కూటి కోసం.. కూలి కోసం.. డంకీ రూట్
ABN , Publish Date - Mar 09 , 2025 | 09:47 AM
‘‘అమ్మా.. నేనిప్పుడు అమెరికా బార్డర్ వరకు వచ్చేశాను. ఇక, రెండే రెండు అడుగులు. కష్టపడి కంచె అవతలికి దూకితేచాలు.. అమెరికాలో పడ్డట్టే! అదృష్టం బాగుంటే బతికిపోతా. లేదంటే గస్తీ పోలీసులకు దొరికిపోతా. అంతా మంచే జరుగుతుందమ్మా! నువ్వేం భయపడకు. ఎక్కువసేపు మాట్లాడే పరిస్థితి లేదు. యూఎస్ చేరాక కాల్ చేస్తాను.
కొందరు అదృష్టజాతకులకు జీవితం జాతీయ రహదారిలాంటిది.. ఎలాంటి ఆటంకం లేకుండా క్షేమంగా గమ్యం చేరతారు. కానీ, అభాగ్యుల జీవితం అలా కాదు. అడవుల్లో, మడుగుల్లో.. ముళ్లకంపల్లో నడిస్తే కానీ మనుగడ సాధ్యం కాదు. అమెరికాలో డాలర్‌డ్రీమ్స్‌ను పండించుకోవాలని కలలుకనే అలాంటి అభాగ్యులకు దారిచూపేదే.. డంకీ రూట్..
‘‘అమ్మా.. నేనిప్పుడు అమెరికా బార్డర్ వరకు వచ్చేశాను. ఇక, రెండే రెండు అడుగులు. కష్టపడి కంచె అవతలికి దూకితేచాలు.. అమెరికాలో పడ్డట్టే! అదృష్టం బాగుంటే బతికిపోతా. లేదంటే గస్తీ పోలీసులకు దొరికిపోతా. అంతా మంచే జరుగుతుందమ్మా! నువ్వేం భయపడకు. ఎక్కువసేపు మాట్లాడే పరిస్థితి లేదు. యూఎస్ చేరాక కాల్ చేస్తాను. అన్నయ్య, వదిన, పిల్లల్ని అడిగానని చెప్పమ్మా.. ఉంటానమ్మా.. ’’
...పది నెలల కిందట హర్యానాను వదిలి వెళ్లిన ఆకాష్ (20) చివరి మాటలవి. వారాలు గడిచాయి. మళ్లీ ఫోన్ రాలేదు. అమెరికాకు వెళ్లిన ఆనందంలో కాల్ చేస్తాడని కళ్లు కాయలుకాసేలా ఎదురుచూసిందా తల్లి. ఇద్దరి మధ్య భరించలేని నిశ్శబ్దం. గుండెల్లో గుబులు మొదలైంది. హఠాత్తుగా అప్పుడొచ్చిందొక కాల్. కొడుకే ఫోన్ చేశాడనుకున్న ఆ పిచ్చితల్లి బొంగురు గొంతుతో ‘‘నాయనా.. ఎక్కడున్నావు? నువ్వు ఫోన్ చేయకపోతే చాలా భయపడ్డాను’’ అంది. ‘‘సారీ అమ్మా.. మీ అబ్బాయి ఆకాష్ మెక్సికో-అమెరికా సరిహద్దు గోడ దూకడంతో పోలీసులు పట్టుకున్నారు. అమెరికాలో వీసా లేకుంటే జైలులో వేస్తారు. అందుకే అతన్ని ఇండియాకు తీసుకొస్తున్నారు..’’ అంటూ ఫోన్ పెట్టేశారు విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులు.

