Nagoba Jatara 2025 : నాగోబా జాతరకు వేళాయే... దారులన్నీ కేస్లాపూర్ వైపే..
ABN, Publish Date - Jan 28 , 2025 | 10:15 PM
ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహాజాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి 11గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభమైంది.
ఈ జాతరలో మేస్త్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ జాతరలో రాత్రి 12 గంటలకు గోదావరి నది జలాలతో అభిషేకం చేశారు. కొత్త కుండల్లో నీళ్లు తెచ్చి పుట్టని చేసి పూజ ప్రారంభించడంతో ఈ జాతర ఘనంగా ప్రారంభమైంది.
జనవరి 30వ తేదీన ఆలయం వెనుక ఉన్న పెద్ద దేవతకు పూజలు నిర్వహించే కార్యక్రమం ఉంటుంది.
31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. ఫిబ్రవరి1వ తేదీన భేతల్ పూజలు, మండ గాజిలి పూజలు చేయడంతో నాగోబా జాతర అధికారికంగా ముగుస్తుంది. జాతరకు వచ్చే భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ జాతరకు భక్తులు బారీగా తరలివస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేస్తుంది.
మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా జాతరకు తరలి వస్తున్నారు.
మెస్రం వంశీయులు తాము బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మెస్రం వంశ పెద్దలు కొత్త కుండలను ఇవ్వగా.. మహిళలు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్తకుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా... ఆ మట్టితో మహిళలు తిరిగి కొత్తపుట్టను తయారుచేశారు.
తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి మొక్కుకున్నారు.
అనంతరం ఏడు వరుసలతో తయారు చేసిన మట్టి ఉండలతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో సతిదేవతలను తయారుచేసి సంప్రదాయ పూజలు చేశారు.
పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 9 గంటల నుంచి 12గంటల వరకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు.
అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలిసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు బేటింగ్ (పరిచయం) పూజలకు ఏర్పాటు చేశారు. బేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు.
Updated Date - Jan 28 , 2025 | 10:34 PM