16 లేదా 17న
ABN, Publish Date - May 12 , 2025 | 06:04 AM
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. దీంతో ఈనెల 16 లేదా 17న లీగ్‌ను పునఃప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. పాక్ దాడుల కారణంగా...
ఐపీఎల్ పునఃప్రారంభం
కసరత్తు చేస్తున్న బీసీసీఐ
ఫైనల్ కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు
నేడు షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. దీంతో ఈనెల 16 లేదా 17న లీగ్‌ను పునఃప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. పాక్ దాడుల కారణంగా గత గురువారం ధర్మశాలలో పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ అర్ధంతరంగా ఆగిన విషయం తెలిసిందే. మరుసటి రోజే ఐపీఎల్‌ను వారం పాటు వాయిదా వేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే విదేశీ ఆటగాళ్లు కూడా తమ స్వస్థలాలకు వెళ్లారు. ఇంకా 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఐపీఎల్ పాలక మండలి, బీసీసీఐ అధికారుల మధ్య లీగ్ పునరుద్ధరణపై ఆదివారం కీలక సమావేశం జరిగింది. ‘వీలైనంత త్వరగా లీగ్‌ను ఆరంభించాలని మేమంతా ప్రయత్నిస్తున్నాం. బోర్డు కార్యదర్శి, ఐపీఎల్ చైర్మన్ కలిసి ఫ్రాంచైజీలతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికికైతే ఐపీఎల్‌పై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు’ అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించాడు. మరోవైపు లీగ్‌ను తిరిగి ఆరంభించడంపై ప్రభుత్వ సూచనల ప్రకారమే నడుచుకుంటామని బోర్డు కార్యదర్శి సైకియా తెలిపాడు. అయితే ఈనెల 13 నాటికి తమ ఆటగాళ్లను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయా ఫ్రాంచైజీలకు బోర్డు సూచించినట్టు తెలుస్తోంది.
లఖ్‌నవూ గీ బెంగళూరుతో
లీగ్ ఆరంభం
షెడ్యూల్ ప్రకారం ఈనెల 9న లఖ్‌నవూ-బెంగళూరు మ్యాచ్ జరగాల్సింది. కానీ లీగ్ వాయిదా నిర్ణయంతో ఆ మ్యాచ్ ఆగింది. తిరిగి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తో లఖ్‌నవూలోనే ఐపీఎల్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తమ ఆటగాళ్ళను వెనక్కి పిలవాల్సిందిగా ఆయా జట్లను బోర్డు కోరిందని, సోమవారం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తారని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ‘నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ, ధర్మశాలలో సొంత జట్ల మ్యాచ్‌లు ఉండవు. ఇప్పటికే అక్కడి నుంచి అన్ని రకాల సామగ్రిని తొలగించారు. అలాగే క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ హైదరాబాద్‌లోనే ఉంటాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలో కాకుండా అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు ఎక్కువ చాన్సుంది’ అని లీగ్ అధికారి వివరించాడు. ఇదిలావుండగా ఐపీఎల్‌ను తిరిగి ఆరంభిస్తే ఇంగ్లండ్‌లో పర్యటించే ఇండియా ‘ఎ’ జట్టుపై ప్రభావం పడనుంది. ఈనెల 30 నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే మూడు టెస్టుల (నాలుగు రోజుల) సిరీస్ కోసం మంగళవారం భారత్ ‘ఎ’ ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో తొలి మ్యాచ్‌కు ఐపీఎల్‌లో ఆడని ప్లేయర్లను పరిగణనలోకి తీసుకోవాలని సెలెక్టర్లకు సూచించారని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 12 , 2025 | 06:04 AM