‘హలో.. హలో సార్.. మా అబ్బాయిని వదిలిపెట్టండి.. మీకు దండం పెడతా’’ అంటూ వేడుకున్నా ఫోన్ పెట్టేసిన అధికారులకు వినిపించలేదు. రెండుచేతుల్లో ముఖాన్ని దాచుకుని కుమిలికుమిలి ఏడ్చింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు ఓదార్చినా ఆ తల్లి మనసు అరెస్టయిన కొడుకు చుట్టూనే తిరుగుతోంది. ఏం తిన్నాడో, ఎప్పుడు పడుకున్నాడో, పోలీసులు ఎంత ఇబ్బంది పెడుతున్నారో.. ఇలా ఒకటే ఆలోచనలు. ‘‘వద్దు బిడ్డా నువ్వెళ్లకు. దేశం కాని దేశంలో తిప్పలు పడతావు. మనకు మీ నాయన సంపాదించిన రెండెకరాల పొలం ఉంది. సేద్యాన్నే నమ్ముకుందాం. కష్టపడి పనిచేసినోళ్లకు భూమాత అన్యాయం చేయదు. నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు.. నా మాట విను’’ అంటూ కొడుక్కు చెప్పిన మాటలు ఆ తల్లికి పదే పదే గుర్తుకొస్తున్నాయి! సొంతూరు హర్యానాకు పదమూడువేల కి.మీ. (యూఎస్) దూరంలోని అక్రమ వలసదారుల శిబిరంలో బందీగా ఉన్న ఆకాష్‌కు తల్లి బాధ అర్థమైంది. పశ్చాత్తాపంతో మనసు మూగబోయింది. ఆయన వెళ్లింది సక్రమ మార్గం కాదు.. అక్రమ వలస మార్గం. దానిపేరే ‘డంకీ రూట్’, లేదా ‘డాంకీ రూట్’ అంటారు.
మనోళ్లూ ఎక్కువే..
ఆకాష్ ఒక్కడే కాదు. మన్‌దీప్‌సింగ్, గురుప్రీత్.. ఇలా పలువురు యువకులు అమెరికాకు అక్రమ మార్గంలో వలసెళ్లి.. అక్కడి పోలీసులకు దొరికిపోయారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలను అడ్డుకుంటామని.. పట్టుబడ్డ వాళ్లందర్నీ సొంత దేశాలకు పంపిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే!. అందులో భాగంగా అమెరికా సైనిక విమానాలు ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ను సొంత దేశాలకు చేరవేసే పనిలో బిజీగా ఉన్నాయిప్పుడు. ఇటీవల పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ఓ అమెరికా విమానం వచ్చిందలా. అందులో ఒకరు ఆకాష్. హర్యానా నుంచి పది నెలల కిందట బయలుదేరి.. పన్నెండు దేశాలను దాటుకుని.. చిట్టచివరికి అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో దొరికిపోయాడు. ఇండియాకు వెనక్కి రాకతప్పలేదు. యుఎస్‌ఎ ప్రభుత్వం అక్రమ వలసదారుల్ని ఇలా తిరిగి సొంత దేశాలకు పంపిస్తున్న తరుణంలో.. ‘డంకీ రూట్’ (ఇల్లీగల్ మైగ్రేషన్) మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాకు అడ్డదారి ఇప్పటిది కాదు. డంకీ రూట్‌లో కొన్నేళ్ల నుంచీ లక్షల మంది అమెరికాకు వలస వెళ్లారు. నేటికీ రకరకాల ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారక్కడ. దొరికితే అక్రమవలసదారుడు, దొరక్కపోతే అదృష్టవంతుడు. ఈ రెండింటికీ మధ్య బిక్కు బిక్కుమంటూ బతికిస్తున్నది డాలరే!. అమెరికాలో ఆవిధంగా స్థిరపడిన అత్యధిక అక్రమ వలసదారులు మెక్సికన్లు.

భారత్-పాక్ సరిహద్దుల్లాగే అమెరికా-మెక్సికో ఇరుగుపొరుగు దేశాలు. రెండింటి మధ్య 3,145 కి.మీ. అతి పెద్ద సరిహద్దురేఖ ఉంది. బార్డర్ పొడవునా ఇనుపగ్రిల్స్‌తో కంచె వేసినప్పటికీ కాపలాకాయడం అసాధ్యం. మెక్సికోలోని టిజువానా పట్టణానికి అమెరికాలోని శాండియాగోకు మధ్య దూరం కేవలం 30 కి.మీ. అందుకే అత్యధిక మెక్సికన్లు అమెరికాకు అడ్డదారిలో వలసకడుతుంటారు. ఇలా 60 లక్షల మంది మెక్సికన్లు ఆ దేశంలో లెక్కాపత్రం లేకుండా స్థిరపడ్డారు. మెక్సికన్ల తర్వాత ఎల్ సాల్వడార్ (ఎనిమిది లక్షలు), గ్వాటెమాల (ఏడున్నర లక్షలు), ఇండియా (ఏడున్నర లక్షలు) వాసులు అక్రమ వలసల్లో పోటీపడుతున్నారు. గత పదేళ్లలో యుఎస్‌కు వెళ్లే మెక్సికన్ల సంఖ్య తగ్గిపోగా.. భారతీయుల సంఖ్య మాత్రం అమాంతం పెరిగింది. కరోనా మహమ్మారి అనంతరం భారతీయుల ఆర్థికపరిస్థితులు చిన్నాభిన్నమయ్యాయి. యువత కొత్త ఉపాధి మార్గాలను అన్వేషించక తప్పలేదు. కుటుంబాలపైనా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి పడింది.
