Mangala Gauri Vratham: సర్వ శుభప్రదం శ్రావణం
ABN, Publish Date - Jul 25 , 2025 | 03:32 AM
ఏ మహిళ దోసిట శనగల మూటను పలకలించినా, పాదాలకు రాసుకున్న పసుపును పరామర్శించినా, శిరసు మీద అక్షతలను చూసి విశేషమేమిటని అడిగినా, ముంజేతి చేమంతి పూలతోరాన్ని...
విశేషం
ఏ మహిళ దోసిట శనగల మూటను పలకలించినా, పాదాలకు రాసుకున్న పసుపును పరామర్శించినా, శిరసు మీద అక్షతలను చూసి విశేషమేమిటని అడిగినా, ముంజేతి చేమంతి పూలతోరాన్ని ముచ్చటగా మాట్లాడించినా, అన్నిటికన్నా ముందుగా కొత్త పట్టుచీరల పెళపెళలను విన్నా, కొత్త బంగారు నగల తళతళలను కన్నా, తల పైకెత్తినప్పుడు... ‘ఎప్పుడు కురుస్తానో నాకే తెలియదం’టూ నల్లని రూపంతో, ఫెళఫెళ గర్జన ధ్వనులతో కనిపిస్తున్న మేఘాలను చూసినా... ‘ఇంకేముంది? ఇది శ్రావణం సుమా!’ అని అర్థమైపోతుంది. ఇదంతా అత్యంత మనోహరం కదూ!
నేటినుంచి శ్రావణమాసం
మంగళగౌరీ వ్రతం ఎందుకంటే...
శ్రావణ మాసం వ్రతాల మాసం. విశేషమేమిటంటే... శ్రీమహాలక్ష్మికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో మంగళగౌరికి కూడా సముచిత స్థానం ఉంటుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఆరాధించేది గౌరీ దేవినే. హిమవంతుని పుత్రిక అయిన శైలజ... వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, చలికి గడ్డకట్టుకుపోతూ ఉన్నా చలించకుండా తపస్సు చేసింది. దానితో ఆమె శరీరం గౌర వర్ణానికి (ఎండిపోయిన లేత పసుపుపచ్చ దర్భ గడ్డి రంగులోకి) మారింది. అందుకే ఆమె ‘గౌరి’ అయింది. శంకరుణ్ణి తన భర్తగా (పినాకపాణిం పతిమాప్తు మిచ్ఛతి) భావించి, చివరకు ఆ మంగళకరమైన లక్ష్యాన్ని సాధించింది కాబట్టి ఆమెను ‘‘మంగళ గౌరి’ అని పిలుస్తాం. ఆ గౌరి తన కోరికను నెరవేర్చుకొని, కాబోయే భర్తను తన వద్దకు రప్పించుకొని, తన మాట వినేలా ఏ విధంగా చేసుకుందో... అటువంటి శక్తిని తనకు ఇవ్వాలని ప్రార్థించడానికి, ఆ శక్తిని పొందడానికి వివాహంలో ప్రతి వధువుతో గౌరీ పూజ చేయిస్తారు. అంటే మంగళగౌరీ వ్రతం అనేది భార్యాభర్తల మధ్య అన్యోన్యత సిద్ధించడం కోసం చేసేది. ఆ గౌరీదేవి శంకరుణ్ణి వివాహం చేసుకున్నాక పార్వతిగా లోక ప్రసిద్ధురాలయింది. విఘ్నాలను నివారించగల శక్తి ఉన్న గణపతి, సంతానాన్ని ప్రసాదించి, సర్ప దోషాన్ని పోగొట్టగలిగే శక్తి ఉన్న కుమార స్వామి ఆమె సంతానం. కాబట్టి... మంగళ గౌరీ వ్రతం ఆచరించడం అన్యోన్య దాంపత్యం కోసం, విఘ్ననాశనం కోసం, సంతాన ప్రాప్తికోసం,
కోరిన వరాలిచ్చే పూజ...
