ఎక్స్‌ట్రా టైమ్ ఇప్పుడా
ABN, Publish Date - May 22 , 2025 | 03:46 AM
ఈ సీజన్ మధ్యలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎక్స్‌ట్రా టైమ్ (అదనపు సమయం)ను కేటాయించడాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం తప్పుపట్టింది. ఈ అంశంలో తమకు ...
తమకు అన్యాయం జరిగిందన్న నైట్‌రైడర్స్
న్యూఢిల్లీ: ఈ సీజన్ మధ్యలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎక్స్‌ట్రా టైమ్ (అదనపు సమయం)ను కేటాయించడాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం తప్పుపట్టింది. ఈ అంశంలో తమకు అన్యాయం జరిగిందని ఆ జట్టు సీఈవో వెంకీ మైసూర్.. ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమిన్‌ను ఈ-మెయిల్ ద్వారా ప్రశ్నించాడు. ప్లేఆఫ్స్ నేపథ్యంలో వర్షం కారణంగా కీలకమైన మ్యాచ్‌లు రద్దు కాకూడదన్న ఉద్దేశంతో ఈసారి లీగ్‌లో మిగతా మ్యాచ్‌లకు అదనంగా గంట సమయాన్ని కేటాయించారు. అయితే, ఈ కొత్త నిబంధనను ఐపీఎల్ పునరుద్ధరణ జరిగిన మూడ్రోజుల తర్వాత అంటే.. ఈనెల 20 నుంచి జరిగే మ్యాచ్‌ల నుంచి వర్తిస్తుందని ప్రకటించారు. దీనిపైనే వెంకీ మైసూర్ మండిపడ్డాడు. ‘ఐపీఎల్ పునరుద్ధరణతోనే అదనపు గంట సమయం ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? లీగ్ మళ్లీ మొదలయ్యాక తొలి మ్యాచ్‌లో భాగంగా ఈనెల 17న బెంగళూరులో ఆర్సీబీతో నైట్‌రైడర్స్ పోరు వర్షంతో రద్దయింది. దీంతో మా జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌కు రెండ్రోజుల ముందే బెంగళూరులో భారీ వర్షం పడింది. మా మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా.. బీసీసీఐ, ఐపీఎల్ సీఓఓ అప్పుడు మౌనంగా ఉన్నారు. మ్యాచ్‌లకు అదనంగా గంట సమయం ఉంటుందని ఆరోజే ప్రకటించి ఉంటే.. మా మ్యాచ్ కనీసం ఐదు ఓవర్లపాటైనా జరిగి ఉండేది. అప్పుడు మా జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలకు చాన్స్ ఉండేదేమో! ఇప్పుడేమో ఈనెల 20 నుంచి మ్యాచ్‌లకు ఎక్స్‌ట్రా టైమ్ వర్తిస్తుందని చెబుతున్నారు. ఈ విషయంలో మాకు అన్యాయం జరిగినట్టే కదా!’ అని ఈ-మెయిల్‌లో వెంకీ మండిపడ్డాడు. కోల్‌కతానే కాదు మరికొన్ని జట్లు కూడా.. సీజన్ మధ్యలో నిబంధనల మార్పును తప్పుపడుతున్నాయి.
Updated Date - May 22 , 2025 | 03:49 AM