గ్రామీణ క్రికెట్ గోడు పట్టదా
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:35 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పేరుకి తగ్గట్టే రాజధాని ప్రాంత క్రికెట్ అభివృద్ధి సంఘంలా తయారైంది. 1934లో హెచ్‌సీఏ ఆవిర్భవించినప్పటినుంచి ఇప్పటివరకు జిల్లాల్లో ఒక్క టర్ఫ్ వికెట్...
90 ఏళ్లలో జిల్లాల్లో ఒక్క స్టేడియం కూడా కట్టని వైనం
జిల్లాలకు 9, హైదరాబాద్‌కు 200పైగా జట్లా?
కొత్త జిల్లాలకు, క్లబ్‌లకు గుర్తింపు ఇవ్వకుండా తాత్సారం
రాష్ట్రంలో మరో కొత్త క్రికెట్ సంఘం కోసం డిమాండ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పేరుకి తగ్గట్టే రాజధాని ప్రాంత క్రికెట్ అభివృద్ధి సంఘంలా తయారైంది. 1934లో హెచ్‌సీఏ ఆవిర్భవించినప్పటినుంచి ఇప్పటివరకు జిల్లాల్లో ఒక్క టర్ఫ్ వికెట్ ఉన్న స్టేడియం కూడా నిర్మించలేదు. 65 శాతం జనాభా గల జిల్లాల నుంచి క్రికెటర్లు ఆడేందుకు తొమ్మిదే జట్లుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 35 శాతం క్రికెటర్లు పోటీ పడేందుకు ఏకంగా 205 జట్లున్నాయి. గ్రామీణ క్రికెట్‌పై అనాదిగా హెచ్‌సీఏ శీతకన్ను వేసిందనేందుకు ఇదే నిదర్శనం. ప్రస్తుత కార్యవర్గం చేతిలోకి హెచ్‌సీఏ పగ్గాలు వచ్చాక గుడ్డిలో మెల్ల అనేలా మహబూబ్‌నగర్ జిల్లాలో టర్ఫ్ వికెట్ నిర్మించేందుకు సుమారు రూ.60 లక్షల నిధులను గత ఏడాది మంజూరు చేసింది. ఇది మినహా మిగిలిన ఎనిమిది జిల్లాల్లో హెచ్‌సీఏ స్టేడియం ఒక్కటీ లేదు. రాష్ట్రంలో ధనిక క్రీడా సంఘంగా చెప్పుకునే హెచ్‌సీఏకి హైదరాబాద్‌లో కూడా ఉప్పల్, సికింద్రాబాద్ జింఖానా స్టేడియాలు మినహా ఒక్క సొంత మైదానం కూడా లేదు. కారణం ఈ సంఘంలోని మూడు గ్రూపులకు చెందిన వారే హైదరాబాద్ శివార్లలో క్రికెట్ మైదానాలు నిర్మించి వాటిని హెచ్‌సీఏకి అద్దెకుఇస్టుంటారు. హెచ్‌సీఏ సొంత స్టేడియాలు నిర్మిస్తే తమ ఆదాయానికి గండి పడుతుందన్నది వీళ్ల భయం.
క్లబ్ క్రికెట్ పేరిట దందా!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 205 క్లబ్‌లతో హెచ్‌సీఏ డివిజన్ లీగ్‌లు నిర్వహిస్తారు. ఈ లీగ్స్‌లో హైదరాబాద్ పరిసర క్రికెటర్లందరూ ఏడాది పొడవునా ఆడేందుకు ఒక టోర్నమెంట్ వ్యవస్థ ఉంది. దేశవాళీ టోర్నీలకు క్రికెటర్లను ఎంపిక చేయాలంటే ఈ లీగ్స్‌లో ప్రదర్శనే ప్రామాణికం. జిల్లాల్లో ఈ క్లబ్‌లు, లీగ్ వ్యవస్థ లేకపోవడంతో గ్రామీణ క్రికెటర్లకు అన్యాయం జరుగుతోంది. జిల్లాల జట్లు, క్లబ్‌ల సంఖ్య పెరిగితే హైదరాబాద్ పరిధిలోని క్లబ్‌లలో అనధికారికంగా డబ్బులిచ్చి ఆడేందుకు వచ్చేవారు ఆగిపోతారనే భయంతో హెచ్‌సీఏలోని కొందరు దళారులు కొత్త జిల్లాలు, క్లబ్‌లకు సభ్యత్వం ఇవ్వకుండా మోకాలడ్డుతున్నారు. 65 శాతం జనాభా గల గ్రామీణ తెలంగాణ క్రికెటర్లలో ఎంత మంది ప్రతిభావంతులున్నా ఉమ్మడి జిల్లాల తొమ్మిది జట్లలోనే ఆడాల్సి రావడం దురదృష్టకరం. హెచ్‌సీఏలోని కొందరు తమ క్లబ్‌లను ఏడాదికి రూ.15 లక్షలు చొప్పున అనధికారికంగా లీజుకు ఇస్తారని తెలుస్తోంది. కోచ్‌ల రూపంలో ఉండే కొందరు వ్యక్తులు జట్టులో ఆడిస్తామని ఆశ చూపి క్రికెటర్ల తల్లిదండ్రుల నుంచి డబ్బు దండుకుంటున్నారు. గత రెండు దశాబ్దాల్లో ఈ దందా బాగా విస్తరించింది.
