ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Women Leading Excellence: రైల్వే నిర్వహణ... ఈ మహిళామణులదే

ABN, Publish Date - Aug 23 , 2025 | 04:26 AM

దక్షిణమధ్య రైల్వే ఎస్‌సీఆర్‌ జోన్‌లో ప్రస్తుతం 80,527 మంది పని చేస్తున్నారు. వారిలో 8,968 మంది మహిళలు. 53 మంది..

దక్షిణమధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) జోన్‌లో ప్రస్తుతం 80,527 మంది పని చేస్తున్నారు. వారిలో 8,968 మంది మహిళలు. 53 మంది లోకో పైలెట్లు, 64 మంది స్టేషన్‌మాస్టర్లతో పాటు 837 మంది ట్రాక్‌ మెయింటెనర్లుగా, 606 మంది సాంకేతిక నిపుణులుగా, 134 మంది మహిళలు అధికారులుగా సేవలు అందిస్తున్నారు. నిర్దిష్టమైన పని గంటలకు రైల్వే వ్యవస్థలో అవకాశం ఉండదు. ముఖ్యంగా రైళ్ల నిర్వహణను పర్యవేక్షించే అధికారులు రాత్రింబవళ్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. అన్నిటినీ అధిగమించి మగవారికి దీటుగా మహిళలు సత్తా చాటుతున్నారు.

రైళ్ల ఆపరేటింగ్‌ అధిపతి...

- పద్మజ

దక్షిణమధ్య రైల్వేలో అత్యంత కీలకమైన విభాగం... ఆపరేటింగ్‌. ఈ విభాగానికి ప్రిన్సిప ల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు... కె.పద్మజ. ప్రధానంగా ఆమె రైళ్ల రాకపోకలపై దృష్టి పెట్టారు. సమయపాలన పాటించడంలోనూ, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలోనూ కీలకంగా వ్యవహరించారు. 1991 బ్యాచ్‌ ఐఆర్‌టీఎస్‌ అధికారి అయిన పద్మజ... రైళ్ల షెడ్యూలింగ్‌, ట్రాఫిక్‌ నిర్వహణలో ఇతర శాఖలతో సమన్వయం చేసు కొంటూ సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టిన ఆమె... గతంలో ఇదే జోన్‌లో వాణిజ్య, నిర్వహణ విభాగాన్ని పర్యవేక్షించారు. పండుగలు, ఉత్సవాల సమయంలో ప్రయాణికుల రద్దీని పక్కాగా అంచనా వేసి... వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లను విజయవంతంగా నడిపించారు. అంతేకాదు... 49 మిలియన్‌ టన్నుల సరుకును లోడింగ్‌ చేసి రికార్డు నెలకొల్పారు.

నిధుల నిర్వ హణ...

- హేమసునీత

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్‌సీఆర్‌ జోన్‌లో ప్రిన్సిపల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా హేమ సునీత బాధ్యతలు చేపట్టారు. 1993 బ్యాచ్‌ ఐఆర్‌ఎ్‌సఎస్‌ అధికారి అయిన ఆమె... గతంలో ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌- చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పని చేశారు. ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ అడ్వైజర్‌గా జోన్‌ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘యూరోపియన్‌ బిజినెస్‌ స్కూల్‌’లో ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందిన హేమ సునీత... పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌, టాక్స్‌ లాస్‌ తదితరాల్లో నైపుణ్యం సంపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై వరకు ఎస్‌సీఆర్‌కు రూ.8,081 కోట్లు ఆదాయం సమకూరింది. ఇందులో ఆమె కృషి ఎంతో ఉంది. గత ఏడాది ఇదే కాలానికి ఆదాయంతో పోలిస్తే మూడు శాతం వృద్ధి నమోదైంది. హేమ సునీత... ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో అద్భుత పనితీరు ప్రదర్శిస్తూ... జోన్‌ను లాభాల ట్రాక్‌పై నడుపుతున్నారు.

రైల్వే పోలీస్‌ చీఫ్‌...