చదువుతోపాటు ఉపాధి లభిస్తుందన్న ఆశతో అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు లక్షలాది భారతీయ విద్యార్థులు వలసెళ్లారు. వీసాలకు అర్హత లేని, వర్క్‌పర్మిట్లు లభించని కొందరు దురాశతో డంకీ రూట్‌ను ఎంచుకున్నారు. 2018-19లలో ఇలా అక్రమంగా అమెరికాకు 8 వేల మంది భారతీయులు వెళ్లగా.. 2022-23లో ఆ సంఖ్య 96 వేలకు పెరిగింది. వీరిలో ఎక్కువమంది పంజాబ్, హర్యానా, గుజరాత్ వాసులే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం అక్రమవలస మార్గాన్ని ఎంచుకోవడం లేదు.. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఎక్కువ మంది బి-1, బి-2 (బిజినెస్, టూరిజం వీసాలు)లపై అమెరికాకు వెళుతున్నారు. అక్కడ కేవలం ఆర్నెళ్లే ఉండొచ్చు. గడువు తీరే లోపు ఇండియాకు తిరిగి వచ్చేయాలి. కానీ కొందరు రావడం లేదు. వంట, ఇంటి పని మనుషులుగా, స్థానిక స్టోర్లలో సహాయకులుగా పనిచేస్తూ అక్రమంగా ఉండిపోతున్నారు. చాలామంది రెండు మూడేళ్లయినా రావడం లేదు. వీరంతా అక్రమ వలసదారుల జాబితాలోకే చేరిపోతున్నారని ప్రవాసభారతీయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ సమస్య ఉన్నప్పటికీ ప్రమాదకరమైన డంకీ రూట్‌ను మాత్రం తెలుగువాళ్లు ఎంచుకోవడం లేదు.
ఎలా వెళుతున్నారు?
అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనలు అత్యంత కఠినం. అయినాసరే అక్రమ వలసలను మాత్రం ఆ దేశం అడ్డుకోలేకపోతోంది. అందుకోసం కొన్ని బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నా నూరు శాతం ఫలితాలు రావడం లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే భౌగోళికంగా అమెరికా మూడో (రష్యా, కెనడా) అతి పెద్ద దేశం. సుమారు 98 లక్షల చదరపు కి.మీ. వైశాల్యం ఉంది. 50 రాష్ట్రాలు ఉన్నాయి.. కాబట్టి ఏ మూల నుంచి ఎవరు ఎప్పుడు ఎలా చొరబడుతున్నారో నిఘాపెట్టడం సవాలుగా మారింది. అక్కడికీ చీమ చిటుక్కుమన్నా అమెరికా గస్తీ దళాలు పట్టేస్తాయి. అయినా సరే అక్రమ వలసదారులు కాపలాదారుల కళ్లుగప్పి చొరబడుతూనే ఉన్నారు. వెతికేకొద్దీ కొత్త మార్గాలకూ కొదవ లేదు. ఇలా అమెరికాకు వెళ్లేందుకు పలు డంకీరూట్స్‌ను కనిపెట్టారు అక్రమ వలసదారులు, ఏజెంట్లు.

