Tapasya Gehlawat: కుస్తీ...ఆమెకు ఒక తపస్సు
ABN, Publish Date - Aug 30 , 2025 | 04:21 AM
చిన్నప్పుడు రెజ్లింగ్ నేర్పిద్దామనుకొంటే... ఆడపిల్లకు అవసరమా’ అన్నారు. మెరుగైన శిక్షణ కోసం వేరే ఊరు పంపిద్దామంటే...
చిన్నప్పుడు రెజ్లింగ్ నేర్పిద్దామనుకొంటే... ‘ఆడపిల్లకు అవసరమా’ అన్నారు. మెరుగైన శిక్షణ కోసం వేరే ఊరు పంపిద్దామంటే... ‘ఒంటరిగా అలా ఎలా’ అని ప్రశ్నించారు. కానీ కట్టుబాట్లను అవహేళనలను పక్కనపెట్టి...కూతుర్ని చాంపియన్‌గా చూడాలనుకున్నాడు ఓ తండ్రి. అందర్నీ ఎదిరించి తన కోసం నిలబడ్డ నాన్న కల... తాతయ్య వారసత్వం... రెండిటినీ నెరవేర్చింది... 19 ఏళ్ల తపస్య గెహ్లావత్. బల్గేరియాలో జరిగిన అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో స్వర్ణ పతకం సాధించిన ఈ రెజ్లర్... అమ్మాయిలు ఎవరికీ తీసిపోరని నిరూపించింది.
‘ప్రపంచ చాంపియన్‌గా తిరిగిరా’... తపస్య తాత చివరి మాటలవి. పోటీలకు సరిగ్గా వారం ముందు గుండె పోటుతో ఆయన మరణించారు. ఆ సమయంలో తపస్య ఢిల్లీ సన్నాహక శిబిరంలో సాధన చేస్తోంది. వార్త విన్న వెంటనే ఇంటికి వచ్చేద్దామనుకొంటే... ఆమె తండ్రి పర్వేష్ ఒప్పుకోలేదు. ‘తాతయ్య చివరి కోరిక నిన్ను వరల్డ్ చాంపియన్‌గా చూడాలని. అదే విషయం నీతో చెప్పమన్నారు’ అంటూ కూతుర్ని సముదాయించారు. బాధను దిగమింగుకొని తాత ఆకాంక్ష నెరవేర్చేందుకు కఠోర సాధన చేసింది తపస్య. ఆగస్టు 20న బల్గేరియాలో జరిగిన ‘అండర్ 20 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌ప’ మహిళల 57 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచింది. సెమీఫైనల్‌లో జపాన్ రెజ్లర్, డిఫెండింగ్ చాంపియన్ సొవాకా ఉచిడాను మట్టి కరిపించి, సంచలనం సృష్టించింది. నలభై అంతర్జాతీయ బౌట్స్‌లో వరుస విజయాల తరువాత సొవాకాకు ఇదే తొలి ఓటమి కావడం విశేషం. అంచనాలు తలకిందులు చేస్తూ ఫైనల్స్‌కు చేరిన తపస్య... నార్వే క్రీడాకారిణి ఫెలిసిటాస్ డోమాజెవాను ఓడించింది. ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. విజయానంతరం భుజాలపై మువ్వన్నెల జెండా కప్పుకొని... స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ‘నాన్న కల, తాతయ్య చివరి కోరికను నెరవేర్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ భావోద్వేగానికి లోనైంది.
ఆడపిల్లకు అవసరమా అన్నారు’...
తపస్య కుటుంబంలో కుస్తీ కొత్తేమీ కాదు. ఆమె ముత్తాత చౌదరి హజారీలాల్ స్థానిక దంగల్‌లో పేరుమోసిన మల్లయోధుడు. ఆయన ఘనతలను తండ్రి పర్వేష్ కథలు కథలుగా తన కూతురుకు చెప్పేవారు. తపస్యను కూడా ఆయనంతటి రెజ్లర్‌ను చేయాలని కలలు కనేవారు. ‘‘మా తాత హజారీలాల్ చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే బౌట్స్‌లో అదరగొట్టేవారు. రెజ్లింగ్‌లో మాకు మెలకువలు ఎన్నో చెబుతుండేవారు. నేను కూడా మల్లయోధుడినే. స్కూల్ గేమ్స్ జాతీయ చాంపియన్‌ని. కానీ గాయం కారణంగా ఈ క్రీడను వదిలిపెట్టాల్సి వచ్చింది. అందుకే తపస్య పుట్టినప్పుడే అనుకున్నా... తనను మంచి రెజ్లర్‌ను చేయాలని. అయితే తనకు పదేళ్ల వయసులో శిక్షణలో చేర్పించాలని అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ‘ఆడపిల్ల మల్లయుద్ధం చేస్తుందా’ అంటూ ఎగతాళి చేశారు. శిక్షణకు పంపించవద్దని నా మీద ఒత్తిడి తెచ్చారు. కానీ నేను వేటికీ తలొగ్గలేదు. అప్పుడు ఒక్కటే సంకల్పించాను... ‘నా కూతుర్ని చాంపియన్‌గా చూడాలి. తను భారత్‌కు ప్రాతినిధ్యం వహించి పతకాలు తేవాలి’ అని. నా ప్రార్థనలు, ప్రయత్నాలు ఫలించాయి. నేడు తపస్య ప్రపంచ చాంపియన్. ఇది నాడు అవహేళన చేసినవారికి, ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడినవారికి తగిన సమాధానం’’ అంటారు పర్వేష్.
