Hyderabad: కోర్టు హాల్‌లో.. మహిళా జడ్జిపై చెప్పుతో దాడి
ABN, Publish Date - Feb 14 , 2025 | 04:26 AM
ఓ హత్యా యత్నం కేసులో నేరస్థుడు జిల్లా జడ్జిపై చెప్పు విసిరిన ఉదంత మిది. గురువారం జరిగిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం రేపింది. దుండగుడికి లాయర్లు, ఇతర కక్షిదారులు దేహశుద్ధి చేశారు.
యావజ్జీవ శిక్ష పడ్డ నేరస్థుడి ఘాతుకం
దేహశుద్ధి చేసిన లాయర్లు, కక్షిదారులు
రంగారెడ్డి కోర్టులు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఓ హత్యా యత్నం కేసులో నేరస్థుడు జిల్లా జడ్జిపై చెప్పు విసిరిన ఉదంత మిది. గురువారం జరిగిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం రేపింది. దుండగుడికి లాయర్లు, ఇతర కక్షిదారులు దేహశుద్ధి చేశారు. జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో ఓ వ్యక్తిపై తల్వార్‌తో దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించిన అత్తాపూర్ సిక్‌విలేజ్‌కు చెందిన కరణ్‌సింగ్‌కు రెండ్రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరీషా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. నార్సింగ్ ఠాణా పరిధిలో జరిగిన మరో హత్య కేసులో పోలీసులు గురువారం కరణ్‌సింగ్‌ను కోర్టులో హాజరుపరిచారు. ‘‘పోలీసులు జైలులో నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు..’’ అంటూ జడ్జి హరీషా వద్దకు వెళ్లిన కరణ్‌సింగ్.. చూస్తుండగానే తన కాలికి ఉన్న చెప్పును తీసి, ఆమెపై విసిరాడు. ఆ చెప్పు జడ్జికి తగలకుండా.. పక్కన పడిపోయింది.
ఆ వెంటనే కరణ్‌సింగ్ కోపోద్రిక్తుడై.. ‘‘నాకే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారా?’’ అంటూ దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. దాంతో పోలీసులు అతణ్ని కోర్టుహాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. మరో కేసులో 3వ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట కరణ్‌సింగ్‌ను హాజరుపరచగా.. అతను అక్కడ న్యాయవాదులను దూషించాడు. కోపోద్రిక్తులైన న్యాయవాదులు, ఇతర కక్షిదారులు అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు వారిని వారిస్తూ.. కరణ్‌సింగ్‌ను తప్పించి, జైలుకు తరలించారు. కాగా.. కరణ్‌సింగ్ చర్యను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, కార్యదర్శి గులగారి కృష్ణ, సొసైటీ డైరెక్టర్ బాచిరెడ్డి సాయిరెడ్డి ఖండించారు. ఈ ఘటనను నిరసిస్తూ.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరిస్తామని ప్రకటించారు.
Updated Date - Feb 14 , 2025 | 04:26 AM