వాటిలో ప్రాచుర్యం పొందినది లాటిన్ అమెరికా దేశాల నుంచి వెళ్లే డంకీ రూట్. ఈ దేశాలు కూడా వలసదారుల పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో రద్దీ పెరిగింది. డంకీ రూట్‌లో అత్యంత క్లిష్టమైనది, ప్రమాదకరమైనది డేరియన్‌గ్యాప్. దక్షిణ (లాటిన్) అమెరికా, మధ్య (సెంట్రల్) అమెరికా, ఉత్తర (యూఎస్) అమెరికాలను కలుపుతూ సాగే ‘పాన్ అమెరికన్ హైవే’ను విడగొడుతుందీ ప్రాంతం. కొలంబియా, పనామాల మధ్య విస్తరించి ఉంటుంది. ఇక్కడ దట్టమైన అడవి ఉండటంతో రోడ్ల కొనసాగింపు తెగిపోయింది. అమెరికా ఖండానికి పైనున్న ప్రుడోబే (అలస్కా) నుంచి ద.అమెరికా ఖండంలో చిట్టచివర్న ఉండే అర్జెంటీనాలోని ఉషుయా వరకు హైవే రోడ్ల వ్యవస్థ ఏర్పాటైంది. ప్రపంచంలోనే అతి పొడవైన (30 వేల కి.మీ.) పాన్ అమెరికన్ హైవే.. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వెడార్, హోండరస్, కొలంబియా, బొలీవియా, అర్జెంటీనాలతోపాటు 14 దేశాల మీదుగా సాగుతుంది.
అయితే ఈ హైవేమార్గంలోని డేరియన్ గ్యాప్ అడ్డుతగిలింది. ఉ.అమెరికా, ద..అమెరికా రెండు ఖండాల మధ్య రోడ్డు మార్గం లేకుండా చేసింది. అందుకే దీనికి ‘గ్యాప్’ అన్న పేరొచ్చింది. అక్రమవలసదారులు చొరబడేందుకు ఈ దట్టమైన అటవీమార్గం.. వరంగా మారింది. ఇందులో రహదారులను నిర్మిస్తే రెండు ఖండాల మధ్య రాకపోకలు సులువు అవుతాయని అనేక దేశాలు విఫలయత్నం చేశాయి. లాటిన్‌లోని పర్యావరణవేత్తలు, స్థానిక గిరిజనులు, సామాజికవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు డేరియన్‌గ్యాప్‌లో రోడ్లు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నయానాభయాన బెదిరించినా ఒప్పుకోలేదు. రోడ్ల నిర్మాణ ప్రతిపాదన వచ్చినప్పుడల్లా ఉద్యమాలు ఎగిసిపడ్డాయి. ప్రజల మద్దతు లభించింది. ఎందుకంటే - ప్రపంచానికి అమెజాన్ అడవులు 20 శాతం ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లే.. లాటిన్, సెంట్రల్ అమెరికాలకు జీవం పోస్తోంది డేరియన్‌గ్యాప్.

ఈ ఉష్ణమండల వర్షారణ్య విస్తీర్ణం 5.75 లక్షల హెక్టార్లు. 169 రకాల క్షీరదజాతులు, 100 రకాల సరీసృపాలు, 78 రకాల ఉభయచర జీవులు, 533 రకాల పక్షిజాతులు, అకశేరుక జాతులు... సముద్ర తీరం వెంబడి 50 రకాల చేపలు, డాల్ఫిన్లు, తిమింగలాలు, షార్క్ చేపలు, అరుదైన తాబేళ్లు జీవిస్తున్నాయి. ఇంతటి జీవవైవిధ్యమున్న అరణ్యంలో రోడ్లు వేస్తే లక్షలాది జీవుల ఉనికికే ముప్పు ఏర్పడుతుందన్నది పర్యావరణవేత్తల వాదన. ఇప్పటికే కొలంబియాతో పాటు మరికొన్ని లాటిన్ దేశాల నుంచి అమెరికా, ఐరోపాలకు మాదకద్రవ్యాల ఎగుమతి విచ్చలవిడిగా సాగుతోంది. ఇక, డేరియన్‌గ్యాప్‌లో రోడ్లు వేస్తే మత్తుపదార్థాల రవాణాకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతుంది. కరోనాలాంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు రెండు ఖండాలకు వేగంగా విస్తరించే ప్రమాదమూ ఉంది. అందుకే 1971లో అడవుల్ని నరికి రోడ్లు వేయడానికి పూనుకున్నప్పుడు స్థానికులు అడ్డుకున్నారు. దాంతో మూడేళ్లకే రోడ్ల నిర్మాణ ప్రక్రియ శాశ్వతంగా నిలిచిపోయింది.
