Gill Double Century: గిల్ డబుల్
ABN, Publish Date - Jul 04 , 2025 | 03:49 AM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో రోజే అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 269) మొక్కవోని పట్టుదలతో...
ద్విశతకంతో రికార్డు
రాణించిన జడేజా, సుందర్
భారత్ 587 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 77/3
వహ్వా.. శుభ్‌మన్. టెస్టు పగ్గాలు చేపట్టాక ఈ యువ నాయకుడి బ్యాటింగ్ ప్రదర్శన శుభ ప్రదంగా సాగుతోంది. తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో మరింత జోరు చూపాడు. ఇంగ్లండ్ బౌలర్లు ఎంతగా కవ్వించినా.. సిసలైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ రాబట్టి అదుర్స్ అనిపించాడు. ఈక్రమంలో అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. తన మారథాన్ ఇన్నింగ్స్‌లో జడేజా, సుందర్‌లతో కలిసి శతక భాగస్వామ్యాలను నెలకొల్పి.. జట్టు స్కోరును 211/5 నుంచి 600 దరిదాపులోకి చేర్చడం విశేషం. ఆ తర్వాత పేసర్లు ఆకాశ్, సిరాజ్ ఆరంభంలో వికెట్లు తీయగా.. బ్రూక్, రూట్ తమ జట్టును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో రోజే అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 269) మొక్కవోని పట్టుదలతో డబుల్ సెంచరీ సాధించాడు. జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) సహకారం అందించడంతో గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్పిన్నర్ బషీర్‌కు మూడు.. వోక్స్, టంగ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. క్రీజులో బ్రూక్ (30), రూట్ (18) ఉన్నారు. ఆకాశ్‌కు 2, సిరాజ్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 510 పరుగులు వెనుకబడిన దశలో మూడో రోజు ఆట కీలకంగా మారనుంది.
నిలకడగా..: రెండో రోజు 310/5 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించగా, కెప్టెన్ గిల్, జడేజా నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను విసిగించారు. పిచ్ నుంచి వారికెలాంటి సహకారం లభించకపోవడంతో భారత జోడీ ఆధిపత్యం చూపింది. అటు షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా ఇంగ్లండ్ బౌలర్లు సఫలం కాలేకపోయారు. స్పిన్నర్ బషీర్ ఓవర్లలో గిల్, జడేజా సిక్సర్లతో ఆకట్టుకున్నారు. అయుతే లంచ్ బ్రేక్‌కు కాస్త ముందు శతకానికి చేరువగా ఉన్న జడేజాను టంగ్ షార్ట్ బాల్‌తో దెబ్బతీశాడు. దీంతో ఆరో వికెట్‌కు 203 పరుగుల భారీ భాగస్వామ్యానికి చెక్ పడింది. ఆ తర్వాత బరిలోకి దిగిన సుందర్‌ను ఇబ్బందిపెట్టేందుకు కెప్టెన్ స్టోక్స్ స్లిప్‌తో పాటు లెగ్ సైడ్‌లో మరో ఇద్దరిని మోహరించాడు. అలాగే పేసర్ టంగ్ సైతం అతడిని ఎక్స్‌ట్రా బౌన్స్‌తో దెబ్బతీయాలని చూశాడు. కానీ సుందర్ ఓపికను ప్రదర్శించాడు. ఈ సెషన్‌లో జట్టు 25 ఓవర్లలో 109 పరుగులు సాధించింది.
గిల్ ద్విశతకం: రెండో సెషన్‌లోనూ భారత్‌దే హవా సాగింది. గిల్ మరింత సాధికారతను చూపుతూ కెరీర్‌లోనే భారీ స్కోరుతో నిలిచాడు. అతడిని కట్టడి చేసేందుకు ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. అటు తొలి 40 బంతుల్లో ఐదు పరుగులే సాధించిన సుందర్ ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ సాగించాడు. పిచ్ మరింత ఫ్లాట్‌గా మారడంతో బషీర్ ఓవర్‌లో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన అతడు తర్వాతి ఓవర్‌లోనే 4,6తో లయ అందుకున్నాడు. అయితే గిల్ 199 రన్స్ దగ్గర ఉన్నప్పుడు వరుసగా మూడు ఓవర్లను సుందరే ఎదుర్కొన్నాడు. చివరికి టంగ్ ఓవర్‌లో సింగిల్‌తో గిల్ డబుల్ సెంచరీ పూర్తయ్యింది. ఆ తర్వాత జోరు పెంచి బషీర్ ఓవర్‌లో రెండు, బ్రూక్ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో గిల్ చెలరేగాడు. ఈ ఊపులో 37 బంతుల్లోనే మరో 50 రన్స్ జత చేసి తన స్కోరును 250కి చేర్చాడు. అటు క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విడదీసేందుకు రూట్ చేతికి బంతినివ్వడంతో ఫలితాన్నిచ్చింది. సుందర్‌ను బౌల్డ్ చేయడంతో ఏడో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక చివరి సెషన్ ఆరంభమయ్యాక మరో తొమ్మిది ఓవర్లలోనే భారత్ మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. గిల్ సూపర్ ఇన్నింగ్స్‌కు టంగ్ తెర దించగా ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య తను పెవిలియన్‌కు చేరాడు.