అప్పుడూ అడ్డుపడ్డారు...
ఇద్దరు సంతానంలో పెద్దమ్మాయి తపస్య. 2016లో రెజ్లింగ్ మొదలుపెట్టింది. ఆరంభంలో స్థానికంగానే శిక్షణ తీసుకుంది. ప్రొఫెషనల్‌గా ఎదగాలంటే అక్కడున్న సౌకర్యాలు సరిపోవు. దాంతో సోనీపత్ సమీపంలోని ‘యుధ్‌వీర్ అఖడా’లో కుల్‌బీర్ రాణా నేతృత్వంలో శిక్షణ ఇప్పించాలని పర్వేష్ అనుకున్నారు. వాళ్ల ఊరుకు వంద కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది ఆ అఖడా. ‘‘నేను చిన్నకారు రైతును. ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. కుటుంబమంతటికీ అదే ఆధారం. నా భార్య నవీన్ కుమారి టీచర్. బయట ఊరికి పంపించి కూతురికి కోచింగ్ ఇప్పించాలంటే మా సంపాదన సరిపోదు. దానికితోడు చుట్టుపక్కలవారు, సంఘం పెద్దల నుంచి ఒత్తిడి... ‘కట్టుబాట్లను కాదని ఆడపిల్లను బయటి ప్రాంతానికి పంపవద్ద’ని అప్పుడూ అడ్డుపడ్డారు. అయినా వెనక్కి తగ్గలేదు’’ అంటూ తపస్య తండ్రి నాటి రోజులు గుర్తు చేసుకున్నారు.
దేశం కోసం...
చిన్నప్పటి నుంచీ తపస్య పెద్దవాళ్ల అడుగుజాడల్లోనే నడిచింది. వయసు పెరిగే కొద్దీ ఆమెలో ఎంతో పరిణతి. పదమూడేళ్లప్పుడు ఇంటికి దూరంగా శిక్షణ కోసం వెళ్లినప్పుడు ఆమెకు ఒకటే లక్ష్యం... అమ్మానాన్న తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని. అంతేకాదు... భారత్‌కు ప్రాతినిధ్యం వహించి... దేశం కోసం పతకాలు తేవాలని. కోచ్ తపస్యను తన సొంత బిడ్డలా చూసుకున్నారు. బౌట్‌లో మేటిగా నిలబెట్టారు. స్థానిక పోటీలకు పంపించారు. క్రమంగా బౌట్‌లో పుంజుకొంటున్న తపస్య... రాష్ట్ర స్థాయి జూనియర్ విభాగంలో పలు టైటిళ్లు నెగ్గింది. గత ఏడాది థాయ్‌లాండ్‌లో జరిగిన అండర్ 20 ‘ఆసియా చాంపియన్‌షి్‌ప’ 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసం నింపడమే కాదు... కెరీర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లింది. అదే ఏడాది జాతీయ స్థాయి పోటీల్లో రజత పతకం గెలిచిన తపస్య... జాతీయ క్రీడల్లో చాంపియన్‌గా ఆవిర్భవించింది. ఈ ఏడాది చివర్లో జరిగే సీనియర్ వరల్డ్ చాంపియన్‌షి్‌పకు అర్హత సాధించింది. కోచింగ్ కోసం ఆమె తండ్రి ఐదు లక్షల రూపాయల అప్పు చేశారు. ‘ఇంకా ఆ అప్పు అలాగే ఉంది’ అంటారాయన. ప్రస్తుతం తపస్య తమ్ముడు దక్ష్ కూడా రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకొంటున్నాడు. ఏదిఏమైనా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్నదే తన లక్ష్యమంటున్న తపస్య... దాన్ని అందుకొనేందుకు ఒక తపస్సులా శ్రమిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..
Updated Date - Aug 30 , 2025 | 04:21 AM