Urinating on Road: మద్యంమత్తులో రోడ్డుపైనే రచ్చరచ్చ.. పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉందంటే..
ABN, Publish Date - Mar 09 , 2025 | 03:32 PM
పూణే రోడ్లపై ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. బీఎమ్‍డబ్ల్యూ కారులో రోడ్డుపైకి వచ్చిన స్నేహితులు హల్‍చల్ చేశారు. మద్యం తాగుతూ అతివేగంగా కారు నడుపుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు.
పూణే: రోడ్లపై విచ్చలవిడిగా రెచ్చిపోయే యువత సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు కొనిచ్చిన బైక్‍లు, కార్లతో రాత్రి వేళ స్టంట్స్ చేసే యువతకు దేశంలో కొదవే లేదు. లగ్జరీ కార్లు, బైక్‍లు వేసుకుని రోడ్లపై రయ్ రయ్ మంటూ వెళ్తే ఆ కిక్కే వేరని భావిస్తుంటారు. మరికొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటారు. అయితే అలాంటి వారికి పోలీసులు అప్పుడప్పుడు షాక్ ఇస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్ర పూణేలో చోటు చేసుకుంది. పబ్లిక్ ప్లేస్‍లో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులకు పూణే పోలీసులు తగిన బుద్ధి చెప్పారు.
వీడియో వైరల్..
పూణే రోడ్లపై ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. బీఎమ్‍డబ్ల్యూ కారులో రోడ్డుపైకి వచ్చిన స్నేహితులు హల్‍చల్ చేశారు. మద్యం తాగుతూ అతివేగంగా కారు నడుపుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు. అంతేకాకుండా అందరూ చూస్తుండగానే రోడ్డు మధ్యలో కారు ఆపి వెకిలి చేష్టలు చేశారు. ప్రజల తిరుగుతున్నారన్న ఇంగితం లేకుండా ఓ యువకుడు డివైడర్‍పైనే టాయిలెట్ పోశాడు. అతని పక్క నుంచి వెళ్లాల్సి వచ్చిన పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తలదించుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఆ సమయంలో మరో యువకుడు మద్యం తాగుతూ కారులోనే ఉన్నాడు. ఓ ద్విచక్రవాహనదారుడు వీరి చేష్టలు మెుత్తాన్ని తన సెల్ ఫోన్‍లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో పూణే పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింది కేసులు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
యువకులు అరెస్టు..
విచారణలో నిందితులిద్దరూ గౌరవ్ అహుజా, భాగ్యేష్ ఓస్వాల్‍గా పోలీసులు గుర్తించారు. తమ కోసం ఖాకీలు గాలిస్తున్నారని తెలుసుకున్న యువకులు ఇద్దరూ పరారయ్యారు. అయితే గౌరవ్ అహుజా మాత్రం తాము చేసింది తప్పే అంటూ వీడియో రిలీజ్ చేశాడు. "నేను గౌరవ్ అహుజాని, బహిరంగంగా నేను చేసింది చాలా తప్పు. పూణే ప్రజలు, పోలీసు శాఖనూ క్షమాపణలు కోరుతున్నా. నన్ను క్షమించండి. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా కుటుంబ సభ్యులను ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. ఇంకొన్ని గంటల్లో యెర్వాడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతా" అంటూ వీడియో రిలీజ్ చేశాడు.
కాగా, మద్యం తాగుతూ వీడియోలో కనిపించిన భాగ్యేష్ ఓస్వాల్‍ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు తాను చెప్పినట్లుగానే కరాడ్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో అహుజా లొంగిపోయాడు. వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు.. డ్రైవింగ్ సమయంలో యువకులు మద్యం తాగి ఉన్నారో లేదో నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం కోర్టుకు తరలించనున్నారు. వారిని అరెస్టు చేశారని తెలుసుకున్న నెటిజన్లు తగిన బుద్ధి చెప్పారంటూ కామెంట్లు పెడుతున్నారు. తాగిన మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తించే వారికి ఇదో గుణపాఠం కావాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కూటి కోసం.. కూలి కోసం.. డంకీ రూట్
Updated Date - Mar 09 , 2025 | 03:34 PM