ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆఖరి బంతికి ముంబైపై విజయం

ABN, Publish Date - May 07 , 2025 | 04:33 AM

తాజా సీజన్‌లో హైలైట్‌ అనదగ్గ మ్యాచ్‌ అంటే ఇదేనేమో. గుజరాత్‌ టైటాన్స్‌ ముందు కేవలం 156 పరుగుల ఛేదనే అయినా ఎన్ని మలుపులో.. ముంబై ఇండియన్స్‌ బౌలర్ల విజృంభణతో మ్యాచ్‌ ఇరువైపులా మొగ్గుచూపింది...

నేటి మ్యాచ్‌

కోల్‌కతా X చెన్నై

వేదిక : కోల్‌కతా, రా.7.30 నుంచి

టాప్‌లోకి గిల్‌ సేన

ముంబై: తాజా సీజన్‌లో హైలైట్‌ అనదగ్గ మ్యాచ్‌ అంటే ఇదేనేమో. గుజరాత్‌ టైటాన్స్‌ ముందు కేవలం 156 పరుగుల ఛేదనే అయినా ఎన్ని మలుపులో.. ముంబై ఇండియన్స్‌ బౌలర్ల విజృంభణతో మ్యాచ్‌ ఇరువైపులా మొగ్గుచూపింది. దీనికితోడు రెండుసార్లు వరుణుడితో ఇబ్బంది. సవరించిన ఛేదన ప్రకారం ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సిన వేళ మరింత హైడ్రామా నెలకొంది. అయినా ఎలాగోలా ఆఖరి బంతికి సింగిల్‌తో టైటాన్స్‌ ఊపిరిపీల్చుకుంది. దీంతో మంగళవారం జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన గుజరాత్‌ నెగ్గింది. అలాగే 16 పాయింట్లతో టాప్‌లోకి చేరింది. అటు ముంబై వరుస ఆరు విజయాలకు బ్రేక్‌ పడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. విల్‌ జాక్స్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53), సూర్యకుమార్‌ (24 బంతుల్లో 5 ఫోర్లతో 35), బాష్‌ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. సాయికిశోర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనను వర్షం కారణంగా గుజరాత్‌ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147 పరుగులకు కుదించారు. అయితే, గుజరాత్‌ సరిగ్గా అన్నే ఓవర్లలో 147 రన్స్‌ చేసి గెలిచింది. గిల్‌ (43), బట్లర్‌ (30), రూథర్‌ఫోర్డ్‌ (28) పోరాడారు. బుమ్రా, బౌల్ట్‌, అశ్వనిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు.


వణికించిన బౌలర్లు: స్వల్ప ఛేదనలో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ సజావుగా ఏమీ సాగలేదు. పేసర్లు దీపక్‌, బౌల్ట్‌, బుమ్రా కట్టుదిట్టమైన బంతులకు పరుగులు రావడమే కష్టమైంది. గిల్‌, బట్లర్‌, రూథర్‌ఫోర్డ్‌ మినహా మరెవరూ దీటుగా నిలబడలేదు. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (5)ను రెండో ఓవర్‌లోనే బౌల్ట్‌ అవుట్‌ చేశాడు. బంతి బ్యాట్‌ మీదికి రాకపోవడంతో ఆ తర్వాత గిల్‌, బట్లర్‌ నిదానం కనబర్చారు. దీంతో పవర్‌ప్లేలో 29/1 స్కోరు మాత్రమే సాధించింది. అయితే హార్దిక్‌ తన ఓవర్‌లో మూడు వైడ్లు, రెండు నోబ్స్‌, 4,6తో 18 పరుగులు సమర్పించుకున్నాడు. 12వ ఓవర్‌లో గిల్‌ సులువైన క్యాచ్‌ను తిలక్‌ వదిలేయగా.. తర్వాతి బంతికే బట్లర్‌ను అశ్వని అవుట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆచితూచి సాగుతున్న ఇన్నింగ్స్‌కు రూథర్‌ఫోర్డ్‌ కదలిక తెచ్చాడు. 13వ ఓవర్‌లో అతడి 4,4,6తో 15 రన్స్‌ వచ్చాయి. 14వ ఓవర్‌ ముగిశాక వర్షం కారణంగా అర్ధగంట పాటు మ్యాచ్‌ ఆగింది. కానీ ఆ తర్వాత టైటాన్స్‌ ఒక్కసారిగా తడబడింది. వరుసగా నాలుగు ఓవర్లలో గిల్‌, రూథర్‌ఫోర్డ్‌, షారుక్‌ (6), రషీద్‌ (2)ల వికెట్లను కోల్పోయింది. ఇక 12 బంతుల్లో 24 రన్స్‌ కావాల్సిన వేళ మరోసారి వర్షంతో బ్రేక్‌ ఏర్పడింది. అర్ధరాత్రి 12.30కి మ్యాచ్‌ ఆరంభం కావడంతో లక్ష్యం 19 ఓవర్లలో 147కు మార్చారు. దీంతో గుజరాత్‌ ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా..తెవాటియా ఫోర్‌, కొట్జీ సిక్సర్‌ బాదాడు. అయితే, ఐదో బంతికి కొట్జీని చాహర్‌ అవుట్‌ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఆఖరి బంతికి కావాల్సిన సింగిల్‌ను అర్షద్‌ పూర్తిచేయడంతో గుజరాత్‌ గట్టెక్కింది.

