Chatgpt App Revenue: వామ్మో.. చాట్‌జీపీటీకి ఇంత డిమాండా.. ఎంత ఆదాయం వస్తోందో తెలిస్తే..
ABN, Publish Date - Aug 16 , 2025 | 09:10 PM
మొబైల్ యాప్ యూజర్లు, ఆదాయ పరంగా చాట్‌జీపీటీ తన పోటీదార్ల కంటే ఎంతో ముందంజలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో ఒక్కో డౌన్‌లోడ్‌పై అత్యధికంగా 10 డాలర్ల మేరకు ఆదాయాన్ని ఓపెన్ ఏఐ సమకూర్చుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేథ రంగంలో దూసుకుపోతున్న సంస్థ ఓపెన్ ఏఐ.. ఆదాయ సముపార్జనలో కూడా ఇదే దూకుడు కనబరుస్తోంది. కొన్ని టెక్ రంగ వెబ్‌సైట్స్ ప్రకారం, మే 2023 నుంచి ఇప్పటివరకూ చాట్‌జీపీటీ మొబైల్ యాప్ ద్వారా సంస్థకు 2 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండిట్లో కలిపి ఈ మొత్తం ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కూడా చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌కు డిమాండ్ భారీగానే ఉంది.
గతేడాదితో పోలిస్తే ఈ సారి మొబైల్ యాప్ ద్వారా రెవెన్యూ ఏకంగా 673 శాతం మేర పెరిగింది. గతేడాది కంటే 2.8 రెట్లు ఎక్కువగా ఈ ఏడాది జనాలు యాప్‌ను 318 మిలియన్‌లు సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. 2023 నుంచి ఇప్పటివరకూ జరిగిన చాట్‌జీపీటీ యాప్ ఇన్‌స్టాల్స్‌లో భారత్ 13.7 వాటాతో తొలిస్థానంలో ఉంది. 10.3 శాతం వాటాతో అమెరికా రెండో స్థానంలో ఉంది. అయితే, మొబైల్ యాప్ ద్వారా ఆదాయం పరంగా అమెరికా టాప్‌లో ఉంది. మొత్తం ఆదాయంలో 38 శాతం అమెరికా నుంచే వస్తోంది. అమెరికాలో ఒక్కో డౌన్‌లోడ్‌కు సగటున కంపెనీకి 10 డాలర్లు వస్తున్నట్టు సమాచారం.
ఇతర ఏఐ యాప్స్ కంటే కూడా చాట్‌జీపీటీ ఆదాయ పరంగా ముందంజలో ఉంది. 2023 నుంచి ఇప్పటివరకూ ఒక్కో యూజర్ సగటు యాప్ ఇన్‌స్టాలేషన్‌పై ఓపెన్ ఏఐ 2.91 డాలర్లను ఆర్జించింది. ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ సగటు ఆదాయం 2.55 డాలర్లు కాగా, గ్రోక్ సగటు ఆదాయం 0.75 డాలర్లుగా, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఆదాయం 0.27 డాలర్లుగా ఉంది. జనాల్లో ఏఐపై మక్కువ ఏ రేంజ్‌లో పెరిగిందో ఈ లెక్కలు చెబుతున్నాయని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
ఓపెన్ ఏఐ ఇటీవలే చాట్‌జీపీటీ-5ని లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఉచిత సబ్‌స్క్రైబర్లకు వినియోగంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్లస్, ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రం మరిన్ని ఫీచర్స్, లిమిట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
చాట్‌జీపీటీ-5పై విమర్శలు.. అది పెద్ద తప్పేనన్న సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్.. స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్
Read Latest and Technology News
Updated Date - Aug 16 , 2025 | 09:19 PM