అడుగడుగునా మృత్యువే!
డంకీ రూట్‌కు కఠిన పరీక్షలా నిలిచే డేరియన్‌గ్యాప్ అరణ్యం పర్యావరణ అద్భుతం. కొలంబియా, పనామా దేశాల మధ్య వంద కి.మీ.కు పైగా విస్తరించింది. ఒకవైపు కరీబియన్, అట్లాంటిక్ మహాసముద్రాలు... మరోవైపు పసిఫిక్ మహాసముద్రాలు ఉండటంతో... నిత్యం కుండపోత వర్షాలే! భూమధ్య రేఖకు 800 కి.మీ. దూరం ఉన్నందున ఉష్ణమండల ప్రభావంతో అధిక వర్షాలకు ఆస్కారం ఏర్పడింది. డేరియన్‌గ్యాప్‌లో కొండలు, గుట్టలు, నదులు, మడుగులు, పొదలు, ఎగుడుదిగుడు భూతలం భీతిగొలిపేలా ఉంటుంది. అడుగుతీసి అడుగుపెట్టడానికి ఆపసోపాలు పడాలి. కొన్నిచోట్ల మోకాళ్లలోతు బురద. విషపూరితమైన తేళ్లు, పాములు, సాలెపురుగులు, అడవి దోమలు, కీటకాలను తప్పించుకుంటూ వెళ్లాలి. ‘‘డేరియన్ గ్యాప్ అగమ్యగోచరం. ఒక్కసారి నడక ప్రారంభిస్తే.. మళ్లీ వెనక్కి వెళ్లలేం. చావైనా, బతుకైనా ముందుకు వెళ్లాల్సిందే!. ఆరునూరైనా సరే అమెరికా చేరుకోవాలన్న తీవ్రమైన తపన మమ్మల్ని నడిపించింది. ప్రాణాపాయం తలెత్తితే ఎవరూ ఎవర్నీ కాపాడలేరిక్కడ. శవాన్ని కూడా నిర్ధాక్షిణ్యంగా వదిలేసి రావాల్సిందే! దారిలో అక్కడక్కడ శవాలు కూడా పడుంటాయి..’’ అని చెప్పుకొచ్చాడు ఓ అక్రమ వలసదారుడు. డేరియన్‌గ్యాప్ దారిలో మహిళలపై అత్యాచారాలు, బలహీనులపై బలవంతుల దారిదోపిడీలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణాలను ఫణంగా పెట్టి డేరియన్‌గ్యాప్ అడవుల్ని దాటిన తర్వాత.. పనామా దేశానికి చేరుకుంటారు వలసదారులు. వ్యవహారమంతా ఏజెంట్ల కనుసన్నల్లోనే నడుస్తుంటుంది. పనామా నుంచి వివిధ రవాణా మార్గాల ద్వారా నికరగువా, హోండరస్, గ్వాటెమాల, మెక్సికోలకు చేరుకుంటారు. అక్కడ అక్రమ పద్ధతుల్లో అమెరికా సరిహద్దులను దాటించడంతో పని పూర్తవుతుంది.ఇప్పటి వరకు డేరియన్‌గ్యాప్‌ను దాటుకుని కొన్ని లక్షల మంది అమెరికాకు వలస వెళ్లారు.
భారతీయులు సైతం..