రూ.2.5 కోట్లు పలుకుతున్న హెచ్‌సీఏ క్లబ్!
గత 25 సంవత్సరాల్లో హెచ్‌సీఏ ఒక్క కొత్త క్లబ్‌కు కూడా సభ్యత్వం ఇవ్వలేదు. గత రెండేళ్లలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కూడా కోట్లు వెచ్చించి క్లబ్‌లు కొనుగోలు చేశారంటే వాటి డిమాండ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ క్లబ్‌ల ధర రూ.2.5 కోట్లు పలుకుతుందని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 94 నియోజకవర్గాలకు ఒక్కో క్లబ్, 31 కొత్త జిల్లాలకు సభ్యత్వాలు ఇస్తే 125 కొత్త జట్ల తరఫున గ్రామీణ క్రికెటర్లకు ఆడేందుకు అవకాశం వస్తుంది. క్లబ్‌ల నిర్వహణపై దర్యాప్తు చేసి, హెచ్‌సీఏ నిబంధనలను పాటించని వాటి గుర్తింపు రద్దు చేయడంతో పాటు, ఒకే కుటుంబం, వారి బంధువులు, బినామీల పేరిటనున్న మల్టీపుల్ క్లబ్‌లపై గతంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు తొలగించిన నిషేధాన్ని కొనసాగిస్తే హెచ్‌సీఏలోని అవినీతికి అడ్డుకట్ట పడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలకు కొత్త సంఘం కావాలి!
హెచ్‌సీఏలో పాతుకుపోయిన ముఠాల వల్ల తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి జరగదని మాజీ క్రికెటర్లు, వర్ధమాన క్రీడాకారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లాల్లో కార్యకలాపాలపై హెచ్‌సీఏ శ్రద్ధ వహించకపోవడంతో హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన 31 కొత్త జిల్లాలకు బీసీసీఐ కొత్త క్రికెట్ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి అంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్), తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) లాంటి సంఘాలు ఏర్పాటయ్యాయి. వీళ్లంతా ఒక్కటై జిల్లాల్లో క్రికెట్‌కు సంబంధించిన సమస్యపై దృష్టి పెట్టాలని గ్రామీణ క్రికెటర్లు కోరుతున్నారు. జిల్లాలన్నింటికి ఒక కొత్త క్రికెట్ సంఘం రూపుదిద్దుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
అందరూ కలిసి రావాలి..
జిల్లాల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు, గ్రామీణ క్రికెటర్లకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు అందరూ ఒక్క తాటిపైకి రావాలి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అని కాకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా హెచ్‌సీఏ పెద్దలు వారితో అంటకాగుతూ తమ పబ్బం గడుపుకొంటున్నారు. ఇది క్రికెటర్ల భవిష్యత్‌కు తీవ్ర నష్టం చేస్తోంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలాంటి ప్రతిభావంతులకు తెలంగాణలోకొదవ లేదు. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలతో కొత్త క్రికెట్ సంఘం ఏర్పాటు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు బీసీసీఐకి లేఖ రాయాలి.
అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి
(తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం చైర్మన్)
25 శాతం నిధులు ఇవ్వాల్సిందే!
బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు వచ్చే నిధుల్లో 25 శాతం ప్రత్యేకంగా జిల్లా ల్లో క్రికెట్ అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామని గత ఏజీఎంలో తీర్మానించారు. అయితే ఈ నిర్ణయం ఆచరణకు నోచుకోలేదు. తక్షణమే ఆ హామీని నెరవేర్చాలి. నిరుడు ఖర్చు చేయని ఆ 25 శాతం నిధులను కూడా ఈ ఏడాది జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి వెచ్చించాలి. జిల్లా క్రికెట్ సంఘాలను బలోపేతం చేసేందుకు కొత్త జిల్లాలకు గుర్తింపు, జిల్లాల్లో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి.
వి. ఆగంరావు
(కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు)
(ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి- హైదరాబాద్)
ఇవీ చదవండి:
నో బాల్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 05:35 AM