NATS: టాంపాలో ఘనంగా ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబరాలు
ABN, Publish Date - Jul 07 , 2025 | 03:25 PM
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. ఈ వేడుకల్లో ప్రముఖ నటులు వెంకటేశ్, నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. ఓర్పుతో ఉండాలని, ప్రతి ఒక్కరూ తమని తాము ప్రేమించుకోవాలని అన్నారు.
సహనం అలవరచుకోవాలని సూచించిన వెంకటేష్
ప్రతి ఒక్కరూ తమని తాము ప్రేమించడం నేర్చుకోవాలని కోరిన బాలకృష్ణ
శకపురుషుడు పుస్తకావిష్కరణ
జయసుధ, మీనా, శ్రీలీలలకు సత్కారం
అలరించిన స్థానిక కళాకారుల ప్రతిభ
తమ సత్తాను సరిగ్గా వాడుకోవాలన్న సినీగీత రచయితలు
సహనశీలురకు విజయం తప్పక లభిస్తుందని, ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలనేది దైవ నిర్ణయమని సినీనటుడు వెంకటేష్ అన్నారు. ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో ఆదివారం సాయంత్రం ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 8వ తెలుగు సంబరాలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో ఆయన లోతైన ప్రసంగం చేశారు. ఓర్పుగా ఉంటే ఒత్తిడి తొలగుతుందని, ప్రపంచం అందంగా ఉంటుందని, అందరూ సంతోషంగా ఉంటారని వెంకటేష్ అన్నారు. చిరంజీవితో ఒక సినిమా, త్రివిక్రంతో ఒకటి, మీనాతో దృశ్యం, బాలకృష్ణతో మరొక సినిమా చేస్తామని వెంకీ అన్నారు.
బాలకృష్ణ-వసుంధర దేవి దంపతులను జీవితసాఫల్య పురస్కారంతో సభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలతో పాటు నాట్స్ కార్యవర్గ సభ్యులు సత్కరించారు. నాట్స్ సంస్థ బసవతారకం ఆసుపత్రికి భారీ విరాళం ఇచ్చింది. తన వ్యక్తిత్వాన్ని చూసుకునే తనకు పొగరని, తమను తాము అందరూ తెలుసుకుని ప్రేమించడం నేర్చుకోవాలని బాలకృష్ణ తన ప్రసంగంలో కోరారు. థమన్ జోరైన సంగీతంతో ఈ సంబరాలకు ముగింపు పలికారు. బాలయ్య కూడా థమన్ జట్టుతో కలిసి గొంతు కలిపారు. పాటలు పాడి ప్రవాసులను అలరించారు.
ఎన్‌టీఆర్ గ్లోబల్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన శకపురుషుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. నందమూరి రామకృష్ణ, అట్లూరి అశ్విన్‌లు కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
జయసుధ, మీనా, దర్శకుడు గోపీచంద్, బండ్ల గణేష్, వివేక్ ఆత్రేయ తదితరులు నాట్స్ పురస్కారాలతో సహకరించారు. తంగిరాల సౌమ్య, గౌతు శిరీష్, వసంత కృష్ణప్రసాద్, అరవిందబాబు, రఘురామకృష్ణరాజు తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బాపు నూతి, కొత్తా శేఖరంలు ప్రవాస తెలుగు విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేశారు.
సంబరాల చివరి రోజు ఆదివారం నాడు పాత టీవీ సీరియల్స్ టైటిల్ సాంగ్స్ ఆలపించి స్థానిక ప్రవాస చిన్నారులు హుషారెక్కించారు. పిన్ని, మెట్టెలసవ్వడి, లేడి డిటెక్టివ్, అమృతంతో పాటు ప్రఖ్యాత వాణిజ్య ప్రకటనలు లైఫ్‌బాయ్, జండూ బాం, వికో, నిర్మా, పెప్సీ పాటలను ఆలపించి అతిథుల చేత శెభాష్ అనిపించారు.
ప్రవాస యువతీయువకుల కోసం వధూవరులను వెదికేందుకు పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాసుల తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో పాల్గొని తమ పిల్లల జీవితభాగస్వాములను వెదికేందుకు సహకరించారు.
ప్రస్తుత సినిమాల్లో ఆలోచన రేకెత్తించేవి, ఉత్సేజపరిచేవి, ప్రేరణాత్మకమైనవి ఎందుకు రావట్లేదనే ప్రవాసుల ప్రశ్నలకు రచయిత తనికెళ్ల భరణి సమాధానమిచ్చారు. తమ వద్ద, తన లాంటి రచయితల వద్ద కావల్సినంత జలం(ప్రతిభ) ఉందని, కానీ దాన్ని తోడి తీసుకోగలిగే సామర్థ్యమున్న వ్యక్తులు (నిర్మాతలు, దర్శకులు, హీరోలు) దొరకడం అరుదుగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. టాంపాలో నాట్స్ సంబరాల్లో ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం చలనచిత్ర గీత రచయితలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పాట గతి, తమకు ఎదురయ్యే సవాళ్లు, ఆలోచనా సరళి, పాట క్రమం, పాట రూపం వంటివాటిపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. మిథునం సినిమా వెనుక ఉన్న అరుదైన అనుభవాలను భరణి సభికులతో పంచుకున్నారు. రామజోగయ్య, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవతి, వీణాపాణి, వివేఖ్ ఆత్రేయలు ప్రసంగించారు. కొండవీటి జ్యోతిర్మయి స్థానిక చిన్నారులతో కలిసి కచేరీ నిర్వహించారు. మన్నవ సుబ్బారావు, కుచిభొట్ల ఆనంద్, యడ్ల హేమాప్రసాద్, కె.వి.రావు, శశికాంత్ వల్లేపల్లి, ఐకా రవి, తాళ్లూరి రాజా, తోటకూర విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
నాట్స్ సంబరాలు..టాంపాలో ‘పుష్ప’
నాట్స్ సంబరాల్లో గోవింద నామస్మరణ..
Updated Date - Jul 07 , 2025 | 03:39 PM