్తుంది. నేషనల్ స్కీం, ఈఎస్‌ఐ స్కీం, ఈపీఎఫ్‌వో పరిధిలో ఉన్నవారు, ఏదైనా ఇతర చట్టబద్ద సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్నవారు, ఉన్నత ఆర్థికస్థితి కలిగినవారు, ట్యాక్స్ పరిధిలో ఉన్నవారు, ట్యాక్స్ పేయర్స్ ఈ పథకానికి అర్హులు కారు. ఈ పింఛన్ అందేవరకు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పథకంలో చేరే వారి వయస్సును బట్టి ప్రీమియం ఉంటుంది. రైతు చెల్లించినంతే ప్రభుత్వం కూడా తన వంతుగా బీమా కంపెనీకి నగదు జమచేస్తుంది.
- ప్రీమియం వివరాలు...
18 నుంచి 40 ఏళ్ల వయస్సు లోపు రైతులు ఈ పథకానికి అర్హులు. ప్రతి నెలా 55 రూపాయల నుంచి 200 రూపాయల వరక ప్రీమియంను బ్యాంక్ ఖాతా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. రైతు చెల్లించిన ప్రీమియం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సమానంగా చెల్లిస్తుంది. రైతు 55 రూపాయలు జమ చేస్తే ప్రతీనెల 110 రూపాయలు జమ అవుతుంది. 20 నుంచి 25 ఏళ్ల వయస్సు గల రైతులు 61 రూపాయలు, 30 ఏళ్ల వారికి 105 రూపాయలు, 35 ఏళ్ల వారికి 150 రూపాయలు, 40 ఏళ్ల వారికి 200 రూపాయలు ఉంటుంది. రైతు మరణిస్తే భార్య ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. 60 ఏళ్ల తర్వాత రైతు మరణిస్తే భార్యకు 1500 రూపాయల పింఛన్ వస్తుంది. రైతు ఫొటో, నివాస, ధ్రువీకరణపత్రం, సాగుభూమి, ఆదాయం వంటి వివరాలు, పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
- దరఖాస్తు చేసుకోవడం ఇలా....
పీఎం కిసాన్ మాన్‌ధన్ లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్ (సీఎంసీ) పీఎం కిసాన్ సీఎం కేఎంవై పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రైతు మొదట తన ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పీఎం కిసాన్ పథకానికి నమోదైన బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం డబ్బులను చెల్లించాలి. ప్రతీ నెల ఆటోమెటిక్‌గా డబ్బులు ఖాతా నుంచి పథకానికి జమ అవుతాయి. నామినీ వివరాలను నమోదు చేయాలి. మాన్ ధన్ దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని రైతు సంతకం చేసి పోర్టల్‌లో ఆప్లోడ్ చేయాలి. వెంటనే పీఎం కిసాన్ మాన్ ధన్ పింఛన్ కార్డు జనరేట్ అవుతుంది. కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రతీ నెల బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం డబ్బులు పీఎంకేఎంవై పథకానికి ఆటోమెటిక్‌గా జమ అవుతాయి. పీఎం కిసాన్ మాన్ ధన్ లబ్ధిదారులు కాకుంటే సీఎస్‌సీలో మాన్యూవల్‌గా దరఖాస్తు చేసుకొని పింఛన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రీమియం డబ్బులను నగదు రూపంలో చెల్లించాలి. ఆ తరువాత బ్యాంక్ ఖాతాను జత చేసుకోవాలి.
అవగాహన కల్పిస్తున్నాము
- గోపికాంత్, మండల వ్యవసాయ శాఖ అధికారి
పీఎం కిసాన్ మాన్‌ధన్ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. రైతు వేదికల్లో జరిగే సమావేశాలతో పాటు వ్యక్తిగతంగానూ పథకం గురించి తెలియజేస్తున్నాము. ఈ పథకం రైతులకు వ్యద్ధాప్యంలో ఎంతో ఆసరగా నిలుస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం ఏఈవోలను సంప్రదించాలి.
- జిల్లాలో సాగు వివరాలు
పంట ఎకరాలు
పత్తి 3,29,184
కంది 27,178
సోయా 2872
మొక్కజొన్న 4610
పెసర 617
రైతులు 97,363
ప్రీమియం చెల్లింపు ఇలా...
వయస్సు చెల్లించాల్సింది.
18 నుంచి 20 55
21 నుంచి 24 61
25 నుంచి 29 80
30 నుంచి 34 106
25 నుంచి 39 150
40 సంవత్సరాలు 200
Updated Date - Aug 04 , 2025 | 11:33 PM