బ్యాటింగ్‌ వైఫల్యంతో..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైని టైటాన్స్‌


బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. వీరి ధాటికి ఓపెనింగ్‌ జోడీతో పాటు మిడిలార్డర్‌ కూడా వైఫల్యం చెందగా.. విల్‌ జాక్స్‌, సూర్యకుమార్‌ మాత్రం ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చివర్లో బాష్‌ మెరుపు ఆటతో జట్టు గౌరవప్రదమైన స్కోరందుకుంది. వాస్తవానికి గుజరాత్‌ ఫీల్డింగ్‌లో కాస్త చురుకుగా ఉంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. పేసర్‌ సిరాజ్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ రికెల్టన్‌ (2)ను అవుట్‌ చేశాడు. అదే ఓవర్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ జాక్స్‌ క్యాచ్‌ను సుదర్శన్‌ వదిలేశాడు. అటు ఫామ్‌ ప్రదర్శిస్తున్న రోహిత్‌ (7)ను నాలుగో ఓవర్‌లో అర్షద్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో జాక్స్‌-సూర్య జోడీ నిలబడింది. సిరాజ్‌ ఓవర్‌లో జాక్స్‌ 6,4 బాదగా, సూర్య ఐదో ఓవర్‌లో 3 ఫోర్లతో 16 రన్స్‌ అందించాడు. అదే ఓవర్‌లో అతడి క్యాచ్‌ను సాయికిశోర్‌ వదిలేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే జాక్స్‌ మరో 3 ఫోర్లు బాదగా, అతడి క్యాచ్‌ను కూడా సిరాజ్‌ అందుకోలేకపోయాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 56/2తో నిలిచింది. 11వ ఓవర్‌లో జాక్స్‌ సిక్సర్‌తో 29 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే షారుక్‌ క్యాచ్‌తో సూర్య వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు 71 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడినుంచి టైటాన్స్‌ బౌలర్లు పరుగులను కట్టడి చేయడంతో పాటు వరుస ఓవర్లలో జాక్స్‌, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (1), తిలక్‌ వర్మ (7), నమన్‌ ధిర్‌ (7)ల వికెట్లను తీసి పైచేయి ప్రదర్శించారు. 123/7 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన ముంబై చివర్లో బాష్‌ జోరుతో కోలుకుంది. ఆఖరి ఓవర్‌లో బాష్‌ రెండు సిక్సర్లు, దీపక్‌ (8 నాటౌట్‌) ఫోర్‌తో 18 రన్స్‌ రావడంతో ముంబై స్కోరు 150 దాటింది.


స్కోరుబోర్డు

ముంబై: రికెల్టన్‌ (సి) సుదర్శన్‌ (బి) సిరాజ్‌ 2, రోహిత్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) అర్షద్‌ 7, విల్‌ జాక్స్‌ (సి) సుదర్శన్‌ (బి) రషీద్‌ 53, సూర్యకుమార్‌ (సి) షారుక్‌ (బి) సాయి కిషోర్‌ 35, తిలక్‌ (సి) గిల్‌ (బి) కొట్జీ 7, హార్దిక్‌ (సి) గిల్‌ (బి) సాయి కిషోర్‌ 1, నమన్‌ (సి) గిల్‌ (బి) ప్రసిద్ధ్‌ 7, కార్బిన్‌ బాష్‌ (రనౌట్‌) 27, దీపక్‌ చాహర్‌ (నాటౌట్‌) 8, కర్ణ్‌ శర్మ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 155/8; వికెట్ల పతనం: 1-2, 2-26, 3-97, 4-103, 5-106, 6-113, 7-123, 8-150; బౌలింగ్‌: సిరాజ్‌ 3-0-29-1, అర్షద్‌ 3-0-18-1, ప్రసిద్ధ్‌ 4-0-37-1, సాయి కిషోర్‌ 4-0-34-2, రషీద్‌ 4-0-21-1, కొట్జీ 2-0-10-1.

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) రికెల్టన్‌ (బి) బౌల్ట్‌ 5, గిల్‌ (బి) బుమ్రా 43, బట్లర్‌ (సి) రికెల్టన్‌ (బి) అశ్వని 30, రూథర్‌ఫర్డ్‌ (ఎల్బీ) బౌల్ట్‌ 28, షారుక్‌ (బి) బుమ్రా 6, తెవాటియా (నాటౌట్‌) 11, రషీద్‌ (ఎల్బీ) అశ్వని 2, కొట్జీ (సి) నమన్‌ (బి) చాహర్‌ 12, అర్షద్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19 ఓవర్లలో 147/7; వికెట్ల పతనం: 1-6, 2-78, 3-113, 4-115, 5-123, 6-126, 7-146; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-32-1, బౌల్ట్‌ 4-0-22-2, బుమ్రా 4-0-19-2, హార్దిక్‌ 1-0-18-0, కర్ణ్‌ శర్మ 2-0-13-0, అశ్వని కుమార్‌ 4-0-28-2, విల్‌ జాక్స్‌ 1-0-15-0.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 11 8 3 0 16 0.793

బెంగళూరు 11 8 3 0 16 0.482

పంజాబ్‌ 11 7 3 1 15 0.376

ముంబై 12 7 5 0 14 1.156

ఢిల్లీ 11 6 4 1 13 0.362

కోల్‌కతా 11 5 5 1 11 0.249

లఖ్‌నవూ 11 5 6 0 10 -0.469

హైదరాబాద్‌ 11 3 7 1 7 -1.192

రాజస్థాన్‌ 12 3 9 0 6 -0.718

చెన్నై 11 2 9 0 4 -1.117

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2025 | 04:33 AM