శ్రావణమాసంలో మహిళలు అత్యంత శ్రద్ధాభక్తులతో చేసుకొనేది వరలక్ష్మీ వ్రతం. చిత్తడి చిత్తడిగా ఉండే వర్షాకాలంలో ఈ వ్రతాన్ని నిర్దేశించడానికి కారణం... వర్షానికి తడిసి భూమినుంచి వచ్చే పంటే గొప్ప ధనం అని చెప్పడానికే. అలాగే... మహా ధనవంతురాలికి, సంతానం లేక తపన పడుతున్న వారికి, అత్తమామలతో సఖ్యత లేని వారికి, అనారోగ్యంతో, ఇతర సమస్యలతో తల్లడిల్లుతున్నవారికి ధనం ఇస్తే ప్రయోజనం ఉంటుందా? అది చెరువుకు జలదానం చేసినట్టే కదా! కాబట్టి తాను సంపదకు సంకేతం అయినప్పటికీ... ఎవరైతే తనను పూజించి, తనకు ఏ లోపం ఉందో ఆ లోపం తీరడం కోసం దేన్ని వరంగా (వృణుతే ఇతి) కోరుతారో దాన్ని ఇస్తానంది శ్రీమహాలక్ష్మి. ఆ విధంగా తనను వరలక్ష్మిగా, తన పూజను వరలక్ష్మీ పూజగా స్థిరపరుచు కుంది. ఆమెతో పాటు మంగళగౌరిని కూడా ఈ నెలరోజులూ ఆరాధించాలనే నిర్దేశానికి కారణం... శివుని పత్ని అయిన గౌరికి, విష్ణు పత్ని అయిన తనకు, అలాగే శివకేశవులకు ఎలాంటి భేదం లేదని దృఢంగా ప్రకటించడానికే.
డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు,
9866700425
ఆరోగ్య సూత్రాలు ఎన్నెన్నో...
మంగళ గౌరీ వ్రతం చేసినప్పుడు... బియ్యపు పిండి, బెల్లం కలిపిన కుందెను చేసి, దాని నిండా ఆవు నెయ్యి పోసి, పత్తితో చేసిన వత్తిని వేసి వెలిగించి... వ్రత కథ చదువుతారు. కథ పూర్తయ్యేసరికి ఆ ఆవు నెయ్యి ఆ వత్తి మంట ద్వారా నిదానంగా ఉడుకుతుంది. గర్భధారణలో ఏవైనా దోషాలుంటే తొలగించగలిగే శక్తి ఉన్న దివ్యౌషధంగా మారుతుంది. పూర్వం పసుపు కొమ్ముల్ని దంచి పసుపుగాను, దాంట్లో చిన్నాళమనే చిన్న రాతిని వేసి, దంచి, కలిపి కుంకుమగానూ ఆ తల్లి సమక్షంలో చేసుకొని... ముత్తయిదువులకు పంచుకొనే వారు. మహిళలందరూ కలిసి, అమ్మవారి పాటలు పాడుకుంటూ... అమ్మవారి సమక్షంలోనే కాటుక తయారు చేసుకొనేవారు. అంగళ్ళలో దొరికే వాటితో పోలిస్తే ఇవి ఎంతో ఆరోగ్యకరం. కాగా... మహిళలు చెవిలో పువ్వు పెట్టుకోవడం, కంఠానికి గంధం రాసుకోవడం సరికాదని, ఏ పుష్పాన్నయినా తలలో, అంటే కొప్పులోనే ధరించాలని, గంధాన్ని రెండు దవడలకు మాత్రమే సన్నని చారలుగా ధరించాలని శాస్త్రం చెబుతోంది. దీనికి కారణం ఏమిటి? దుర్వాసనను మాత్రమే ఇష్టపడే పేలు, ఈపెలు (చిన్న పేను గుడ్లు) లాంటివి పూల సుగంధం వల్ల తలలో చేరవు. అలాగే మాట ఉత్పత్తి అయ్యే అవయవాల్లో దవడలు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ‘‘ఆ గంధం ఎలా పరిమళం వెదజల్లుతూ ఆకర్షిస్తుందో... మీ మాటలు కూడా అలాగే ఉండాలి ’’అని ఇది సూచిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 03:32 AM