ఆదిలోనే వికెట్లు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు పిచ్ ఇంకా బ్యాటింగ్‌కు అనుకూలంగానే కనిపించింది. దీనికి తోడు బుమ్రా లేని భారత బౌలింగ్ దళం ఆతిథ్య జట్టు బ్యాటర్లను ఎలా అడ్డుకుంటుందోననే సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే పేసర్ ఆకాశ్ వరుస బంతుల్లో ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డకెట్, పోప్‌లను డకౌట్లుగా పెవిలియన్‌కు చేర్చాడు. కాసేపటికే క్రాలే (19)ను సిరాజ్ అవుట్ చేయడంతో 25/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో భారత బౌలర్ల జోరును బ్రూక్, రూట్ నిలువరించారు. రిస్కీ షాట్ల జోలికి పోకుండా జాగ్రత్తను కనబర్చి రెండో రోజును ముగించారు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (సి) పోప్ (బి) టంగ్ 269, పంత్ (సి) క్రాలే (బి) బషీర్ 25; నితీశ్ (బి) వోక్స్ 1; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 89; సుందర్ (బి) రూట్ 42; ఆకాశ్ (సి) డకెట్ (బి) బషీర్ 6; సిరాజ్ (స్టంప్డ్) స్మిత్ (బి) బషీర్ 8; ప్రసిద్ధ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 151 ఓవర్లలో 587 ఆలౌట్; వికెట్ల పతనం: 1-15, 2-95, 3-161, 4-208, 5-211, 6-414, 7-558, 8-574, 9-574, 10-587.బౌలింగ్: వోక్స్ 25-6-81-2; కార్స్ 24-3-83-1; టంగ్ 28-2-119-2; స్టోక్స్ 19-0-74-1; బషీర్ 45-2-167-3; రూట్ 5-0-20-1; బ్రూక్ 5-0-31-0.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (సి) కరుణ్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్ 0; రూట్ (బ్యాటింగ్) 18; బ్రూక్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 77/3. వికెట్ల పతనం: 1-13, 2-13, 3-25. బౌలింగ్: ఆకాశ్ 7-1-36-2; సిరాజ్ 7-2-21-1; ప్రసిద్ధ్ 3-0-11-0; నితీశ్ 1-0-1-0; జడేజా 2-1-4-0.
1
ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా గిల్. ‘సేన’ (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ఈ ఫీట్ సాధించిన తొలి ఆసియా కెప్టెన్ కూడా అతడే. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వ్యక్తి గత స్కోరు (269) కూడా గిల్‌దే.
1
భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ (254 నాటౌట్)ని దాటేసిన గిల్ (269). ఐదు వికెట్లు కోల్పోయాక ఎక్కువ పరుగులు (376) సాధించడం భారత్‌కిదే తొలిసారి.
2
భారత్ నుంచి డబుల్ సెంచరీ సాధించిన రెండో పిన్న వయసు (25 ఏళ్లు) కెప్టెన్‌గా గిల్. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (23 ఏళ్లు) ముందున్నాడు.
2
విదేశాల్లో టెస్టు డబుల్ సాధించిన రెండో భారత కెప్టెన్‌గా గిల్. 2016లో విండీ్‌సపై విరాట్ బాదాడు.
3
గవాస్కర్, ద్రవిడ్ తర్వాత ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్ గిల్. విదేశాల్లో 250+ స్కోరు సాధించిన మూడో భారత బ్యాటర్‌గా గిల్. సెహ్వాగ్ (309, 254), ద్రవిడ్ (270) ముందున్నారు.
6
టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆరో భారత కెప్టెన్‌గా గిల్. గతంలో పటౌడీ, గవాస్కర్, సచిన్, ధోనీ, కోహ్లీ ఈ ఘనత సాధించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 04 , 2025 | 03:50 AM