జితేశ్ జిగేల్
ABN, Publish Date - May 28 , 2025 | 05:22 AM
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటుకుంది. ఎలిమినేటర్ గండాన్ని తప్పించుకోవాలంటే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. కళ్లముందు 228 పరుగుల భారీ లక్ష్యం ఉన్నప్పటికీ.. కెప్టెన్ జితేశ్ శర్మ (33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 నాటౌట్)...
ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరంటే..
క్వాలిఫయర్-1 (గురువారం)
పంజాబ్ X బెంగళూరు
వేదిక: ముల్లాన్‌పూర్ (రా. 7.30 నుంచి)
ఎలిమినేటర్ (శుక్రవారం)
గుజరాత్ X ముంబై
వేదిక: ముల్లాన్‌పూర్ (రా. 7.30 నుంచి)
లఖ్‌నవూపై అద్భుత విజయం
పంత్ సెంచరీ వృధా
క్వాలిఫయర్-1కు బెంగళూరు
లఖ్‌నవూ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటుకుంది. ఎలిమినేటర్ గండాన్ని తప్పించుకోవాలంటే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. కళ్లముందు 228 పరుగుల భారీ లక్ష్యం ఉన్నప్పటికీ.. కెప్టెన్ జితేశ్ శర్మ (33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ (30 బంతుల్లో 10 ఫోర్లతో 54) కూడా సహకరించడంతో బెంగళూరు 6 వికెట్లతో నెగ్గింది. దీంతో 19 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ క్వాలిఫయర్-1లో పంజాబ్‌తో ఆడనుంది. 2016 తర్వాత బెంగళూరు టాప్-2లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇందులో ఓడిన జట్టుకు మరో చాన్స్ ఉంటుంది. అలాగే ఐపీఎల్‌లో ఆర్‌సీబీకిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. ముందుగా లఖ్‌నవూ 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగులు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 నాటౌట్) శతకంతో సత్తాచాటగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఛేదనలో బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 230 పరుగులు చేసి నెగ్గింది. మయాంక్ (23 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్), సాల్ట్ (19 బంతుల్లో 6 ఫోర్లతో 30) ఆకట్టుకున్నారు. ఓరౌర్కీకి 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా జితేశ్ నిలిచాడు.
ముందు విరాట్.. ఆ తర్వాత జితేశ్: భారీ ఛేదనను ఆర్‌సీబీ సజావుగానే ఆరంభించింది. మొదట ఓపెనర్ విరాట్ కోహ్లీ విజయంపై ఆశలు రేకెత్తించగా.. జితేశ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ముగించాడు. రెండో ఓవర్‌లో విరాట్ నాలుగు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ సాల్ట్ ఆరో ఓవర్‌లో వెనుదిరిగినా పవర్‌ప్లేలో జట్టు 66/1 స్కోరుతో నిలిచింది. ఇక ఎనిమిదో ఓవర్‌లో రజత్ (14), లివింగ్‌స్టోన్ (0)లను పేసర్ ఓరౌర్కీ అవుట్ చేయడంతో 90/3తో తడబడినట్టు కనిపించింది. అయితే మయాంక్ పదో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో రన్‌రేట్ తగ్గకుండా చూశాడు. 27 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాక విరాట్‌ను పేసర్ అవేశ్ వెనక్కి పంపాడు. ఈ సమయంలో మయాంక్-జితేశ్ జోడీ వేగంగా ఆడే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జితేశ్ 14వ ఓవర్‌లో 6,4.. తర్వాతి ఓవర్‌లో 4,6,4,4తో పరుగుల వరద పారించాడు. 17వ ఓవర్‌లో హైడ్రామా నెలకొంది. తొలి బంతికే జితేశ్ అవుటైనా అది నోబ్‌గా తేలడంతో బతికిపోయాడు. ఇక అదే ఓవర్‌లో స్పిన్నర్ దిగ్వేష్ అతడిని మన్కడింగ్ కూడా చేశాడు. కానీ పంత్ అప్పీల్‌ను వెనక్కితీసుకోవడంతో నాటౌట్‌గా ప్రకటించారు. ఓ సిక్సర్‌తో 22 బంతుల్లోనే జితేశ్ హాఫ్ సెంచరీ కూడా పూర్తయ్యింది. 18వ ఓవర్‌లో అతడి 4,4,6,6తో 21 రన్స్ రావడంతో సమీకరణం 12 బంతుల్లో ఏడు పరుగులకు మారింది. దీంతో బెంగళూరు మరో 8 బంతులుండగానే నెగ్గింది.
