రూ.1800 కోట్లతో ఏదుల-ఉల్పర లింక్
ABN, Publish Date - Jan 23 , 2025 | 03:31 AM
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో..
16 కి.మీ.ల టన్నెల్‌తో కలిపి 21 కి.మీ.ల మేర కాలువ పనులు .. పోతిరెడ్డిపల్లి వద్ద దుందుభిపై రబ్బర్‌డ్యామ్
పరిపాలనపరమైన అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. జీవో జారీ
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఏదుల నుంచి-ఉల్పర దాకా లింక్ పనులకు రూ.1800.62 కోట్లతో ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం జీవో జారీ చేశారు. ఈ నిధులతోనే పోతిరెడ్డిపల్లి వద్ద దుందుభి నదిపై ముంపు లేకుండా రబ్బర్‌డ్యామ్ కట్టనున్నారు. డిండి ఎత్తిపోతల పథకం కింద ఏదుల నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటిని తరలించాలని నిర్ణయించిన విష యం తెలిసిందే. అయితే, కచ్చితంగా ఎక్కడి నుంచి నీటిని తరలించాలనే దానిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. దీని ప్రకారం.. ఏదుల నుంచి 2.525 కి.మీ.ల మేర ఒపెన్ కెనాల్, 16 కి.మీ.ల మేర టన్నెల్, ఆ తర్వాత మరో 3.050 కి.మీ.ల ఒపెన్ కెనాల్ నిర్మించి నీటిని దుందుభి నదిలోకి తీసుకెళ్తారు. ఆ నీటిని మళ్లించేలా పోతిరెడ్డిపల్లి గ్రామం వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మిస్తారు.
పెండింగులో హెడ్‌వర్క్ పనులు
డిండి ఎత్తిపోతలలో ఇప్పటిదాకా ఏడు ప్యాకేజీలకు టెండర్లు పిలిచి పనులు చేపట్టగా, హెడ్‌వర్క్ (ఏదుల-పోతిరెడ్డిపల్లి లింక్) పనులు మాత్రం ప్రారంభించలేదు. డిండి ఎత్తిపోతల ప్రతిపాదన వచ్చిన సమయంలోనే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని భావించారు. ఆ తర్వాత ఏదుల నుంచి తరలించాలనే ప్రతిపాదన కూడా రాగా... గత ఏడాది మార్చి 13వ తేదీన ఏదుల నుంచి పోతిరెడ్డిపల్లి దాకా లింక్‌కు ఆమోదముద్ర వేశారు. ఈ అలైన్‌మెంట్‌కు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) కూడా ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యామ్‌తో పాటు సింగరాజు పల్లి, గొట్టిముక్కల, ఇర్విన్, ఎర్రవల్లి-గోకారం, చింతపల్లి, కిష్టారంపల్లి, శివన్నగూడెంలో రిజర్వాయర్లు కట్టనున్నారు. సింగరాజుపల్లి రిజర్వాయర్ పనులు 85 శాతం దాకా పూర్తికాగా... గొట్టిముక్కల రిజర్వాయర్ పనులు 98 శాతం మేర, ఎర్రవల్లి-గోకారం పనులు 26 శాతం, కిష్టారం పల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ పనులు చెరో 70 శాతం మేర పూర్తయ్యాయి. కాగా, ఈ ప్రాజెక్టుకు మొత్తం 16,030 ఎకరాలకు గాను 12,052 ఎకరాలను సేకరించారు.
60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా...
రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి దాకా పనులేమీ జరగలేదు. ఈ లింక్‌కు రూ.1800 కోట్లు ఖర్చు అవుతాయని అంచ నా వేయగా.. మంత్రివర్గం ఆమోదించి, ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతినిచ్చింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని 7 నియోజకవర్గాల పరిధిలో 228 గ్రామాలకు తాగునీటితో పాటు 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుగా ఈ పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్
Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’
Updated Date - Jan 23 , 2025 | 03:31 AM