మునిసిపాలిటీల్లో రేపట్నుంచే ప్రత్యేకాధికారుల పాలన
ABN, Publish Date - Jan 26 , 2025 | 03:36 AM
ప్రత్యేకాధికారుల నియామకానికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరింది. ఉత్తర్వులు కూడా సోమవారం నాటికి వెలువడే అవకాశం ఉందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు.
పాలకవర్గాలకు నేడే ఆఖరి రోజు సీఎం వద్దకు చేరిన ఉత్తర్వుల ఫైల్
ఏప్రిల్‌లోగా ఎన్నికలకు యోచన
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు ఆదివారంతో ముగియనున్న తరుణంలో సోమవారం నుంచి అవన్నీ ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ప్రత్యేకాధికారుల నియామకానికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరింది. ఉత్తర్వులు కూడా సోమవారం నాటికి వెలువడే అవకాశం ఉందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 మున్సిపాలిటీలుండగా, ఇటీవల అసెంబ్లీలో 12 కొత్త మున్సిపాలిటీలను ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపితే 154. అయితే 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన పాలక వర్గాల గడువు ఈ నెల 26తో ముగియనుంది. (ఇందులో కూడా కరీంనగర్, మేడ్చల్‌కు ఈ నెల 27 వరకు గడువు ఉంది.) వీటికి, కొత్తగా ఏర్పాటైన 12 మున్సిపాలిటీలకు కలిపి ఏప్రిల్ నాటికి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. బీసీ కులగణనపై స్పష్టత వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకునే అవకాశం ఉంది.
142 మున్సిపాలిటీలలో 130 మున్సిపాలిటీలకు 2020లో ఎన్నికలు జరగ్గా, 2021లో జీహెచ్‌ఎంసీతోపాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, సిద్ధిపేట, జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అందులో ఏజెన్సీ పరిధిలో ఉన్న పాల్వంచ, మణుగూరు, మందమర్రితోపాటు జహీరాబాద్ ఉన్నాయి. పాలక వర్గాల గడువు ముగియడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 కార్పొరేషన్లలో పదింటికి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ, ఖమ్మం నగర పాలక సంస్థలకు 2021లో ఎన్నికలు జరిగినందున ఇవి మినహాయించి మిగిలిన 10 నగరపాలక సంస్థలకు ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లను నియమించే అవకాశం ఉంది. వీటితోపాటు మున్సిపాలిటీలకు ఆర్డీవో స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించనున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి పట్టణాల ప్రగతికి అవరోధం లేకుండా చూసే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఇవీ చదవండి:
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 26 , 2025 | 03:37 AM