అప్పుడు 16 ఇప్పుడు 11
ABN, Publish Date - Jun 05 , 2025 | 05:12 AM
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీ గెలవడంతో నగరమంతా ఉత్సాహంలో మునిగిపోయిన వేళ.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడం...
భారత క్రీడా చరిత్రలో విషాద ఘట్టాలు
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీ గెలవడంతో నగరమంతా ఉత్సాహంలో మునిగిపోయిన వేళ.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడం.. 11 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ దుర్ఘటనలో 33 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మన దేశంలో క్రీడాలోకాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిన రెండో విషాదాంతం ఇది. అంతకుముందు 1980లో కోల్‌కతాలో ఈడెన్‌గార్డెన్స్ స్టేడియంలో రెండు ఫుట్‌బాల్ జట్ల అభిమానుల మధ్య చెలరేగిన ఘర్షణకు 16 మంది బలయ్యారు.
1980, ఆగస్టు 16.. ఆరోజు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌గార్డెన్స్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య కోల్‌కతా ఫుట్‌బాల్ డెర్బీ మ్యాచ్. అందరిలోనూ ఎంతో ఆసక్తి రేకెత్తించే ఈ పోరును వీక్షించేందుకు 70వేల మంది తరలివచ్చారు. మ్యాచ్ మొదలైంది.. కొన్ని నిమిషాల అనంతరం మ్యాచ్‌లో మోహన్ బగాన్ ఆటగాడు బిదేశ్ బసును ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాలర్ దిలీప్ పాలిత్ తోసేశాడు. అంతే.. ఒక్కసారిగా స్టేడియంలో గోల మొదలైంది. ప్రేక్షకుల్లో నుంచి కొందరు మైదానంలోకి రాళ్లు రువ్వారు. గొడవ పెద్దదైంది. ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు తోసుకుంటూ చేతికి దొరికినవాటితోనే పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పోలీసులు స్పందించేలోపే పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ ఘటనలో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతా, 18 నుంచి 60 ఏళ్ల లోపు వారే. ఈ విషాదకరమైన ఘటన జరిగి 45 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఆ ఘటనను గుర్తుచేసుకుంటే భయానకంగా ఉంటుందంటారు నాటి ఉదంతంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కొందరు సాకర్ అభిమానులు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ తరహా ఘటనను తలపిస్తూ బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ జట్టు విజయోత్సవ యాత్ర విషాదాంతమైంది. చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తిన అభిమానుల్లో 11 మంది అసువులు బాశారు. నాటి ఈడెన్‌గార్డెన్స్ ఉదంతం తర్వాత భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద విషాద ఘటనగా ఆర్‌సీబీ యాత్ర మిగిలిపోయింది. కాగా, ఇప్పటిదాకా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల సందర్భంగా ఇలాంటి సంఘటనలు జరగగా.. ఓ క్రికెట్ ఈవెంట్ సందర్భంగా దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.
ప్రపంచ క్రీడా చరిత్రలో మరికొన్ని విషాదాంతాలు..
అక్టోబరు 2022, ఇండోనేసియా
ఇటీవలికాలంలో అతిపెద్ద క్రీడా విషాద ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. తూర్పు జావా ప్రావిన్స్‌లోని కంజురుహన్ స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా 174 మంది చనిపోయారు. పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో స్టేడియంలోనే ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. దీంతో జరిగిన తొక్కిసలాటలో భారీఎత్తున అభిమానులు దుర్మరణం పాలయ్యారు. ఏకంగా 320మందికిపైగా గాయపడ్డారు.
మే 2001, ఘనా
ఆఫ్రికా సాకర్ చరిత్రలో అత్యంత విషాదకర ఘటన ఇది. అక్రా ప్రధాన స్టేడియం వద్ద అభిమానులు ఘర్షణకు దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 126 మంది దుర్మరణం పాలయ్యారు.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 05 , 2025 | 05:42 AM