- ఆరోమాసింగ్‌

రోజూ సుమారు లక్షమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే దక్షిణమధ్య రైల్వే పోలీసింగ్‌ వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నారు అరోమాసింగ్‌ ఠాకూర్‌. 1993 బ్యాచ్‌ ఐఆర్‌పీఎ్‌ఫఎస్‌ అధికారి అయిన ఆమె... 2023లో ఎస్‌సీఆర్‌ జోన్‌లో ఐజీ కమ్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే ఆస్తులను కాపాడటంతోపాటు రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆమె నేతృత్వంలో ‘ఆపరేషన్‌ యాత్రి సురక్ష, ఆపరేషన్‌ అమానత్‌, ఆపరేషన్‌ నన్హే ఫరిసే, ఆపరేషన్‌ సతర్క్‌’ లాంటి ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి. మహిళా ప్రయాణికుల భద్రత కోసం మహిళా శక్తి బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే ‘యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌’లు ప్రారంభించి స్టేషన్లు, రైళ్లలో నిరంతర నిఘా పెట్టారు.

ఉద్యోగుల ఆరోగ్య పర్యవేక్షణ...

- డాక్టర్‌ నిర్మల

ఎస్‌సీఆర్‌లో పని చేస్తున్న ఎనభై వేల మందికి పైగా ఉద్యోగుల ఆరోగ్య పర్యవేక్షణ బాధ్యత డాక్టర్‌ నిర్మల రాజారాంది. ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెడికల్‌ డైరెక్టర్‌ హోదాలో రైల్వే ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. 380 పడకల లాలాగూడ కేంద్ర రైల్వే ఆసుపత్రితో పాటు జోన్‌ పరిధిలోని విజయవాడ, గుంతకల్‌, నాందేడ్‌, గుంటూరు డివిజనల్‌, తిరుపతి, రాయనపాడు సబ్‌డివిజనల్‌ ఆసుపత్రులు, 40 హెల్త్‌ యూనిట్‌లను పర్యవేక్షిస్తున్నారు. 1989 బ్యాచ్‌ ఐఆర్‌హెచ్‌ఎ్‌స అధికారి అయిన నిర్మల... గత ఏడాది డిసెంబరులో ఈ బాధ్యతలను చేపట్టారు.

వాణిజ్య విభాగం...

- ఇతి పాండే

దక్షిణమధ్య రైల్వేలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ప్రత్యేకతను చాటుకొంటున్నారు ఇతి పాండే. 2023లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కామ్రేడ్స్‌ మారథాన్‌లో... 11.47 గంటల్లో 88 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా సివిల్‌ సర్వెంట్‌గా రికార్డులకు ఎక్కారు. 1998 బ్యాచ్‌ ఐఆర్‌టీఎస్‌ అధికారి అయిన ఆమె... 2024లో బ్యూరోక్రాట్స్‌ ఛేంజ్‌మేకర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎస్‌సీఆర్‌లో టికెట్‌ అమ్మకాలు, అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌, స్టేషన్‌ నిర్వహణ, ఫ్రయిట్‌ సేవలు, మార్కెటింగ్‌తో పాటు ఆదాయ వనరుల పెంపుదల కోసం సంస్కరణలు తీసుకువచ్చారు. రైల్వేకు చేసిన సేవలకు గుర్తింపుగా ఇతి పాండే ‘రైల్‌ మంత్రి రాజభాష రజత్‌ పదక్‌ (2025), ఎక్సలెన్స్‌ - మెరిటోరియస్‌ సర్వీసెస్‌ (2007), విమెన్‌ అఛీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (2016) తదితర అవార్డులు అందుకున్నారు. అలాగే పశ్చిమ రైల్వేకు సంబంధించి సరుకు రవాణా కార్యకలాపాలపై సమగ్ర అవలోకనంతో ‘రైడింగ్‌ ది ఫ్రయిట్‌ ట్రైన్‌’ అనే పుస్తకం కూడా రాశారు.

-వరకాల యాదగిరి, హైదరాబాద్‌

Updated Date - Aug 23 , 2025 | 04:26 AM