హర్యానా వాసి నిషాంత్ కూడా డేరియన్‌గ్యాప్ నుంచే వెళ్లాడు. ప్రమాదకరమైన ఆ ప్రయాణాన్ని ఫోన్‌లో చిత్రీకరించి.. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. అంత సాహసం చేసి.. దేశాలు, అడవులు, సముద్రాలను దాటుకుని అమెరికా అయితే వెళ్లాడు కానీ.. అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. అమెరికా విమానంలో తిరిగి ఇండియాకు రాకతప్పలేదు. మన్‌దీప్‌సింగ్ పరిస్ధితీ అదే! పంజాబ్‌లోని ఓ ట్రావెల్ ఏజెంట్ ద్వారా డంకీ రూట్‌లో యూఎస్ వెళ్లేందుకు పూనుకున్నాడు. ఏజెంట్‌కు రెండు విడతల్లో రూ.40 లక్షలు చెల్లించాడు. అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబయికి.. ఆ తర్వాత నైరోబీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో దేశం.. అట్నుంచి ఆమ్‌స్టర్‌డాం.. వివిధ దేశాల నుంచి అక్కడికి చేరుకున్న బృందంతో మన్‌దీప్‌ను జతచేశారు. అందర్నీ వాహనంలో కుక్కిపడేసి గయానాకు తీసుకెళ్లారు. రోజుల తరబడి సాగింది ప్రయాణం. బొలీవియా దాటి ఈక్వెడార్‌లోకి ప్రవేశించారు. ఆ పైనున్న కొలంబియాకు తీసుకెళ్లారు. ఆఖరికి పనామాలోని డేరియన్ గ్యాప్ రానే వచ్చింది.

‘‘ఇక్కడ తిక్కతిక్క ప్రశ్నలు వేస్తే కాల్చి పడేసి నదుల్లో పడేస్తారు. నోర్మూసుకుని చెప్పింది చేయడమే! ఎవరు చచ్చినా వెనక్కి చూడకుండా ముందుకు వెళ్లాల్సిందే..’’ అని తమ బృందాన్ని నడిపించే వ్యక్తి హెచ్చరించినట్లు మన్‌దీప్ పేర్కొన్నాడు. ఆ కారడవిలో 13 రోజులపాటు 12 నదుల్ని దాటారు. సగం కాలిన రొట్టెలు, నూడుల్సు తప్ప మరో తిండేదీ లేదు. అతి కష్టం మీద డారియన్‌గ్యాప్ దాటొచ్చాక.. పనామా చేరుకుందీ బృందం. కొన్నిరోజులు ఊపిరి పీల్చుకున్నాక కోస్టారికా నుంచి హోండరస్‌కు చేరుకున్నారు. నికారగువా, గ్వాటెమాలను వీడిన తర్వాత మెక్సికోలోని టిజువానా పట్టణానికి వెళ్లారు. ‘‘నేను సిక్కును అయ్యుండి కూడా తలపాగ, గడ్డం బలవంతంగా తీయకతప్పలేదు..’’ అన్నాడు మన్‌దీప్. జనవరి 27న తెల్లవారుజామున టిజువానకు అటువైపున ఉన్న అమెరికా ఇనుపగోడను దూకించారు ఏజెంట్లు. ‘‘హమ్మయ్యా.. యూఎస్‌లో పడ్డామని ఆనందించేలోపు వచ్చేశారు పోలీసులు. మమ్మల్ని అరెస్టు చేశారు. కొన్ని రోజులు శిబిరంలోనే ఉన్నాము. గత నెల ఐదున మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అమెరికా నుంచి అమృత్‌సర్ తీసుకొచ్చారు..’’ అని తన డంకీరూట్ విషాదగాథను చెప్పుకొచ్చారాయన.
డంకీరూట్‌తో జీవితాన్ని నాశనం చేసుకున్న మరో బాధితుడు హర్వీందర్‌సింగ్. హోషియార్‌పూర్ (పంజాబ్)లో ఉన్న తహ్లీ గ్రామానికి చెందిన ఆయన గత ఏడాది ఆగస్టులో డంకీ రూట్‌లో అమెరికా వెళ్లాడు. అందుకోసం ఏజెంట్లకు రూ.42 లక్షలు చెల్లించాడు. ‘‘నిన్ను సురక్షితంగా యూరప్‌కు తీసుకెళతాం. అక్కడి నుంచి అమెరికాకు భద్రంగా చేర్చే బాధ్యత మాది’’ అని నమ్మబలికారు. ముందుగా భారత్ నుంచి ఖతార్‌కు ప్రయాణం మొదలైంది. అరబ్బుదేశం నుంచి నేరుగా బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరగువా, మెక్సికోల వరకు సాగిందా జర్నీ.. అడుగడుగునా ప్రాణభయమే! ‘‘డేరియన్‌గ్యాప్ అడవుల్లో నరకం చూశాను. నాతోపాటు వచ్చిన ఒక వ్యక్తి చనిపోయాడు. అప్పటి నుంచీ నాలో భయం మొదలైంది. సముద్రంలో ఓ పడవలో ఎక్కించారు. దాని సామర్థ్యానికి మించి మనుషులు ఎక్కారు. మునిగిపోవడం ఖాయం అనుకున్నా. అదృష్టంకొద్దీ బతికి బయటపడ్డాం..’’ అన్నాడాయన.
