ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బౌలర్లదే విజయభారం

ABN, Publish Date - Jun 24 , 2025 | 04:59 AM

భారత్‌ ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు అత్యంత రసవత్తరంగా మారింది. ఆట ఆఖరి రోజు 90 ఓవర్లలో ఇంగ్లండ్‌ విజయానికి మరో 350 పరుగుల దూరంలో ఉంది. పూర్తి వికెట్లు చేతిలో ఉన్న వేళ...

ఇంగ్లండ్‌ లక్ష్యం 371

ప్రస్తుతం 21/0

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 364 ఆలౌట్‌

శతక్కొట్టిన రాహుల్‌, పంత్‌

లీడ్స్‌: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు అత్యంత రసవత్తరంగా మారింది. ఆట ఆఖరి రోజు 90 ఓవర్లలో ఇంగ్లండ్‌ విజయానికి మరో 350 పరుగుల దూరంలో ఉంది. పూర్తి వికెట్లు చేతిలో ఉన్న వేళ.. ఆ జట్టు బజ్‌బాల్‌ గేమ్‌తో విరుచుకుపడుతుందా? లేక బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్‌ దళానికి లొంగుతుందా? అనేది మంగళవారం తేలనుంది. అంతకుముందు కేఎల్‌ రాహుల్‌ (247 బంతుల్లో 18 ఫోర్లతో 137), రిషభ్‌ పంత్‌ (140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 118) అద్భుత సెంచరీలతో అదరగొట్టగా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌ మాదిరే టెయిలెండర్లు నిరాశపర్చినప్పటికీ.. ఆతిథ్య జట్టు ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టంగ్‌, కార్స్‌లకు మూడేసి, బషీర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ సోమవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే (12 బ్యాటింగ్‌), డకెట్‌ (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. నేడు మ్యాచ్‌కు వరుణుడి నుంచి కూడా ఆటంకం కలిగే అవకాశాలున్నాయి.

నిదానంగా..: 90/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ తొలి సెషన్‌ను ఓపిగ్గా ఆడింది. పిచ్‌ బౌలర్లకు సహకరించడంతో రిస్కీ షాట్లకు వెళ్లలేదు. దీంతో 24.1 ఓవర్లలో కేవలం 63 పరుగులే చేయగలిగింది. ఆట మొదలయ్యాక ఏడో బంతికే కెప్టెన్‌ గిల్‌ (8) పేసర్‌ కార్స్‌ గుడ్‌ లెంగ్త్‌ బాల్‌కు బౌల్డ్‌ అయ్యాడు. కానీ ఓపెనర్‌ రాహుల్‌కు జత కలిసిన పంత్‌ సంయమనం ప్రదర్శించాడు. దూకుడును పక్కనబెట్టి క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. అటు టంగ్‌ ఓవర్‌లో రాహుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో బ్రూక్‌ అందుకోలేకపోయాడు. స్టోక్స్‌ బౌలర్లను మార్చినా వీరి వికెట్లను మాత్రం తీయలేకపోయారు. నింపాదిగా ఆడేస్తూ తొలి సెషన్‌లో ఆధిక్యాన్ని 159కి పెంచారు.

శతకాలతో అదుర్స్‌..: లంచ్‌ బ్రేక్‌ తర్వాత రాహుల్‌-పంత్‌ జోడీ ప్రత్యర్థి బౌలర్లను మరింత విసిగించింది. ఇద్దరూ శతకాలతో ఆకట్టుకున్నారు. ఈసారి పంత్‌ తన సహజశైలిలో చెలరేగడంతో రెండో సెషన్‌లో 145 పరుగులు సమకూరాయి. పేసర్‌ టంగ్‌, స్పిన్నర్‌ బషీర్‌లను లక్ష్యంగా చేసుకున్న తను బౌండరీలతో చకచకా స్కోరును పెంచసాగాడు. మరో ఎండ్‌లో రాహుల్‌ 202 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఇక 90కి చేరగానే పంత్‌ జాగ్రత్తగా ఆడాడు. మరో పది పరుగుల కోసం 26 బంతులాడి వరుసగా రెండో సెంచరీని పూర్తి చేశాడు. ఆ వెంటనే బ్యాట్‌ ఝళిపిస్తూ రూట్‌ ఓవర్‌లో 4,6,4తో 19 రన్స్‌ రాబట్టాడు. కానీ పంత్‌ జోరుకు స్పిన్నర్‌ బషీర్‌ బ్రేక్‌ వేయడంతో నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రాహుల్‌, కరుణ్‌ (20) మరో వికెట్‌ కోల్పోకుండా టీ బ్రేక్‌కు వెళ్లారు.

