ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వరుణుడిదే విజయం

ABN, Publish Date - Apr 27 , 2025 | 02:36 AM

తాజా ఐపీఎల్‌లో తొలిసారి ఓ మ్యాచ్‌ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌-పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. అయితే మొదట పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సజావుగానే సాగింది...

పంజాబ్‌ 201/4

ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్‌ అర్ధసెంచరీలు

కోల్‌కతా ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం

మ్యాచ్‌ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్‌

కోల్‌కతా: తాజా ఐపీఎల్‌లో తొలిసారి ఓ మ్యాచ్‌ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌-పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. అయితే మొదట పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన కోల్‌కతా కేవలం ఒక ఓవర్‌ మాత్రమే ఆడగలిగింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ఆరంభం కావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరారు. వెంటనే పూర్తి మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచినా వర్షం మాత్రం తెరిపినివ్వలేదు. గంటన్నర వేచి చూసినా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో రాత్రి 11 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ లభించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83), ప్రియాన్ష్‌ ఆర్య (35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 69) మెరుపు అర్ధసెంచరీలు సాధించగా.. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (25 నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు. వైభవ్‌ అరోరాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో మ్యాచ్‌ ఆగే సమయానికి నైట్‌రైడర్స్‌ ఒక ఓవర్‌లో వికెట్‌ కోల్పోకుండా ఏడు పరుగులు సాధించింది.


ఓపెనర్లు అదుర్స్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్‌ ఆర్య అదిరే ఆరంభాన్నిచ్చారు. కెప్టెన్‌ నిర్ణయాన్ని వమ్ము చేయకుండా ఇన్నింగ్స్‌ను కదం తొక్కించారు. చక్కటి సమన్వయంతో పాటు ఇద్దరూ పోటాపోటీ బౌండరీలతో చెలరేగారు. అయితే 15 ఓవర్లలోనే 161 స్కోరుతో ఉన్న వేళ పంజాబ్‌ స్కోరు సులువుగా 220కి చేరుతుందనిపించింది. కానీ డెత్‌ ఓవర్లలో కోల్‌కతా పేసర్లు కట్టడి చేశారు. దీంతో జట్టు కష్టంగా 200 దాటగలిగింది. అంతకుముందు ప్రియాన్ష్‌ తొలి బంతినే ఫోర్‌గా మలిచి తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. నాలుగో ఓవర్‌లో ఆర్య 4,4.. ఐదో ఓవర్‌లో ప్రభ్‌ 4,6తో పవర్‌ప్లేలో జట్టు 56 రన్స్‌ సాధించింది. అలాగే హర్షిత్‌ ఓవర్‌లో ఆర్య వరుసగా 4,6,4తో 27 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఇక 11వ ఓవర్‌లో ప్రభ్‌ రెండు సిక్సర్లు, ఆర్య ఓ సిక్సర్‌తో స్పిన్నర్‌ నరైన్‌ 22 పరుగులిచ్చుకున్నాడు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళుతున్న ఈ జోడీకి రస్సెల్‌ చెక్‌ పెట్టాడు. 12వ ఓవర్‌లో ప్రియాన్ష్‌ను అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆర్య నిష్క్రమించాక ప్రభ్‌సిమ్రన్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. 13వ ఓవర్‌లోనే 4,4,6తో హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. స్పిన్నర్‌ వరుణ్‌ ఓవర్‌లో ప్రభ్‌ 4,4,6,4 బాదడంతో 19 పరుగులు వచ్చాయి. అయితే సెంచరీ ఖాయమనుకున్న వేళ పేసర్‌ వైభవ్‌ విసిరిన లో ఫుల్‌టా్‌సకు ప్రభ్‌ క్యాచ్‌ అవుటయ్యాడు. అయితే అప్పటికి ఓవర్‌కు 11 పరుగుల రన్‌రేట్‌తో పంజాబ్‌ దూసుకెళుతోంది. కానీ రస్సెల్‌, వైభవ్‌ డెత్‌ ఓవర్లలో కట్టడి చేశారు. ఈ సమయంలో మ్యాక్స్‌వెల్‌ (7), జాన్సెన్‌ (3) వికెట్లను సైతం కోల్పోయిన పంజాబ్‌ ఆఖరి ఆరు ఓవర్లలో చేసింది 43 పరుగులే. ఇక, శ్రేయాస్‌ క్రీజులోనే ఉన్నా భారీ షాట్లు ఆడలేకపోయాడు.


స్కోరుబోర్డు

పంజాబ్‌: ప్రియాన్ష్‌ (సి) వైభవ్‌ (బి) రస్సెల్‌ 69, ప్రభ్‌సిమ్రన్‌ (సి) పావెల్‌ (బి) వైభవ్‌ 83, శ్రేయాస్‌ (నాటౌట్‌) 25, మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ 7, జాన్సెన్‌ (సి) వెంకటేశ్‌ (బి) వైభవ్‌ 3, ఇంగ్లిస్‌ (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 201/4; వికెట్ల పతనం: 1-120, 2-160, 3-172, 4-184; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4-0-34-2, సకారియా 3-0-39-0, హర్షిత్‌ 2-0-27-0, వరుణ్‌ 4-0-39-1, నరైన్‌ 4-0-35-0, రస్సెల్‌ 3-0-27-1.

కోల్‌కతా: గుర్బాజ్‌ (నాటౌట్‌) 1, నరైన్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: ఒక ఓవర్‌లో 7/0; బౌలింగ్‌: మార్కో జాన్సెన్‌ 1-0-6-0.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 8 6 2 0 12 1.104

ఢిల్లీ 8 6 2 0 12 0.657

బెంగళూరు 9 6 3 0 12 0.482

పంజాబ్‌ 9 5 3 1 11 0.177

ముంబై 9 5 4 0 10 0.673

లఖ్‌నవూ 9 5 4 0 10 -0.054

కోల్‌కతా 9 3 5 1 7 0.212

హైదరాబాద్‌ 9 3 6 0 6 -1.103

రాజస్థాన్‌ 9 2 7 0 4 -0.625

చెన్నై 9 2 7 0 4 -1.302

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2025 | 02:36 AM