పంత్-మార్ష్ ధనాధన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ అజేయ శతకంతో పాటు ఓపెనర్ మార్ష్ అదరగొట్టాడు. బౌలర్ ఎవరైనా బాదుడే లక్ష్యంగా ఈ జోడీ ముందుకు సాగడంతో స్కోరుబోర్డు ఉరకలెత్తింది. మార్‌క్రమ్ స్థానంలో ఆడిన అరంగేట్ర ఓపెనర్ బ్రీట్‌స్కీ (14)ని మూడో ఓవర్‌లోనే తుషార బౌల్డ్ చేశాడు. కానీ మరో వికెట్ తీసేందుకు ఆర్‌సీబీ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన పంత్ ఈసారి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఇప్పటికే జట్టు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన వేళ ఎలాంటి ఒత్తిడీ లేకుండా సహజశైలిలో ఆడడం కనిపించింది. రాగానే బాదుడు ఆరంభిస్తూ నాలుగో ఓవర్‌లో 6,4,4తో 18 రన్స్ అందించాడు. దీంతో జట్టు పవర్‌ప్లేలో 55 పరుగులు సాధించింది. ఇక భువీ ఓవర్‌లో 6,4తో ఆకట్టుకున్న పంత్.. పదో ఓవర్‌లో 6,4,4తో 29 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికి మార్ష్ ఇంకా 26 పరుగుల దగ్గరే ఉండడం గమనార్హం. కాస్త ఆలస్యంగా జోరు పెంచిన మార్ష్ పేసర్ షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో 4,6 బాదాడు. అలాగే సుయాష్ ఓవర్‌లో సిక్సర్‌తో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అటు పంత్ మాత్రం తన ధాటిని కొనసాగిస్తూ 15వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో అదుర్స్ అనిపించాడు. అయితే తర్వాతి ఓవర్‌లో మార్ష్ సైతం రెండు వరుస సిక్సర్లతో ఊపు మీద కనిపించినా పేసర్ భువీకి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 152 పరుగుల మెరుపు భాగస్వామ్యం ముగిసింది. పంత్ మాత్రం తన ధాటిని ఆపకుండా 18వ ఓవర్‌లో రెండు ఫోర్లతో 54 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. ఈ సంతోషంలో తను రెండు చేతులూ కింద పెట్టి తలకిందులుగా జంప్ చేస్తూ (సోమర్‌సాల్ట్) సంబరాలు చేసుకున్నాడు. అలాగే ఆఖరి రెండు ఓవర్లలో 26 పరుగులు చేసిన ఎల్‌ఎ్‌సజీ పూరన్ (13) వికెట్ కోల్పోయినా భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది.
స్కోరుబోర్డు
లఖ్‌నవూ: మార్ష్ (సి) సుయాష్ (బి) భువనేశ్వర్ 67, మాథ్యూ బ్రీట్‌స్కీ (బి) తుషార 14, పంత్ (నాటౌట్) 118, పూరన్ (సి) యశ్ దయాల్ (బి) షెఫర్డ్ 13, అబ్దుల్ సమద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 227/3; వికెట్ల పతనం: 1-25, 2-177, 3-226; బౌలింగ్: తుషార 4-0-26-1, క్రునాల్ 2-0-14-0, యశ్ దయాల్ 3-0-44-0, భువనేశ్వర్ 4-0-46-1, సుయాశ్ 3-0-39-0, షెఫర్డ్ 4-0-51-1.
బెంగళూరు: సాల్ట్ (సి) దిగ్వేష్ (బి) ఆకాశ్ 30, కోహ్లీ (సి) బదోని (బి) అవేశ్ 54, పటీదార్ (సి) అబ్దుల్ (బి) ఓరౌర్కీ 14, లివింగ్‌స్టోన్ (ఎల్బీ) ఓరౌర్కీ 0, మయాంక్ (నాటౌట్) 41, జితేశ్ (నాటౌట్) 85, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18.4 ఓవర్లలో 230/4; వికెట్ల పతనం: 1-61, 2-90, 3-90, 4-123; బౌలింగ్: ఆకాశ్ 4-0-40-1, ఓరౌర్కీ 4-0-74-2, దిగ్వేష్ రాఠి 4-0-36-0, షాబాజ్ 3-0-39-0, అవేశ్ 3-0-32-1, బదోని 0.4-0-9-0.
1
ఐపీఎల్‌లో 5 సార్లు (2013, 2016, 2023, 2024, 2025) 600+ స్కోర్లు సాధించిన ఏకైక బ్యాటర్‌గా విరాట్. అలాగే మొత్తంగా 63 హాఫ్ సెంచరీలతో వార్నర్ (62)ను అధిగమించాడు.
1
ఆర్‌సీబీ తరఫున (ఐపీఎల్‌లో 8606, చాంపియన్స్ లీగ్ టీ20లో 424) 9000+ పరుగులు సాధించిన విరాట్.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
పంజాబ్ 14 9 4 1 19 0.372
బెంగళూరు 14 9 4 1 19 0.301
గుజరాత్ 14 9 5 0 18 0.254
ముంబై 14 8 6 0 16 1.142
ఢిల్లీ 14 7 6 1 15 0.011
హైదరాబాద్ 14 6 7 1 13 -0.241
లఖ్‌నవూ 14 6 8 0 12 -0.376
కోల్‌కతా 14 5 7 2 12 -0.305
రాజస్థాన్ 14 4 10 0 8 -0.549
చెన్నై 14 4 10 0 8 -0.647
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
ఇవీ చదవండి:
టికెట్ల వ్యవహారం.. సంచలన నివేదిక!
బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 28 , 2025 | 05:22 AM