Cricket Spin Bowling: పేస్ పిచ్‌లపై స్పిన్ మాయ
ABN, Publish Date - Jul 17 , 2025 | 04:32 AM
ఇంగ్లండ్ పిచ్‌లు పేసర్లకు స్వర్గధామం. అలాంటి వికెట్‌పై ఓ స్పిన్నర్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టిందంటే అది ఆమెలోని అసాధారణ ప్రతిభకు నిదర్శనమే. ఆ అద్భుత నైపుణ్యంతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది...
ఇంగ్లండ్‌లో తెలుగమ్మాయి శ్రీచరణి జోరు
ఇంగ్లండ్ పిచ్‌లు పేసర్లకు స్వర్గధామం. అలాంటి వికెట్‌పై ఓ స్పిన్నర్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టిందంటే అది ఆమెలోని అసాధారణ ప్రతిభకు నిదర్శనమే. ఆ అద్భుత నైపుణ్యంతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ లెఫ్టామ్ స్పిన్నర్ శ్రీచరణి. క్లిష్టమైన ఇంగ్లండ్ పర్యటనకు జట్టులో చోటు కల్పిస్తూ సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకానికి ఆమె పూర్తిగా న్యాయం చేసింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీచరణి స్పిన్ మాయాజాలానికి ఇంగ్లండ్ కుదేలైంది. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్, ఎకెల్‌స్టోన్ వంటి సత్తా కలిగిన బ్యాటర్లు సైతం శ్రీచరణి స్పిన్ బంతులను ఎదుర్కోలేకపోయారు.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి క్రికెట్ అరంగేట్రం ఎంతో ఆసక్తికరం. క్రికెట్‌కు ముందు ఆమె ఎన్నో ఆటలాడింది. ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో రాణించింది. కానీ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు మాత్రం ఆమె మామయ్య కిశోర్‌కుమార్‌రెడ్డే కారణం. అయితే ఈ ఆటలో ప్రొఫెషనల్ అవుతానని మాత్రం శ్రీచరణి అస్సలు అనుకోలేదు. మొదట పేస్ బౌలింగ్‌లో ప్రయత్నించింది. కానీ వికెట్లు సాధించలేకపోయింది. దాంతో స్పిన్ బౌలింగ్‌ను ఎంచుకుంది. వాస్తవంగా..శ్రీచరణిని బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా చూడాలనేది తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి కోరిక. క్రికెట్‌కు మారతానంటే ఆయన ఓ పట్టాన అంగీకరించలేదు. శ్రీచరణి మాత్రం తాను క్రికెట్ మాత్రమే ఆడతానని భీష్మించింది. కుమార్తె పట్టుదలను చూసిన ఆయన సంవత్సరం తర్వాత తన అంగీకారాన్ని తెలిపారు. క్రికెట్ ఆటంటే మాటలా! బాగా ఖర్చుతో కూడుకున్నది. శ్రీచరణి తండ్రి అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు.. కుమార్తెను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు ఆయన మరిన్ని ఆర్థిక ఇబ్బందులకూ వెరవలేదు. అలా తండ్రితోపాటు తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో కొద్దికాలంలోనే ఆమె రాష్ట్రస్థాయిలో సత్తా చాటడంతో జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడింది.
ఐపీఎల్‌లో..: గత ఏడాది డిసెంబరులో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ముంబై ఇండియన్స్‌తో పోటీపడిన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీచరణిని రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. వేలానికి ముందు శ్రీచరణితో పాటు ఆమె తల్లిదండ్రులు బాగా టెన్షన్‌కు లోనయ్యారు. మొదటిసారి వేలంలో నిలిచిన తనను అసలు ఏ జట్టయినా కొనుగోలు చేస్తుందా..అనే అనుమానం ఆమెను బాగా పీడించింది. కానీ ఏకంగా అరకోటిపైగా మొత్తంతో ఢిల్లీ క్యాపిటల్ దక్కించుకోవడంతో శ్రీచరణి కుటుంబం అవధుల్లేని ఆనందానికి లోనైంది. ఆర్‌సీబీ ప్లేయర్ రాఘవి బిస్త్‌ను అవుట్ చేసి సాధించిన తొలి ఐపీఎల్ వికెట్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని శ్రీచరణి అంటుంది. అది తాను వేసిన అత్యుత్తమ బంతిగా తెలిపింది.
అరంగేట్రంలోనే అదరగొట్టి..
గత ఏప్రిల్‌లో శ్రీచరణి మొదటిసారి జాతీయ జట్టుకు ఎంపికైంది. శ్రీలంకలో..దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లతో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీకి టీమిండియాలో ఆమెకు చోటు లభించింది. శ్రీలంకతో టోర్నీ ఆరంభ మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసింది. సీనియర్ స్పిన్నర్ స్నేహ్ రాణా ద్వారా ‘క్యాప్’ అందుకోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా శ్రీచరణి పేర్కొంది. మొదటి మ్యాచ్‌లో రెండు వికెట్లతో ఆమె సత్తా చాటింది. మొత్తంగా ఆ టోర్నీలో ఆరు వికెట్లు పడగొట్టిన శ్రీచరణి భారత జట్టు టైటిల్ గెలవడంలో కీలక భూమిక పోషించింది. శ్రీచరణి బౌలింగ్‌కు ఫిదా అయిన సెలెక్టర్లు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీ్‌సకూ ఆమెను ఎంపిక చేశారు. వారి నమ్మకాన్ని మరోసారి నిలబెడుతూ నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో ఆమె పది వికెట్లు తీసి భళా అనిపించింది. ఇదే ఉత్సాహంతో వన్డే సిరీ్‌సలోనూ శ్రీచరణి రాణించి..భారత జట్టులో విడదీయరాని భాగమవ్వాలని ఆశిద్దాం.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 17 , 2025 | 04:32 AM