Ananya Nagalla: మధుసూదన రావుకు నివాళులు అర్పించిన హీరోయిన్ అనన్య నాగళ్ల
ABN, Publish Date - Apr 25 , 2025 | 05:49 PM
Ananya Nagalla: హీరోయిన్ అనన్య నాగళ్ల రియల్ హీరోయిన్ అనిపించుకుంది. నెల్లూరు కావలిలో ఉన్న మధుసూదనరావు ఇంటికి వెళ్లింది. మధుసూదనరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించింది. మధుసూదనరావు పార్థివదేహానికి నివాళులు అర్పించింది. అనంతరం అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడింది.
పహల్గామ్ ఘటనతో యావత్ దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది. చనిపోయిన 26 మంది అంత్యక్రియల్లో జనం వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి చివరి వీడ్కోలు పలుకుతున్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మధుసూదనరావు, చంద్రమౌళి కూడా ఉన్నారు. నెల్లూరులోని కావలిలో ఉన్న మధుసూదనరావు ఇంటికి నిన్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెళ్లారు. మధుసూదన రావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం విశాఖపట్నంలోని చంద్రమౌళి ఇంటికి కూడా వెళ్లారు. చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించారు. కన్నీళ్లు పెట్టుకున్న వారిని ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సినిమా పరిశ్రమనుంచి పవన్ తప్ప ఎవ్వరూ పహల్గామ్ బాధితుల ఇళ్లకు వెళ్లలేదు. కానీ, హీరోయిన్ అనన్య నాగళ్ల మాత్రం.. ఈ విషయంలో రియల్ హీరోయిన్ అనిపించుకుంది. నెల్లూరు కావలిలో ఉన్న మధుసూదనరావు ఇంటికి వెళ్లింది. మధుసూదనరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించింది. మధుసూదనరావు పార్థివదేహానికి నివాళులు అర్పించింది. అనంతరం అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడింది. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత అక్కడినుంచి వచ్చేసింది. గురువారం ఇందుకు సంబంధించి తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో పహల్గామ్ ఘటన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.
‘ పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈ రోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను. మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలి. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. నివాళులు అర్పిస్తున్న ఫొటోను, మీడియాతో మాట్లాడుతున్న ఫొటోను కూడా పోస్టులో షేర్ చేశారు.
Updated Date - Apr 25 , 2025 | 06:12 PM