ముక్కోణం మనదే
ABN, Publish Date - May 12 , 2025 | 06:01 AM
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్.. మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ ట్రోఫీని సొంతం చేసుకొంది. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన (101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116) ధనాధన్ శతకంతోపాటు...
శతకంతో మెరిసిన మంధాన
తిప్పేసిన స్నేహ్ రాణా
ఫైనల్లో 97 పరుగులతో లంక చిత్తు
కొలంబో: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్.. మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ ట్రోఫీని సొంతం చేసుకొంది. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన (101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116) ధనాధన్ శతకంతోపాటు బౌలర్లు స్నేహ్ రాణా (4/38), అమన్‌జోత్ కౌర్ (3/54) విజృంభించడంతో.. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 97 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 342 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ప్రతికా రావల్ (30)తో కలసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించిన మంధాన.. హర్లీన్ డియోల్ (47)తో కలసి రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేసింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగ్స్ (44) దూకుడుగా ఆడడంతో జట్టు స్కోరు 350 పరుగులకు చేరువైంది. మల్కీ మదార, డ్యూమీ విహంగ, సుగంధిక తలో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. అనంతరం ఛేదనలో శ్రీలంక 48.2 ఓవర్లలో 245 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ చమరి ఆటపట్టు (51), నీలాక్షిక సిల్వ (48), విష్మి గుణరత్నె (36) మినహా మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేక పోయారు. తెలుగమ్మాయి శ్రీచరణి ఒక వికెట్ పడగొట్టింది. స్మృతి మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా.. స్నేహ్ రాణా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకొంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 342/7 (మంధాన 116, హర్లీన్ 47, జెమీమా 44; సుగంధిక 2/59, విహంగ 2/69, మల్కీ మదార 2/74).
శీలంక: 48.2 ఓవర్లలో 245 ఆలౌట్ (ఆటపట్టు 51, నీలాక్షి 48, స్నేహ్ రాణా 4/38, అమన్‌జోత్ 3/54).
2
మహిళల వన్డేల్లో నాకౌట్ మ్యాచ్‌లో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా భారత్. 2022 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 356/5 అత్యధికం.
3
కెరీర్‌లో 11వ శతకం బాదిన మంధాన..
మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచింది. మెగ్‌లానింగ్ (15 సెంచరీలు),
సుజీ బేట్స్ (13 సెంచరీలు) టాప్-2లో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 12 , 2025 | 06:06 AM