Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ముందున్న అతిపెద్ద సవాలు అదే: స్టీవ్ వా
ABN, Publish Date - May 29 , 2025 | 09:02 AM
వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో కూడా ఇంతే నిలకడగా ఆడటమే అతడి ముందున్న అతిపెద్ద సవాలని ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ స్టీవ్ వా అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. ఈ టీనేజ్ సంచలనాన్ని ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం జాగ్రత్తగా గమనిస్తోంది. భవిష్యత్తు వైపు అతడి అడుగులు ఎలా ఉండబోతున్నాయా అన్న ఆసక్తిగా నెలకొంది. చిరు ప్రాయంలోనే దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని ఐపీఎల్ సెంచరీ సాధించిన అతడి ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, సీనియర్ క్రికెటర్లు అనేక మంది సూర్యవంశీ ఎదుర్కోబోయే సవాళ్ల గురించి వివిధ వేదికల్లో లేవనెత్తుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ స్టీ వా కూడా వైభవ్‌కు ఎదురుకానున్న సవాళ్ల గురించి ప్రస్తావించారు.
ఆటపై పట్టు సాధించడమే సూర్యవంశీకి అతి పెద్ద సవాలు కాబోతోందని స్టీవ్ వా అన్నాడు. ‘నేను ఆ సెంచరీని చూశా.. నమ్మలేకపోయా. ప్రతి బంతిని అత్యంత సులువుగా అతడు బౌండరీ బాట పట్టించాడు. అసలేమాత్రం ఒత్తిడి లేకుండా ఆడాడు. అయితే, ఒత్తిడి అంటే ఏంటో తెలియని 14 ఏళ్ల చిరుప్రాయంలో అతడు క్రికెట్ ఆడటం చూస్తుంటే అద్భుతంగా అనిపించింది. అయితే, ఇదే తీరుతో పూర్తి నియంత్రణతో భవిష్యత్తులో కూడా ఆడటం అతడు ఎదుర్కొనే సవాలు. ఇదే ఉత్సాహంతో, ఇంతే స్వేచ్ఛగా భవిష్యత్తులో కూడా అతడు ఆడగలడా?’ అని స్టీవ్ వా అన్నాడు. సూర్యవంశీకి టాలెంట్‌తో పాటు మానసిక స్థిరత్వం కూడా ఉందని కితాబునిచ్చాడు. ఇలాంటి వాళ్లు విజయవంతమైతే చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని ఆయన కామెంట్ చేశాడు.
ఇక సూర్యవంశీని సచిన్‌తో పోల్చడం కూడా సబబు కాదని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. ‘ఇతరులను సచిన్‌తో పోల్చలేము. ఓ 18 ఏళ్ల కుర్రాడు, ఆస్ట్రేలియాకు వచ్చి పెర్త్‌లో అత్యంత క్లిష్టమైన పిచ్‌పై సెంచరీ చేశాడంటే సామాన్య విషయం కాదు. అనుభవజ్ఞులైన ప్లేయర్స్ కూడా ఈ పిచ్‌పై తడబడతారు. కాబట్టి, పెర్త్‌లో ఓ టీనేజర్‌గా సెంచరీ చేయడం మామూలు విషయం కాదు. సచిన్ లాంటి ప్లేయర్లను చాలా అరుదుగా మాత్రమే చూస్తాము. కానీ ఐపీఎల్‌లో ఓ టీనేజర్ ఇంత వేగంగా సెంచరీ చేస్తాడని కూడా నేనెప్పుడూ ఊహించలేదు’ అని వా చెప్పుకొచ్చాడు. జీటీపై మ్యాచ్ సందర్భంగా ఆర్ఆర్ తరపున ఆడుతూ వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు.
ఇవి కూడా చదవండి:
సూర్యవంశీపై శుభమన్ గిల్ కాంట్రవర్షియల్ కామెంట్స్.. వెల్లువెత్తుతున్న విమర్శలు
సూర్యవంశీ జర్నీపై ఆసక్తికర విషయాలు పంచుకున్న కోచ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - May 29 , 2025 | 09:33 AM