డంకీ రూట్‌లో వెళ్లిన మరో వలసదారుడు గుర్‌వీందర్ సింగ్ అనుభవం కూడా బాధాకరమే!. భారత్ నుంచి నేరుగా గయానా చేరుకున్నాక డంకీ రూట్ మొదలైంది. అక్కడి నుంచి బస్సులో బ్రెజిల్‌కు.. ఆ తర్వాత బొలీవియా, పెరూ, ఈక్వెడార్‌ల మీదుగా ప్రయాణించి.. కొలంబియాకు చేరాడు. కొన్ని రోజులకు కపుర్గానా ద్వీపానికి తీసుకెళ్లారు సబ్‌ఏజెంట్లు. సముద్రంలో చిన్న పడవలో తీసుకెళ్లి డేరియన్‌గ్యాప్ అడవుల ముఖద్వారం వద్ద వదిలేశారు. ‘‘పర్లాంగు దూరంలో ఏముందో కనిపించనంత దట్టమైన అడవి డారియన్. అక్కడక్కడ అక్రమ వలసదారుల కోసం కొందరు ఏర్పాటు చేసిన సెంటర్లలో తలదాచుకున్నాం. కొన్ని రోజుల పాటు నడిచీ నడిచీ.. మైదాన ప్రాంతానికి చేరుకున్నాం. పనామా పట్టణానికి వెళ్లాక.. మమ్మల్ని కూరగాయల ట్రక్కులో పడేశారు. తిండి లేదు, నిద్ర లేదు. నీరసంతో శరీరం తూలిపోతోంది. అయినా సరే ఆగడానికి వీల్లేదన్నారు ఏజెంట్లు. పనామా నుంచి కోస్టారికా, నికరగువా, హోండరస్, గ్వాటెమాల దేశాలన్నీ రోడ్డు ప్రయాణాలతోనే దాటేశాం. ఆఖరికి మెక్సికో- అమెరికా సరిహద్దుకు చేరుకున్నాం. ఇక, ఒకే ఒక్క అడుగుదూరంలో కనిపిస్తోంది అమెరికా. ఆ దేశంలో పడితే.. ఇన్నిరోజులు పడిన కష్టమంతా మరిచిపోవచ్చు అనుకున్నాను.. సరిహద్దును దాటే క్రమంలో.. కనురెప్పపాటులో పోలీసులు వచ్చేశారు. చేతులెత్తేసి లొంగిపోయా. అరెస్టు చేశారు. శాండియాగోలో ఉన్న నిర్భందకేంద్రానికి తరలించారు. ఆ తర్వాత సైనిక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు..’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు గుర్‌వీందర్.
...ఇలా ఎంతోమంది ఆశావహుల అమెరికా కల నెరవేరలేదు. డంకీ రూట్ క్షేమంగా గమ్యం చేర్చలేదు.
- మల్లెంపూటి ఆదినారాయణ
భూభ్రమణం..
ఓ అక్రమ వలసదారుడు అమృత్‌సర్ (పంజాబ్) నుంచి అమెరికాకు ఎన్ని వేల కి.మీ. ప్రయాణించాడంటే..
ముంబయి 1657
సురినామ్ రివర్ 13,776
గయానా 375
బ్రెజిల్ 2438
బొలీవియా 1272
పెరూ 1469
ఈక్వెడార్ 890 కొలంబియా 833
కపుర్‌గానా 563
పనామాసిటీ 243
కోస్టారికా 473 నికరగువా 381
హోండరస్ 283
గ్వాటెమాల 463
కన్‌కున్ 822
మూసా 1462
సంకోబా 1482
టిజువానా(మెక్సికో) 3263
శాండియాగో (అమెరికా)లో అరెస్ట్. అక్కడి నుంచి తిరిగి అమృత్‌సర్ (ఇండియా)కు
12755 కి.మీ.