పోలీసులు వద్దన్నా ససేమిరా
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:44 AM
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడమేమోగానీ..చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో...
వారి సూచనలు
పాటిస్తే ఈ ఘోరం జరిగేది కాదేమో!
బెంగళూరు : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడమేమోగానీ..చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ గాయపడ్డారు. ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచిన తర్వాత...ఆ రాత్రి చాలా సమయం వరకు అహ్మదాబాద్‌లో ఆ జట్టు వేడుకల్లో మునిగిపోయింది. అనంతరం ప్రత్యేక విమానంలో బెంగళూరు వచ్చింది. అయితే భద్రతా కారణాల రీత్యా విజయోత్సవ పరేడ్ వద్దని, జట్టు ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం కూడా వద్దని, తర్వాత తీరిగ్గా.. అంటే ఆదివారం ఏర్పాటు చేసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి, ఆర్‌సీబీ యాజమాన్యానికి పోలీసులు సూచించినట్టు తెలిసింది. ‘బుధవారం విజయోత్సవాలు వద్దని మంగళవారమే సూచించాం. అభిమానులు చాలా ఉద్వేగంగా ఉన్నారని, అందువల్ల సన్మానాన్ని నాలుగు రోజుల అనంతరం పెట్టుకోవాలని సర్కారుకు, ఆర్‌సీబీ యాజమాన్యానికి సలహా ఇచ్చాం. ర్యాలీ వద్దని, వేడుకను ఒకే ప్రాంతానికి పరిమితం చేయాలని కూడా సూచించాం’ అని పోలీసులను ఉటంకిస్తూ జాతీయ మీడియా గురువారం వెల్లడించింది. కానీ ఆదివారం వరకూ విదేశీ క్రికెటర్లు ఉండరని భావించిన మేనేజ్‌మెంట్ బుధవారంనాడే సంబరాలను నిర్వహించింది. అయితే పోలీసుల సూచనలను పెడచెవిన పెట్టి విజయోత్సవం నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్సవాలకన్నా..ప్రాణాలు మిన్న : కపిల్‌దేవ్
బెంగళూరు జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంపట్ల దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ విచారం ప్రకటించాడు. ‘పలువురు ప్రాణాలు కోల్పోయారన్న వార్త ఎంతో బాధ కలిగించింది. సంబరాల కన్నా ప్రాణాలు ముఖ్యం’ అని వ్యాఖ్యానించాడు. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండి.. జాగ్రత్తలు తీసుకోవాలని కపిల్ హితవు పలికాడు.
ఘటన కలిచివేసింది : కోహ్లీ
తొక్కిసలాట ఉదంతం తనను కలచి వేసిందని కోహ్లీ అన్నాడు. ‘ఈ ఘటనతో నాకు మాటలు రావడంలేదు. తీవ్ర విషాదంతో విచారంలో మునిగిపోయా’ అని సోషల్ మీడియాలో విరాట్ పోస్ట్ చేశాడు.
అంత తొందరేల : మదన్‌లాల్ మండిపాటు
ఫైనల్ మరునాడే విజయోత్సవాన్ని నిర్వహించేందుకు ఆర్‌సీబీ యాజమాన్యం ప్రయత్నించడాన్ని 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు మదన్‌లాల్ తప్పుపట్టాడు. ‘అంతకుముందు రోజు రాత్రే అహ్మదాబాద్‌లో సంబరాలు నిర్వహించుకున్నారు. మరునాడే బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. సరైన ప్రణాళిక లేకుండా కార్యక్రమం నిర్వహించడంవల్ల అమాయకులు బలయ్యారు’ అని మదన్‌లాల్ ఆగ్రహం వ్యక్తంజేశాడు.
రోడ్‌షోలు కూడదు : గంభీర్
ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీని భారత జట్టు కోచ్ గంభీర్ కూడా తప్పుబట్టాడు. ‘ఎప్పుడూ రోడ్‌షోలు నిర్వహించకూడదు. ప్రజల ప్రాణాలు ఎంతో విలువైనవి. ఇ లాంటి కార్యక్రమాలు తెరవెనుక జరగాలి. మేము 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిప్పుడు కూడా రోడ్‌షో చేయకుండా ఉంటే బావుండేది’ అని గంభీర్ అన్నాడు.
విరాట్‌కు తెలిసుండదు : వాసన్
తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన విషాదం గురించి కోహ్లీకి తెలిసివుండదని టీమిండియా మాజీ ఆటగాడు అతుల్ వాసన్ అభిప్రాయపడ్డాడు. ‘తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మరణించారనే విషయం సంబరాలు జరుగుతున్న సమయంలో కోహ్లీకి తెలియకపోయి ఉండొచ్చు. రాజకీయ నాయకులకు, ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి తెలిసినా..వారు స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తారు. విరాట్, ఇతర ఆటగాళ్లకు తెలియకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆ దారుణ ఘటన గురించి కోహ్లీకి తెలిస్తే విజయోత్సవాల్లో పాల్గొనకుండా అక్కడ నుంచి వెళ్లిపోయి ఉండేవాడు’ అని వాసన్ అన్నాడు.
ఇవీ చదవండి:
బెంగళూరు విషాదంపై సచిన్ రియాక్షన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 06 , 2025 | 04:44 AM