ప్చ్.. రాజస్థాన్
ABN, Publish Date - Apr 20 , 2025 | 04:36 AM
రాజస్థాన్ రాయల్స్‌కు మరోసారి ఆఖరి ఓవర్‌లోనే భంగపాటు ఎదురైంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో 9 పరుగులను సాధించలేక సూపర్ ఓవర్‌కు వెళ్లి ఓడగా.. ఈసారీ లఖ్‌నవూపై 9 పరుగులు చేయలేక చతికిలపడింది....
ఆఖరి ఓవర్‌లో ఓటమి
లఖ్‌నవూను గెలిపించిన అవేశ్
జైపూర్: రాజస్థాన్ రాయల్స్‌కు మరోసారి ఆఖరి ఓవర్‌లోనే భంగపాటు ఎదురైంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో 9 పరుగులను సాధించలేక సూపర్ ఓవర్‌కు వెళ్లి ఓడగా.. ఈసారీ లఖ్‌నవూపై 9 పరుగులు చేయలేక చతికిలపడింది. ఫలితంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఆర్‌ఆర్ ఓటమి పాలైంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, పేసర్ అవేశ్ ఖాన్ (3/37) చివరి ఓవర్‌లో లఖ్‌నవూను గట్టెక్కించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. మార్‌క్రమ్ (66), బదోని (50), సమద్ (30 నాటౌట్) రాణించారు. హసరంగకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసి ఓడింది. జైస్వాల్ (74) అదరగొట్టగా.. పరాగ్ (39), వైభవ్ (34) ఫర్వాలేదనిపించారు.
చివర్లో తడబాటు: ఛేదనలో రాజస్థాన్ ఇన్నింగ్స్ వేగంగా ఆరంభమైంది. ఓపెనర్‌గా వచ్చిన 14 ఏళ్ల వైభవ్ అరంగేట్ర మ్యాచ్‌లో అదుర్స్ అనిపించాడు. తొలి ఓవర్‌లో తానెదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఆ వెంటనే అవేశ్ ఓవర్‌లోనూ 6,4తో జోరు చూపాడు. అటు జైస్వాల్ మరింత దూకుడుతో బౌండరీలు రాబట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 61 పరుగులు సాధించింది. 31 బంతుల్లో జైస్వాల్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, మార్‌క్రమ్ ఓవర్‌లో వైభవ్ స్టంపయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే రాణా (8) శార్దూల్‌కు చిక్కాడు. 18వ ఓవర్‌లో జైస్వాల్, పరాగ్‌లను అవేశ్ అవుట్ చేశాడు. ఇక 12 బంతుల్లో 20 రన్స్ కావాల్సిన వేళ కాస్త ఒత్తిడి నెలకొన్నా, హెట్‌మయెర్ (12) రెండు ఫోర్లతో ఆరు బంతుల్లో 9 రన్స్ అవసరమయ్యాయి. కానీ చివరి ఓవర్‌లో హైడ్రామా నెలకొంది. మూడో బంతికి హెట్‌మయెర్‌ను అవుట్ చేసిన అవేశ్ ఆరు పరుగులే ఇవ్వడంతో లఖ్‌నవూ సంబరాల్లో మునిగింది.
ఆఖరి ఓవర్‌లో హల్‌చల్: వికెట్ పొడిగా ఉండడంతో టాస్ గెలిచిన లఖ్‌నవూ బ్యాటింగ్ ఎంచుకుంది. మార్‌క్రమ్, బదోని నిలదొక్కుకున్నా ఆశించిన వేగం కనిపించలేదు. కానీ అబ్దుల్ సమద్ పుణ్యమా అని జట్టు సవాల్ విసిరే స్కోరందుకుంది. ఓపెనర్ మార్ష్ (4), పూరన్ (11) పవర్‌ప్లేలోనే వెనుదిరగ్గా.. కెప్టెన్ పంత్ (3) ఊపు గత మ్యాచ్‌కే పరిమితమైంది. స్పిన్నర్ హసరంగ అతడిని ఎనిమిదో ఓవర్‌లో దెబ్బతీశాడు. అయితే 54/3 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టుకు ఓపెనర్ మార్‌క్రమ్ అండగా నిలిచాడు. అటు బదోని కూడా అతడికి సహకరించాడు. నత్త నడకన సాగిన ఇన్నింగ్స్‌కు సమద్ ఆఖరి ఓవర్‌లో ఊపు తెచ్చాడు. సందీప్ వేసిన ఈ ఓవర్‌లో అతడు నాలుగు సిక్సర్లతో 27 రన్స్ సాధించగా జట్టు స్కోరు 153 నుంచి 180కి చేరింది.
స్కోరుబోర్డు
లఖ్‌నవూ: మార్ష్ (సి) హెట్‌మయెర్ (బి) ఆర్చర్ 4, మార్‌క్రమ్ (సి) పరాగ్ (బి) హసరంగ 66, పూరన్ (ఎల్బీ) సందీప్ 11, పంత్ (సి) జురెల్ (బి) హసరంగ 3, బదోని (సి) దూబే (బి) దేశ్‌పాండే 50, మిల్లర్ (నాటౌట్) 7, అబ్దుల్ (నాటౌట్) 30, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 180/5; వికెట్ల పతనం: 1-16, 2-46, 3-54, 4-130, 5-143; బౌలింగ్: ఆర్చర్ 4-0-32-1, తీక్షణ 4-0-32-0, సందీప్ 4-0-55-1, తుషార్ దేశ్‌పాండే 4-0-26-1, హసరంగ 4-0-31-2.
రాజస్థాన్: జైస్వాల్ (బి) అవేశ్ 74, వైభవ్ సూర్యవంశీ (స్టంప్డ్) పంత్ (బి) మార్‌క్రమ్ 34, నితీశ్ (సి) అవేశ్ (బి) శార్దూల్ 8, పరాగ్ (ఎల్బీ) అవేశ్ 39, జురెల్ (నాటౌట్) 6, హెట్‌మయెర్ (సి) శార్దూల్ (బి) అవేశ్ 12, శుభమ్ దూబే (నాటౌట్) 3. ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 178/5; వికెట్ల పతనం: 1-85, 2-94, 3-156, 4-161, 5-175, బౌలింగ్: శార్దూల్ 3-0-34-1, అవేశ్ 4-0-37-3, దిగ్వేశ్ 4-0-30-0, మార్‌క్రమ్ 2-0-18-1, ప్రిన్స్ 4-0-39-0, రవి బిష్ణోయ్ 3-0-19-0.
14 ఏళ్లకే బరిలోకి..
బిహార్‌కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయస్సులోనే ఈ లీగ్‌లో అరంగేట్రం చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో ఇన్నాళ్లు ప్రయాస్ రే బర్మన్ (16) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. కెప్టెన్ శాంసన్ గాయం కారణంగా లఖ్‌నవూతో మ్యాచ్‌కు దూరం కావడంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వైభవ్‌ను ఓపెనర్‌గా ఆడించారు. అలాగే ఎలాంటి బెరుకు లేకుండా ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఆకట్టుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 20 , 2025 | 04:36 AM