ఇంత జరిగినా
ABN, Publish Date - Jun 05 , 2025 | 05:17 AM
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోయి, భారీ సంఖ్యలో గాయపడినా సంబరాలలో పాల్గొన్నదంటూ ఆర్‌సీబీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పక్క అభిమానులు చనిపోయినా...
తొక్కిసలాట, మరణాల తర్వాతా వేడుకలా..
ఆర్‌సీబీపై విమర్శల వెల్లువ
ప్రణాళికా లోపంవల్లే బీసీసీఐ కార్యదర్శి సైకియా
బెంగళూరు : చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోయి, భారీ సంఖ్యలో గాయపడినా సంబరాలలో పాల్గొన్నదంటూ ఆర్‌సీబీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పక్క అభిమానులు చనిపోయినా మరో పక్క సన్మానం కొనసాగడమా..అని నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ‘ఒక పరేడ్. తెలివిహీనులు, పెను విషాదం, బారీకేడ్లు లేకుండా, ప్రణాళిక లేకుండా ఇంత భారీ స్థాయిలో వేడుక నిర్వహించడమా? మూర్ఖులు మాత్రమే ఇలా చేస్తారు. పాలనా యంత్రాంగం మెదడు మొద్దుబారిపోయిందా’ అని ఓ నెటిజన్ దుయ్యబట్టాడు. ‘మృతదేహాలు అలా పడి ఉన్నా విజయోత్సవం కొనసాగడం దిగ్ర్భాంతికరం. ఉత్త పుణ్యానికి యువ కన్నడిగులు ప్రాణాలు కోల్పోయారు. అంత అమానవీయంగా ఎలా వ్యవహరించారు? అంత ఉదాసీనంగా ఎలా ఉండిపోయారు ? ఇది క్షమించరానిది. బాధ్యులను నేరస్తులుగా పరిగణించాలి’ అని మరో యూజర్ ఏకి పారేశాడు. తొక్కిసలాట నేపథ్యంలో భద్రతా కారణాలు చూపుతూ విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ పరేడ్‌ను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది.
న్యూఢిల్లీ: ప్రణాళికా లోపంవల్లే చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట చోటుచేసుకుందని బీసీసీఐ పేర్కొంది. ‘ఈ సంఘటన చాలా దురదృష్టకరం. క్రికెట్‌కున్న పాపులారిటీలో ఇది ప్రతికూల కోణం. క్రికెటర్లపట్ల ప్రజలకు ఎంతో క్రేజ్ ఉంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మెరుగైన ప్రణాళికతో నిర్వహించాల్సింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా పేర్కొన్నాడు. ‘ఈస్థాయిలో విజయోత్సవాలను నిర్వహిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు, భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడో కొన్ని లోపాలు జరిగాయి. అద్భుతంగా జరిగిన ఐపీఎల్‌కు ఇది విషాద ముగింపు’ అని అతడు వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా..గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు ముంబైలో చక్కగా నిర్వహించిన విజయోత్సవాన్ని సైకియా గుర్తు చేశాడు. ‘గతంలోనూ ఐపీఎల్ విజయోత్సవాలు జరిగాయి. గత ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ కప్ గెలిచినప్పుడు కోల్‌కతాలో సంబరాలు సాఫీగా నిర్వహించారు’ అని అన్నాడు.
అంతా గందరగోళం..
బెంగళూరు: కోహ్లీకి ఉన్న అభిమాన గణాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ సంఘం తక్కువగా అంచనా వేయడం ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంచనాలకు అందని రీతిలో దేశ వ్యాప్తంగా విరాట్‌కు ఫ్యాన్స్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రేక్షకుల హాజరుపై అంచనా లేకపోవడం: సన్మాన సభకు ఎంత మంది అభిమానులు వస్తారనే విషయంలో అంచనాలే లేకపోవడానికి తోడు ప్రణాళికా లోపం స్పష్టంగా కనిపించింది. స్టేడియం సామర్థ్యం 35వేలు కాగా..రెండు నుంచి మూడు లక్షల మంది ఫ్యాన్స్ పోటెత్తారు.
కార్యక్రమ వివరాలపై గందరగోళం: చివరి నిమిషందాకా విజయోత్సవ ర్యాలీ రద్దు గురించి తెలియకపోడంతో అభిమానులు గందరగోళానికి లోనయ్యారు. పరేడ్‌లో ఓపెన్ టాప్ వాహనంలో క్రికెటర్లు స్టేడియంలోకి రావాల్సి ఉంది. కానీ అది రద్దు కావడంతో ఆటగాళ్లు బస్సులో వచ్చారు. దాంతో వారిని చూడాలనే ఆత్రుతతో స్టేడియంలోకి అభిమానులు ఒక్కసారిగా చొచ్చుకు వచ్చారు. దీంతో గేట్లు విరిగిపోయాయి.
డ్రెయిన్ కూలి: పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఒక్కసారిగా స్డేడియంలోకి ప్రవేశించడంతో డ్రెయినేజీపై ఉన్న శ్లాబ్ కూలిపోయింది. దాంతో అభిమానులంతా భయాందోళనకు లోనయ్యారు. పైగా ఫ్యాన్స్ చెట్లు, స్టేడియం గేట్లు ఎక్కడంతో గందరగోళం మరింత పెరిగింది. కొద్ది సంఖ్యలో ఉన్న పోలీసులు అభిమానులను నియంత్రించలేక పోయారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 05 , 2025 | 05:27 AM