వికెట్లు టపటపా: చివరి సెషన్‌లో పుంజుకున్న ఇంగ్లండ్‌ బౌలర్లు కేవలం 31 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఆరు వికెట్లను పడగొట్టారు. రాహుల్‌-కరుణ్‌ మధ్య ఐదో వికెట్‌కు 46 పరుగులు జత చేరాక వికెట్ల పతనం ఆరంభమైంది. కొత్త బంతిని తీసుకున్నాక రాహుల్‌ పోరాటం ముగిసింది. 85వ ఓవర్‌లో అతడిని కార్స్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత వోక్స్‌కు రిటర్న్‌ క్యాచ్‌తో కరుణ్‌ వెనుదిరిగాడు. ఓ వైపు జడేజా నిలదొక్కుకోవాలని చూసినా.. 91వ ఓవర్‌లో పేసర్‌ టంగ్‌ ధాటికి శార్దూల్‌ (4), సిరాజ్‌ (0), బుమ్రా (0) పెవిలియన్‌కు చేరారు. ఇక ప్రసిద్ధ్‌ (0) వికెట్‌తో బషీర్‌ భారత్‌ రెండో ఇన్నింగ్స్‌కు చెక్‌ పెట్టాడు.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 471

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 465

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) కార్స్‌ 4; రాహుల్‌ (బి) కార్స్‌ 137; సాయి సుదర్శన్‌ (సి) క్రాలే (బి) స్టోక్స్‌ 30; గిల్‌ (బి) కార్స్‌ 8; పంత్‌ (సి) క్రాలే (బి) బషీర్‌ 118; కరుణ్‌ (సి అండ్‌ బి) వోక్స్‌ 20; జడేజా (నాటౌట్‌) 25; శార్దూల్‌ (సి) రూట్‌ (బి) టంగ్‌ 4; సిరాజ్‌ (సి) స్మిత్‌ (బి) టంగ్‌ 0; బుమ్రా (బి) టంగ్‌ 0; ప్రసిద్ధ్‌ (సి) టంగ్‌ (బి) బషీర్‌ 0; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 96 ఓవర్లలో 364 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-16, 2-82, 3-92, 4-287, 5-333, 6-335, 7-349, 8-349, 9-349, 10-364. బౌలింగ్‌: వోక్స్‌ 19-4-45-1; కార్స్‌ 19-2-80-3; టంగ్‌ 18-2-72-3; బషీర్‌ 22-1-90-2; స్టోక్స్‌ 15-2-47-1, రూట్‌ 3-0-21-0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలే (బ్యాటింగ్‌) 12; డకెట్‌ (బ్యాటింగ్‌) 9; మొత్తం: 6 ఓవర్లలో 21/0. బౌలింగ్‌: బుమ్రా 3-0-9-0, సిరాజ్‌ 2-1-9-0, జడేజా 1-0-3-0.

ఇంగ్లండ్‌లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లో 50+ స్కోర్లు సాధించిన పర్యాటక బ్యాటర్‌గా బ్రాడ్‌మన్‌, క్రోనే, చందర్‌పాల్‌, సంగక్కర, డారిల్‌ మిచెల్‌తో సమంగా నిలిచిన పంత్‌. వరుసగా ఏడు ఫిఫ్టీలతో స్మిత్‌ టాప్‌లో ఉన్నాడు.

2

ఇంగ్లండ్‌ గడ్డపై ఒకే టెస్టులో భారత ఓపెనర్లు (జైస్వాల్‌, రాహుల్‌) శతకాలు సాధించడం ఇది రెండోసారి. అంతకు ముందు (1936లో) విజయ్‌ హజారే, ముస్తాక్‌ అలీ ఈ ఫీట్‌ సాధించారు.

2

టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన రెండో కీపర్‌గా పంత్‌. గతంలో ఆండీ ఫ్లవర్‌ (2001లో) ఈ ఫీట్‌ సాధించాడు.

1

ఇంగ్లండ్‌ గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు శతకాలు బాదిన తొలి భారత క్రికెటర్‌గా పంత్‌ నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో భారత బ్యాటర్‌.

ఇవీ చదవండి:

సారీ చెప్పి ఫోర్ కొట్టాడు

కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్

దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 04:59 AM